ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి గోదావరి జలాలను అందించేందుకు వీలుగా రూపొందించిన సీతారామ ఎత్తిపోతల పథకానికి టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద 2016 ఫిబ్రవరి 16న శంకుస్థాపన చేస్తున్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. 8 ఏండ్లలో 7,400 కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని దాదాపు పూర్తిచేసింది.
సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌లను ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. భద్రాద్రి జిల్లా పూసుగూడెం వద్ద నిర్మించిన పంపుహౌస్‌ను సీఎం రేవంత్ ప్రారంభించారు. బీజీ కొత్తూరు పంపుహౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి, కమలాపురం పంపుహౌస్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.
8 నెలలు గడిచిపోయాయి. ఒక్క పంప్నూ బిగించలేదు. ఒక్క మోటరైనా కొత్తగ పెట్టలేదు. పైగా సీతారామ ప్రాజెక్టే వృథా అన్నారు. ఖర్చు భారమని, అంచనాలు పెరిగిపోయాయని చెప్తూ వచ్చారు. తీరా ఇప్పుడు ఆ ప్రాజెక్టు తామే కట్టామని, క్రెడిట్ అంతా తమదేనని అంటున్నారు. కానీ ఖమ్మం ప్రజలకు తెలుసు. ప్రాజెక్టు ఎవరి ఆలోచనో! ఎవరి ప్రయత్నమో! ఎవరి కష్టమో! కాంగ్రెస్ పాలనలో తట్టెడు మట్టి కూడా తియ్యకుండా ఆగిపోయిన ప్రాజెక్టులను పట్టాలెక్కించి పరుగులు తీయించింది కేసీఆర్.
ఒకటికాదు రెండుకాదు.. పదుల సంఖ్యలో ఎత్తిపోతల పథకాలను వేగంగా పూర్తిచేసిన ఘనత కేసీఆర్‌దే. ప్రభుత్వం మారిన తర్వాత కూడా.. సీతారామ ప్రాజెక్టు దాదాపు పూర్తయ్యిందని, తుదిమెరుగులు దిద్దితే రైతులకు నీళ్లందించవచ్చని ప్రభుత్వానికి కేసీఆర్ గుర్తుచేశారు. ఆయన చెప్పిన తర్వాత కదలిన ప్రభుత్వం.. గురువారం ప్రాజెక్టు పంప్‌హౌస్‌లను ప్రారంభించింది.