హైదరాబాద్, జూన్ 7: గుండె సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానలో చేరిన బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించనున్నారు. మాగంటి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆదివారం హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానకు వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడిన గోపీనాథ్ గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు అక్కడ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నది. మాగంటి ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు కేసీఆర్ దవాఖానకు వెళ్లి పరామర్శించనున్నారు.
మాగంటి దవాఖానలో చేరిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అమెరికా పర్యటనను కుదించుకుని శనివారం హైదరాబాద్ చేరుకుని గోపీనాథ్‌ను పరామర్శించారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాగంటికి అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఎమ్మెల్యే మాగంటి కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్ కుమార్, రవీందర్ రావు, నాయకులు మాలోతు కవిత, రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇతర నాయకులు ఉన్నారు.
మాగంటి గోపీనాథ్ 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యవత అధ్యక్షుడిగా పనిచేసిన మాగంటి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగారు. తన సమీప మజ్లిస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై 9 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో తొలిసారే విజయాన్ని రుచిచూశారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పీ విష్ణువర్ధన్‌రెడ్డిపై విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ మరోసారి జూబ్లీహిల్స్ నుంచే పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌పై గెలిచి హ్యాట్రిక్ సాధించారు. నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ తెలంగాణే శ్వాసగా పనిచేసే బీఆర్ఎస్ జెండాను రెపరెపలాడించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ నగరంలో కీలక నేతగా ఎదిగారు.