KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు దంపతులు సోమవారం స్వగ్రామం చింతమడకకు వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్, శోభ దంపతులు ఓటు వేయనున్నారు. ఎర్రవెల్లి నివాసం నుంచి సోమవారం చింతమడకకు బయలుదేరి వెళ్తారు. ఉదయం 11.00 గంటలకు చింతమడక గ్రామంలో కేసీఆర్ దంపతులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటారు.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నాల్గో దశ పోలింగ్ సోమవారం జరుగనున్నది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. 3.32కోట్ల మంది ఓటుహక్కు ఓటు వేసేలా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 1.90లక్షల మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటారని.. 161 కంపెనీల కేంద్ర సాయుధ దళాలు, పారా మిలిటరీ బలగాలతో మొత్తం 70వేల మంది సిబ్బందిని ఎన్నికల్లో భద్రత కోసం మోహరించినట్లు ఈసీ తెలిపింది.