గజ్వేల్ అర్బన్, సెప్టెంబర్ 15: అభివృద్ధిని కూడా ఉద్యమంలా చేసే కేసీఆరే మళ్లీ సీఎం కావాలని, గజ్వేల్ నుంచి మూడోసారి పోటీ చేయనున్న కేసీఆర్‌ను మరోసారి లక్ష పైచిలుకు మెజార్టీతో గెలిపిస్తామని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, పాలకవర్గ సభ్యులు శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావును కలిసి తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రెండుసార్లు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించడంతో గజ్వేల్ పట్టణంతోపాటు నియోజకవర్గం వందేండ్ల అభివృద్ధి కేవలం పదేండ్లలో జరిగిందని అన్నారు. ఈ అభివృద్ధిని ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని తెలిపారు.
అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్‌ను నియోజకవర్గ ప్రజలంతా మూడోసారి లక్షకుపైగా మెజార్టీతో గెలిపిస్తారని స్పష్టం చేశారు. ఇందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, శ్రమించడానికి గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం ముందు వరుసలో ఉంటుందని మంత్రి హరీశ్‌రావుకు విన్నవించారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకియొద్దీన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.