Harish Rao | యాదాద్రి భువనగిరి/జనగామ, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పాప పరిహారం కోసం తాను ఒట్టు పెట్టిన దేవుళ్ల వద్దకు వెళ్లి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో దగా పడుతున్న రాష్ట్ర రైతాంగానికి అండగా నిలబడేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో రైతుయాత్ర చేపడుతారని వెల్లడించారు. గురువారం ఆయన పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ తూర్పు గోపురం వద్ద పాప పరిహార పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత హరిత హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఆ తరువాత ఆలేరు పట్టణం లో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో జనగామలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవీప్రసాద్, రాకేశ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఆయా కార్యక్రమాల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే ఏకమొత్తంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని, రైతుల రుణం తీరుస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు రైతులతో రణం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అక్రమ కేసులతో వేధిస్తున్నదని దుయ్యబట్టారు. చివరి రైతు వరకూ రుణమాఫీ అయ్యేదాకా రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆగస్టు 15లోగా మాఫీ చేస్తానని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిపై ఒట్టు వేసి, మోసం చేశారని, రేవంత్‌రెడ్డి పాపం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలకుడు పాపం చేస్తే ప్రజలకు అరిష్టమని పేర్కొన్నారు. సీఎంను క్షమించాలని, ప్రజలను ఆశీర్వదించాలని స్వామివారిని వేడుకున్నట్టు చెప్పారు. అన్ని రకాల వడ్లకు బోనస్, రైతుభరోసా, పూర్తిస్థాయి రుణమాఫీ అయ్యేంత వరకు పోరాడేలా బీఆర్ఎస్కు శక్తిని ప్రసాదించాలని లక్ష్మీనరసింహుడిని కోరినట్టు తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రమాణం చేసిన ఆలయాలు, మెదక్ చర్చి, జహంగీర్‌పీర్ దర్గా వంటి అన్ని చోట్లకూ వెళ్లి దేవుళ్లను ప్రార్థిస్తామని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రికి రుణమాఫీపై మాట్లాడే మొహం లేక మీడియాతో మాట్లాడాలంటూ మంత్రులను కాళ్లావేళ్లా పడుతున్నారని ఎద్దేవా చేశారు.
‘డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్‌రెడ్డా? కాదా? డిసెంబర్ 7న ఎందుకు మాఫీ చేయలేదు? గద్దెనెక్కాక రుణమాఫీ మర్చిపోయిండు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల హామీలతో ప్రజలను మోసగించిండు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మడం లేదని చివరికి దేవుళ్ల మీద ఒట్లు పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతానని ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టిండు.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిపై కూడా ఒట్టు పెట్టిండు. నర్సన్న తెలంగాణ కొంగుబంగారం. ఎంతో మహిమ గల దేవుడు. ఆయన మీద ఒట్టు పెట్టి మాట తప్పితే క్షమించరాని నేరం. పాలకుడే పాపం చేసి మాట తప్పడం వల్ల ప్రజలకు, రాష్ర్టానికి అరిష్టం వాటిళ్లవద్దని స్వామివారిని దర్శించుకున్నాం. ఈ పాపాత్ముడిని, దుర్మార్గుడిని, దివాలాకోరు ముఖ్యమంత్రిని క్షమించండి. రేవంత్‌రెడ్డి చేస్తే శిక్ష ప్రజలకు పడవద్దని.. తెలంగాణ ప్రజలను దీవించండని స్వామివారిని వేడుకున్నాం. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని దేవుడి మీద ఒట్టు వేసి చేయకపోవడం మోసం కాదా? రైతులనే కాదు.. దేవుడిని కూడా రేవంత్‌రెడ్డి మోసం చేసిండు. దైవ ద్రోహానికి పాల్పడ్డారు’ అని హరీశ్‌రావు విమర్శించారు.
నిజంగా రుణమాఫీ అయితే బ్యాంక్‌ల వద్ద రైతులు ఎందుకు పడిగాపులు కాస్తున్నరు? వ్యవసాయ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా ఎందుకు తిరుగుతున్నరు? సీఎం దిష్టిబొమ్మలను ఎందుకు తగలబెడుతున్నరు? రోడ్ల మీదకు వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తున్నరు? రైతుభరోసా ఎందుకు ఇవ్వలేదు? ఎప్పుడు ఇస్తవ్? చిన్న సన్నకారు రైతులు అప్పులు చేసుకునే పరిస్థితి వచ్చింది.
‘రైతు రుణమాఫీ చేశాం.. నన్ను రాజీనామా చేయమంటుండు. ప్రజల పక్షాన పోరాడటమే నాకు తెలుసు. మాట మీద నిలబడటం నాకు తెలుసు. రెండుసార్లు ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర మాది. మోసం చేసే చరిత్ర నీది. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పిన చరిత్ర నీది. రుణమాఫీ అంటూ దేవుళ్లను కూడా మోసం చేసిన చరిత్ర నీది’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు.
‘ప్రజాపాలనలో ధర్నాలు నిషేధం అంటూ పోలీసులు రైతులకు నోటీసులు ఇస్తున్నరు. బాల్కొండలో ధర్నాలో పాల్గొంటే కేసులు, చర్యలు ఉంటాయని రైతులకు నోటీసులు ఇచ్చారు. రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మీడియా ప్రతినిధులపై సీఎం అనుచరులు దాడులు చేశారు. కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడిలో నిరసన తెలపడానికి వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్‌లో పోలీస్ యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చారు. అడుగడుగునా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నరు’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
లాఠీలతోనో, బెదిరింపులతోనో, పోలీసులతోనో రైతుల ఆగ్రహానికి ఆనకట్టు వేయలేరు. నువ్వు చేసిన మోసం, ద్రోహాన్ని సరిచేసుకోవాలి. పోలీసులు, లాఠీలతో రైతులను అడ్డుకోవడం మూర్ఖత్వం. అన్నదాతకు అన్యాయం చేసినోడు బాగుపడినట్టు చరిత్రలో లేదు.
– హరీశ్‌రావు
ప్రజారాజ్యం, ఇందిరమ్మ రాజ్యమంటే అణిచివేయడమేనా? ఇందిరమ్మ రాజ్యంలో నిరసన తెలిపే హక్కు ఉండదా? రైతులు తమ బాధలను చెప్పుకొని, నిరసన తెలిపే హక్కు ఉండదా? అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా, చివరి రైతు వరకూ రుణమాఫీ అయ్యే దాకా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కొట్లాడుతూనే ఉంటదని స్పష్టంచేశారు. పోలీసులు కూడా చట్టం ప్రకారం నడుచుకోవాలని, చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వానికి కొమ్ముగాయొద్దని హితవు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు..అన్నీ రాసిపెడుతున్నాం.. నాలుగేండ్లకు మళ్లీ మేం వస్తాం.. చట్ట ప్రకారం వ్యవహరించండి జాగ్రత్త్త’అంటూ పోలీసులను హెచ్చరించారు. ఆగస్టు నెల వచ్చినా ఊర్లల్లో చెరువులు నింపడం లేదని, 11 విడతల్లో రూ.72 కోట్ల రైతుబంధు, రైతుబీమా ఇచ్చి చెరువులు నింపి ఎండాకాలంలోనూ మత్తళ్లు దుంకేలా నీళ్లు నింపిన ఘనత కేసిఆర్‌ది అని స్పష్టంచేశారు.
యాదగిరిగుట్టలోని హరిత హోటల్లో మీ డియాతో హరీశ్‌రావు మాట్లాడుతుండగా కరెం టు పోయింది. దీంతో ప్రజాప్రతినిధులతోపాటు అక్కడున్న మీడియా ప్రతినిధులు నవ్వుకున్నారు. దాంతో కొంతసేపు కరెంట్ లేకుండానే ప్రెస్‌మీట్ కొనసాగించారు. కొద్దిసేపటి తర్వాత కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు.
రేవంత్‌రెడ్డీ.. నీకు నీతి, నిజాయతీ ఉంటే బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పు. నువ్వు ఒట్టు వేసిన దేవుళ్ల దగ్గరకు వెళ్లి ప్రాయశ్చిత్తం చేసుకో. ‘దేవుడా! నేను తప్పు చేసిన.. నన్ను క్షమించు.. తొందరపడి ప్రమాణం చేసిన’ అని చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకో. నువ్వు చేసుకోవు గనుకనే మేం రావాల్సి వచ్చింది. పాపాత్ముడు, అబద్ధ్దాలకోరు, దివాలాకోరు, దగాకోరు సీఎంను తెలంగాణ ప్రజల ముఖం చూసి క్షమించాలని, రాష్ట్ర ప్రజలను దీవించాలని లక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నాం. పాలకుడు పాపం చేస్తే ప్రజలకు అరిష్టం చుట్టుకుంటుందని పాప పరిహార పూజలు చేశాం.
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే రైతులే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవనేని కృష్ణారావు, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నేతలు క్యామ మల్లేశ్, బూడిద భిక్షమయ్యగౌడ్, గొంగిడి మహేందర్‌రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డి అంటే కుచితం, కుతంత్రం, కటిలం, కపటమని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కపట నాటక సూత్రధారి అని మండిపడ్డారు. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ గీతాన్ని పాడని గొంతు ఉందంటే అది రేవంత్‌రెడ్డిదేనని విమర్శించారు. రైతులను మోసం చేసిన రేవంత్‌రెడ్డికి రైతన్నలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
సంపూర్ణ రుణమాఫీ జరిగేదాకా, రూ.2 లక్షలు రైతుల బ్యాంక్ ఖాతాల్ల్లో పడేదాకా ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తేలేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. డిసెంబర్లో చేయాల్సిన రుణమాఫీని ఆలస్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ చెల్లించలేదని, వేలాది రైతులకు రుణమాఫీ చేయకుండా మోసం చేసిందని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి అందరినీ మోసం చేశారని హరీశ్‌రావు దుయ్యబట్టారు. అన్ని రకాల పంటలకు బోనస్ వచ్చే దాకా, రైతులకు పూర్తిగా రుణమాఫీ జరిగే దాకా, రైతుభరోసా ఇచ్చే దాకా పోరాడే శక్తిని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు అందించాలని స్వామివారిని వేడుకున్నామని, ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేసి ఉంటే, రైతుల మీద వడ్డీల భారం పడేది కాదని, ఆగస్టులో మాఫీ చేయడం వల్ల ఏడు నెలల వడ్డీ భారం రైతుల మీద పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీలో జాప్యం చేసినందుకు ఏడు నెలల వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తప్పు నీది.. శిక్ష రైతులకా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రూ.2 లక్షలకుపైగా ఉన్న అప్పుపై ప్రభుత్వానికి స్పష్టత లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. రూ.2 లక్షలు పైన రుణం ఉన్నవారు మిగతా డబ్బులు కట్టాకే మాఫీ చేస్తామనే నిబంధన ఎందుకు? ఈ రూల్‌తో మళ్లీ మూడు, నాలుగు రూపాయల వడ్డీతో అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నరు? అని నిలదీశారు. రేషన్‌కార్డు, ఇన్‌కం ట్యాక్స్ నిబంధనలతో చిన్న ఉద్యోగులైన ఆర్టీసీ, సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా రుణమాఫీ ఆపారని, కానీ స్పీకర్‌కు, ఎమ్మెల్యేలకు మాఫీ చేస్తున్నారని మండిపడ్డారు. చిరు ఉద్యోగులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు.
‘రేవంత్‌రెడ్డి రుణమాఫీ అయిపోయిందంటరు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మాఫీ పూర్తిగా కాలేని చెప్తున్నరు’ అని హరీశ్‌రావు వివరించారు. రాష్ట్రంలో 46% రైతులకు మాత్రమే మాఫీ అయ్యిందని, ఇంకా 54% మందికి బాకీ ఉన్నదని చెప్పారు. మాఫీ కాలేదని మంత్రులే చెప్తున్నరు. దీనిని బట్టి ఎవరు రాజీనామా చేయాలి అని ప్రశ్నించారు.