హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తేతెలంగాణ):ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్ఫూర్తితో నేటి యువత రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పాలకుల దుర్నీతిని ఎండగట్టాలని యువతకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు జయంతి పురస్కరించుకొని బుధవారం కేసీఆర్ ఒక ప్రకటనలో ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు.
‘అవనిపై జరిగేటి అవకతవకలు జూచి ఎందుకో నా హృదిన ఇన్ని ఆవేదనలు?’అంటూ తోటి సమాజం ఎదుర్కొంటున్న కష్టాలను తన కన్నీటితో కలిపి పంచుకున్న తెలంగాణ మనసుకవి కాళోజీ అని కీర్తించారు. తెలంగాణ జన జీవితానికి పర్యాయపదంగా నిలిచిన కాళోజీ జీవన ప్రస్థానమంతా.. తెలంగాణ భాషను, యాసను మేళవించి తెలంగాణ ఆత్మగౌరవ ప్రకటన దిశగా సాగిందని కొనియాడారు. తెలంగాణ సాధన కోసం తాను ప్రారంభించిన మలి దశ పోరాటంలో ‘దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతాం.. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతరేస్తం..’ అనే స్ఫూర్తి ఇమిడి ఉన్నదని కేసీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో సముచిత గౌరవం
బీఆర్ఎస్ పాలనలో ప్రజాకవి కాళోజీని సముచితంగా గౌరవించామని కేసీఆర్ తెలిపారు. ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించినట్టు గుర్తుచేశారు. తెలంగాణ సాహిత్యరంగంలో విశేష కృషిచేసిన కవులు, రచయితలకు ఏటా కాళోజీ నారాయణరావు పురస్కారాలతో సత్కరించే సంప్రదాయాన్ని ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆయన పేరిట కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పామని తెలిపారు.