e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home తెలంగాణ ఊరివాడై వాడవాడలా..

ఊరివాడై వాడవాడలా..

  • రెండున్నర గంటలు.. 4.5 కిలోమీటర్ల నడక
  • ప్రతి ఒక్కరికీ ఆత్మీయ పలుకరింపులు
  • ఓపికగా సమస్యలన్నింటి ఆలకింపు
  • అప్పటికప్పుడే పరిష్కారానికి ఆదేశాలు
  • తన దత్తత గ్రామం వాసాలమర్రిలో సీఎం కేసీఆర్‌ ఆత్మీయ పాదయాత్ర
  • పల్లెప్రగతి పనుల్లో లోపంపై ఆగ్రహం
  • అలుపెరుగని యువకుడిలా ముచ్చట్లు పెడుతూ సంబురంగా నడక
  • తన దోస్తులు ఆగవ్వ, లక్ష్మిని ప్రత్యేకంగా కలిసిన సీఎం
  • తోరణాలు కట్టి, ముగ్గులేసి, హారతిపట్టిన గ్రామస్థులు

హైదరాబాద్‌, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): దత్తత తీసుకొన్న గ్రామం.. మూడు గంటలపాటు కాలినడకన పర్యటన.. కనీసం నాలుగైదు కిలోమీటర్లు.. అణువణువూ పరిశీలన.. అలుపన్నదే లేదు.. కనిపించిన ప్రతి ఒక్కరికీ ఆత్మీయ పలుకరింపు.. వారి సమస్యలన్నీ సావధానంగా విని, ఇంటికి పెద్దదిక్కుగా సలహాలు ఇవ్వటం.. అవసరమైన సాయం చేస్తానని భరోసా ఇవ్వడం.. అపరిశుభ్రత కనిపించిన చోట్ల అధికారులపై ఆగ్రహం.. భోజనవిరామం అనంతరం దళితులతో జరిగిన సమావేశంలో దళితబంధు గురించి సమగ్ర వివరణ. ఎట్లా బతుకాల్నో.. ఎట్లా ఎదుగాల్నో సూచనలు. ఇలా సాగింది.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారంనాటి పర్యటన. గ్రామంలో 76 దళిత కుటుంబాలుండగా, ప్రతి ఇంటికీ వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కాలనీల్లో కలియదిరిగారు. ముఖ్యమంత్రికి మహిళలు బొట్టుపెట్టి, హారతులు పట్టి స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరి యోగ క్షేమాలను సీఎం అడిగి తెలుసుకొన్నారు. పెన్షన్‌ రానివారికి వెంటనే మంజూరుచేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతిని ఆదేశించారు. గ్రామంలో 20 మంది బీడీ కార్మికులకు పెన్షన్‌ రావడం లేదని మహిళలు చెప్పగా.. రెండుమూడు రోజుల్లో మంజూరుచేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఓ మహిళ బీడీ కార్మికుల సమస్యలను చెప్తుండగా ‘నేను బీడీలు చేసేటోళ్ల ఇంట్లో ఉండే చదువుకున్నానమ్మా.. వాళ్ల కష్టాలు నాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు.

దళితబంధు ఇస్తే ఏం చేస్తరు?

‘దళితబంధు గురించి తెలుసా? డబ్బు ఇస్తే ఏం చేస్తారు?’ అని పలువురు దళితులను సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. కొందరు డెయిరీ ఫారం పెట్టుకుంటామని చెప్పగా, మరికొందరు ట్రాక్టర్‌ కొంటామన్నారు. ‘మీకు పర్ఫెక్ట్‌గా ఏ పని వస్తదో చూసుకోండి. ఆ పని చేసిన అనుభవం ఉంటే వ్యాపారం పెట్టుకోండి’ అని సీఎం సూచించారు. బోర్లు వేసుకొంటామని కొందరు, ఏదో ఒకటి చేసుకుంటామని మరికొందరు చెప్పగా సున్నితంగా మందలించారు. ‘ఏదో ఒకటి అంటే? భూమా? ఆకాశమా?. దళితబంధు గురించి ఇంత మొత్తుకొంటున్నం కదా? ఇంట్లో అందరూ కూసొని ఆలోచన చెయ్యాలె కదా?. బోర్‌ ఏసుకునుడు రూ.75 వేలతో అయిపోతది. ఇంకా పెద్దగా ఆలోచించాలె కదా. ఇగురం ఉండాలె కదా.. జీవితాలు బాగుపడేలా మంచి ఆలోచనలు చేయండి’ అని అన్నారు. ప్లాస్టిక్‌ మౌల్డింగ్‌ మెషిన్‌ పెట్టుకొంటానని చెప్పిన ఓ యువకుడిని అభినందించారు. కోళ్లఫారం పెట్టుకుంటానని ఓ వ్యక్తి చెప్పగా సంతోషం వ్యక్తంచేశారు.

సారు ఇంట్లకు రావడం సంతోషంగా ఉన్నది

- Advertisement -

కేసీఆర్‌ సారు మా ఇంట్లకు రావడం చాలా సంతోషమనిపిచ్చింది. ఇంటి ముందు కడీ ఎందుకు పెట్టినవ్‌ అని సారు అడిగిండు.. వాన వచ్చినప్పుడు ఇంట్లోకి వరద రాకుండా పెట్టిన సారు అని చెప్పిన. లోపటికి వచ్చి ఇల్లు సూశి మట్టి గోడలేనా అని అడిగిండు.. అవును సార్‌ అని చెప్పిన. నాకు ఇద్దరు కొడుకులు అని చెప్పిన. దళిత బంధు నుంచి పది లక్షలు ఇస్తే ఏం చేస్తావ్‌ అని అడిగిండు. ఏదైనా వ్యాపారం చేసుకొని బతుకుతం సారు అని చెప్పిన. కోడలు డెలీవరి అయితే ఇంటికి అంబులెన్స్‌ల తీసుకొచ్చి దింపిపోయిండ్రా? కేసీఆర్‌ కిట్‌ వచ్చిందా? అని అడిగితే వచ్చినయ్‌ సారు అని చెప్పిన. సారు మా ఇంట్లకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. చాలా ఆత్మీయంగా మాట్లాడిండు సారు. – బొల్లారం పోచమ్మ

అదే ఆయన స్పెషల్‌

వాసాలమర్రిలో దాదాపు రెండు గంటల తర్వాత కూడా సీఎం కేసీఆర్‌ రెట్టింపు ఉత్సాహంతో పర్యటన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఒక స్థానికుడు ‘నాకు తిరిగి.. తిరిగి కాళ్లు గుంజుతున్నయి. ఆయినేమో ఇప్పుడే నడక మొదలువెట్టినట్టు పోతున్నడు’ అని అంటే.. పక్కనే ఉన్న మరోవ్యక్తి ‘అదే ఆయన స్పెషల్‌. ఊరోళ్లతోటి ముచ్చటంటే సంబురపడుతడు. కొత్త మనుషులను సూస్తుంటే.. వాళ్లతో మాట్లాడుతుంటే ఆయనకు కొత్త ఉత్సాహం వస్తది. ముచ్చట్లు పెట్టుకుంట పోతనే ఉంటడు. ఉద్యమం సంది సూస్తున్నం కదా’ అన్నారు. ఈ పర్యటనలో ఎక్కడా ఆయన ఒక సీఎంగా వ్యవహరించలేదు. ఆ ఊర్లో తానూ ఒకడిగానే కలియదిరిగారు. ప్రతి ఇంటిముందు ఆగి, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గోడల మీద, చెట్ల మీద చేతులు ఆన్చి ముచ్చట్లు పెట్టారు. పర్యటన మధ్యలో వేరే గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన ఓ యువతిని ఆమె బంధువులు తీసుకొని వచ్చారు. ఏదైనా సాయం చేయాలని కోరారు. దీనికి సీఎం స్పందిస్తూ ‘పెన్షన్‌ వస్తున్నదా?’ అని అడుగగా, రూ.3వేలు వస్తున్నదని వారు సమాధానం ఇచ్చారు. ‘పెన్షన్‌ వస్తున్నది కదా.. ఇంకా ఏది కావాల్నో స్పష్టంగా చెప్పకుండా సాయం చేయమంటే ఎట్లా? ఆమెను ఇబ్బందిపెట్టుడు కాదా?’ అని అసహనం వ్యక్తంచేశారు. దీంతో యువతికి కృత్రిమ కాళ్లు అమర్చాలని వారు కోరగా, ‘తప్పకుండా అమర్చుదాం’ అని హామీ ఇచ్చి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అధికారుల అంచనాలకు భిన్నంగా..

వాసాలమర్రి గ్రామంలో మీదివాడ, కిందివాడ పేరుతో రెండు ఎస్సీవాడలున్నాయి. మొత్తం 76 కుటుంబాలు ఉన్నాయి. మీదివాడ.. ఊరికి తూర్పువైపున, కిందివాడ ఊరికి పడమర దిక్కు ఉన్నాయి. వీటిల్లో కొన్ని చోట్ల సీసీరోడ్లు ఉండగా, మరికొన్ని గల్లీల్లో మట్టిరోడ్లు మాత్రమే ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ తన పర్యటనను కిందివాడ నుంచి ప్రారంభించారు. మీదివాడను, కిందివాడను అనుసంధానం చేసే సీసీరోడ్డు మీదుగా సీఎం పర్యటిస్తారని అధికారులు భావించారు. కానీ వారి అంచనాకు భిన్నంగా సీఎం కేసీఆర్‌ మట్టి రోడ్ల వెంబడి నడిచారు. దాదాపు అన్ని గల్లీలను పరిశీలించారు. కనిపించిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడారు. మధ్యలో వచ్చిన ఇతర కాలనీల్లోనూ కలియదిరిగారు. మట్టిరోడ్ల మీదుగా, ఇరుకు గల్లీల్లో సీఎం పర్యటన సాగింది. ఇటీవలి వర్షాలకు ఆ మట్టిరోడ్లు కోసుకుపోయి కయ్యలు పడ్డాయి. కనిపించిన ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ.. పెన్షన్‌ వస్తున్నదా? 24 గంటల కరెంటు ఉన్నదా? రైతుబంధు డబ్బులు వస్తున్నయా? ఏమేం పంటలు వేస్తున్నరు? అని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సుమారు నాలుగైదు కిలోమీటర్ల మేర సీఎం నడుచుకొంటూ తిరిగారు. అయినా ఏమాత్రం అలిసిపోలేదు. ఈ రెండున్నర గంటల్లో కనీసం ఎక్కడా కూర్చోలేదు కూడా. పర్యటన మొత్తం ఆయన చాలా ఉత్సాహంగా కనిపించారు. పర్యటనలో పాల్గొన్న యువ అధికారులు కూడా సీఎం వేగాన్ని అందుకోలేకపోయారు.

ఇండ్లు చూసి చలించిపోయిన సీఎం

పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్‌ పలువురి ఇండ్ల పరిస్థితిని చూసి చలించిపోయారు. బొల్లారం లావణ్య అనే మహిళ తాము దశాబ్దానికిపైగా గుడిశెలోనే ఉంటున్నామని చెప్పగా, సీఎం కదిలిపోయారు. వెంటనే డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చారు. పలువురు తమకు ఇండ్లు లేవని, ఆదుకోవాలని కోరారు. మరికొందరు తమ ఇండ్లు రోడ్లకు దిగువన ఉండటంతో వాననీళ్లు వస్తున్నాయని చెప్పారు. కొన్నిచోట్ల మట్టిగోడలతో ఇండ్లు కూలిపోతుండటం చూసి వారందరికీ డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఇండ్లు జీ+1 మోడల్‌లో ఉండాలని, వాననీళ్లు రాకుండా ఎత్తులో ఉండాలని, డ్రైనేజీలు, రోడ్లతో మంచి డిజైన్‌ చేయాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. సీఎం ఒక ఇంటి లోపలికి వెళ్లినప్పుడు పక్కనే ఉన్న ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను చూపిస్తూ ‘ఈయన మీకు తెలుసా.. దళిత నాయకుడు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల అని పాట రాసింది ఈయనే’ అని పరిచయంచేశారు.

పల్లె ప్రగతి ఇదేనా?

వాసాలమర్రిలో పల్లె ప్రగతి ఫలితాలు పూర్తిస్థాయిలో కనిపించకపోవడంతో అధికారులపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. పాడుబడిన ఇండ్లను కూల్చి చెత్తాచెదారాన్ని అక్కడే వదిలేయడం, రోడ్ల వెంబడి పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఉండటం, మురుగుకాలువల్లో అపరిశుభ్రతను చూసి సీఎం అసహనం వ్యక్తంచేశారు. ఇలా ఎందుకున్నదని పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించారు. ఐదుగురు పంచాయతీ సిబ్బంది, తగినన్ని నిధులు ఉన్నా ఎందుకు అపరిశుభ్రంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని ఆదేశించారు.

సర్పంచ్‌ ఆంజనేయులు ఇంట్లో భోజనం

సీఎం కేసీఆర్‌ సర్పంచ్‌ ఆంజనేయులు ఇంట్లో భోజనం చేశారు. సర్పంచ్‌ దంపతులు కేసీఆర్‌ చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. సీఎంతోపాటు మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్యేలు సునీత, రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఉన్నతాధికారులు సర్పంచ్‌ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు.

దళిత వాడల్లో పండుగ వాతావరణం

కేసీఆర్‌ పర్యటనతో ఊరంతా పండుగ వాతావరణం నెలకొన్నది. ముఖ్యంగా రెండు దళితవాడల్లో ప్రజలు సంబురాలు చేసుకున్నారు. తోరణాలు కట్టారు. ‘వెల్‌కమ్‌ సీఎం సార్‌’ అని ముగ్గులు వేశారు. ‘గంత పెద్ద మనిషి మా ఇండ్లల్లకు వస్తున్నడంటే ఇంకేం కావాలె సారు’ అని పొంగిపోయారు. సీఎం కేసీఆర్‌ వెంట మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీత, సాంస్కృతిక సారథి చైర్మన్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కలెక్టర్‌ పమేలాసత్పతి, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, గ్రామ సర్పంచ్‌ ఆంజనేయులు, కవులు, రచయితలు మిట్టపల్లి సురేందర్‌, సాయిచంద్‌, అంబటి వెంకన్న, అభినయ్‌ శ్రీనివాస్‌ , కోదారి శ్రీనివాస్‌, బూర సతీశ్‌, మానుకోట ప్రసాద్‌, బాబు, శివ, భిక్షపతి ఉన్నారు.

దోస్తులను కలిసిన సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ గత నెలలో వాసాలమర్రిని సందర్శించిన సందర్భంగా గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు ఆకుల ఆగవ్వ, చిన్నూరి లక్ష్మిని తనతోపాటు వేదికపై కూర్చోబెట్టుకొన్నారు. కలిసి భోజనం చేశారు. ‘వీళ్లిద్దరూ నా దోస్తులు’ అని పదేపదే చెప్పారు. బుధవారం వాసాలమర్రిలో వారిద్దరి ఇండ్లను ప్రత్యేకంగా సందర్శించారు. కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సీఎం తమను గుర్తుపెట్టుకొని ఇంటికి రావడంతో ఆగవ్వ, లక్ష్మి ఉబ్బితబ్బిబ్బయ్యారు.

ఏం కావాలె నీకు?

సీఎం: నీ పేరేందమ్మా
నాగపురి పెంటమ్మ సారు
సీఎం: ఎందరు ఉంటరు ఇంట్ల?
ఒక్కదాన్నే ఉంట సారు. పిల్లలు పట్నంల పనికిపోతున్నరు.
సీఎం: ఏం కావాలె నీకు మరి?
ఇల్లు కావాలె సారు. పెంకల ఇల్లు. పాత గోడలు. కూలిపోతున్నది.
సీఎం: వస్తదమ్మా.. ఈ మేడమ్‌ మీ కలెక్టర్‌. ఇప్పుడు రాసుకుంటున్నరు. మళ్లా మీ ఊరికి వస్తరు. ఎవరికి ఏమేం కావాల్నో అడిగి తెలుసుకుంటరు.

లేత్‌ మిషన్‌ మంచి ఆలోచన..

సీఎం: లక్ష్మి మంచిగున్నవా అమ్మ!
చిన్నూరి లక్ష్మి: మంచిగున్న సారు. మా ఇంటాయినె మొగిలయ్య. అల్లుడు పోషయ్య.
సీఎం: పోషయ్యా.. నీకు ప్రభుత్వం సాయం ఇస్తే ఏం చేస్తవ్‌?
ఏదో ఒకటి చేసుకుంట సారు.
సీఎం: ఏదో ఒకటి అంటే.. భూమా? ఆకాశమా? గట్లుంటదా? ఆలోచన చెయ్యాలె కదా.
లేత్‌ మిషిన్‌ పెట్టుకుంట సార్‌.
సీఎం: ఈ మిషిన్‌ పని నీకు పర్ఫెక్టుగా వస్తదా?
వస్తది సార్‌. ఇంతకుముందు పనిచేశిన.
సీఎం: మరి.. లేత్‌ మిషన్‌ పెట్టుకుంటే రోజుకు ఎంత సంపాదిస్తవ్‌?
రోజుకు రెండుమూడు వేలు వస్తది సార్‌.
సీఎం: మంచి ఆలోచన.. మీటింగ్‌ కాడికి రాండ్రి. మొత్తం మాట్లాడుకుందాం.

డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇప్పిస్తా

సీఎం: ఇదేనా అమ్మా మీ ఇల్లు?
బొల్లారం దశరథం, లావణ్య: ఇదే సారు.. మాకు ఈ గుడిశె ఒక్కటే ఉన్నది.
సీఎం: ఎప్పటి సంది ఉంటున్నరు?
నాకు పెండ్లయినకాడి నుంచి ఈ గుడిశెలనే ఉంటున్నం సారు. పురుగుపూశి వస్తున్నది. అయినా ఇండ్లనే సర్దుకుంటున్నం.
సీఎం: మీ పరిస్థితి నాకు అర్థమైందమ్మా. మీకు కచ్చితంగా డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇప్పిస్తా.

అందరూ కూసొని మాట్లాడుకోండ్రి

సీఎం: నీ పేరేంది?
జెర్రిపోతుల రాములు
సీఎం: దళితబంధు పథకం కింద మీ ఇంటికి రూ.10 లక్షలు ఇస్త.. ఆ డబ్బులతోని ఏం చేస్తరు మరి? బోరు ఏసుకుంటం సారు.
సీఎం: గట్లుంటదా?. బోరంటే రూ.75 వేలతోని అయిపోతది. మిగిలిన పైసలు ఏం చేస్తవ్‌?
ఏం చేస్తమంటే…
సీఎం: అంటే మీరు ఆలోచన చెయ్యలే. తెల్లారి మన చేతుల పైసలు పడితే ఏం చేయాలనే ఇగురం లేదు. దళితబంధు గురించి మీటింగ్‌ల గంత మొత్తుకుంటి కదా. పైసలకు మీరే జిమ్మెదారి అంటిని కదా. ఇన్నరా లేదా? ముందుగాళ్ల మీ ఇంట్లో అందరూ కూసొని మాట్లాడుకోండ్రి. మీకేం పని వస్తది? ఏం చేసుకుందాం? అని ఆలోచన చెయ్యిన్రి.

సర్కారు దవాఖానల మంచి వైద్యం

సీఎం: ఇంట్ల ఎవరెవరు ఉంటరు?
జెర్రిపోతుల నర్సమ్మ: నేనొక్కదాన్నే. కొడుకులు లేరు. బిడ్డకు పెండ్లయింది.
సీఎం: మరి నీకు పింఛన్‌ వస్తున్నదా?
వస్తున్నది సారు. రెండువేల పదార్లు వస్తున్నది.
సీఎం: మరి దాంట్ల ఏమన్నా దాశిపెట్టినవా? ఖర్చుపెట్టినవా?
యాడున్నయ్‌ సారు.. ఏం లెవ్వు.
సీఎం: నేనేం గుంజుకపోతనా ఏంది? (నవ్వుతూ). ఏమన్నా దాశిపెట్టుకున్నవా? లేదా అని తెలుసుకుందామని అడిగిన.
దాశి పెట్టుకున్నయి దవాఖానలకే అయిపోతున్నయి సారు.
సీఎం: ఎందుకు అయిపోతయి.. ప్రైవేటుకు పోతున్నవా? సర్కార్లు దవాఖానకు పోతే ఫ్రీగా వైద్యం అందుతది కదా? ఈ వయసుల వచ్చిన పింఛన్‌ నుంచి కొంత దాశిపెట్టుకుంటే నీకే మంచిది కదా!
అవును సారు.
సీఎం: నువ్వు తుర్కపల్లికి పో. సర్కారు దవాఖానల మంచి వైద్యం ఇస్తరు.
రేషన్‌ దుకాణంల బియ్యం వస్తున్నయా?
వస్తున్నయి సారు. మనిషికి ఆరు కిలోలు.
సీఎం: ఇప్పుడు పైసలు తీసుకుంటున్నరా? ఫ్రీగా ఇస్తున్నరా?
రెండునెలల నుంచి పైసలేం తీసుకుంటలేరు సారు.

అల్లుడిని రమ్మనుర్రి.. ట్రాక్టర్‌ ఇప్పించే పని చూస్త..

సీఎం: మీ పేరేంది?
జెర్రిపోతుల పోషమ్మ, సంజీవ
సీఎం: ఈమె మీ పాపనా?
అవును సారు.. ఎంగేజిమెంట్‌ అయ్యింది. ఈ నెలలనే పెండ్లి ఉన్నది.
సీఎం: మరి కల్యాణలక్ష్మికి దరఖాస్తు పెట్టినరా?
పెట్టలేదు సారు. పెట్టాలె.
సీఎం: ఇంకా ఎందుకు పెట్టలేదు. ఏమన్నా కట్నం ఇస్తున్నవా మరి?
కట్నం పెద్దగ ఏం లేదు గానీ.. అల్లుడు ట్రాక్టర్‌ డ్రైవర్‌. సొంతంగా
కొనుక్కుంటా అనుకొంటున్నడు.
సీఎం: అవునా? మీ అల్లునోళ్ల ఊరు దగ్గర్నే ఉంటదా?
దగ్గర్నే సారు.
సీఎం: ఆయనను రమ్మనుర్రి. ట్రాక్టర్‌ ఇప్పిచ్చే సంగతి నేను చూసుకుంటా.

నిమ్మలంగా తిని ఉండుర్రి

దుబ్బాక బాలమ్మ: సారూ.. నాకు కండ్లు సక్కగ కనవడయి. మా ఇంటాయినెకు పానం సక్కగుండది.
సీఎం: మరి ఏం కావాలె మీకు?
మీ ఇష్టం సారు.
సీఎం: మీ ఇద్దరికీ పానం సక్కగలేదు. ఈ వయసుల ఏం తిప్పలు పడుతరు. పింఛన్‌ వస్తున్నదా?
వస్తున్నది సారు.
సీఎం: ఎంతొస్తున్నది?
రెండువేల రూపాయలు వస్తున్నయి సారు.
సీఎం: మరి ఇంతకుముందు ఎంత వస్తుండే?
రూ.200 వస్తుండె.
సీఎం: మరి ఇప్పుడు 2 వేలు వస్తున్నయి కదా. మొత్తం కర్సు వెడుతున్నరా? ఏమన్నా కూడవెట్టుకుంటున్నరా?
దాశిపెట్టుకున్న పైసలతోటి ఈ ఇల్లు కట్టుకున్న సారు. అయిపోయినయి.
సీఎం: వచ్చే పింఛన్‌ పైసలతోని నిమ్మలంగా తిని ఉండుర్రి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana