జనగామ: అన్నదాతకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పొలంబాట పట్టారు. రైతుకు బాసటగా నిలిచేందుకు, కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్‌తండాకు చేరుకున్నారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అన్నదాలతకు ధైర్యాన్నిచ్చి భరోసా కల్పించారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ తదితరులు ఉన్నారు.
కాగా, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గాన జనగామ జిల్లాకు బయల్దేరిన కేసీఆర్‌కు.. అడుగడుగా ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. బీఆర్ఎస్ అధినేతకు ధరావత్‌తండా వాసులు ఘనస్వాగతం పలికారు. అక్కడ రైతులను పరామర్శించిన అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి బయల్దేరారు. తుంగతుర్తితో పాటు అర్వపల్లి, సూర్యాపేట మండలంలో ఎండిన పంటలను పరిశీలించి, మధ్యాహ్నం ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి, 3 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 3.30 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం 4.30 గంటలకు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరుకు చేరుకుంటారు. అక్కడ పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారు. సాయంత్రం ఆరు గంటలకు బయల్దేరి నల్లగొండ మీదుగా రాత్రి 9 గంటలకు ఎర్రవల్లి చేరుకుంటారు.
LIVE: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నీళ్లందక ఎండిన పంట పొలాలను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
📍దరావత్ తండా, దేవరుప్పల, జనగాం జిల్లా
https://t.co/SkOokXVGYf— BRS Party (@BRSparty) March 31, 2024