హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో నాలుగు జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల ప్రారంభోత్సవానికి ముహూ ర్తం ఖరారయ్యింది. వీటిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. ఈ నెల 25న రంగారెడ్డి జిల్లా, 29న పెద్దపల్లి, సెప్టెంబర్ 5న నిజామాబాద్, 10న జగిత్యాల జిల్లా కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం షెడ్యూల్‌ను విడుదల చేసింది. వీటితోపాటు మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ల నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ కేటాయించే సమయాన్ని బట్టి ఈ రెండు కలెక్టరేట్ల ప్రారంభోత్సవ తేదీలను ఖరారు చేయనున్నారు.
పరిపాలనను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్.. అన్ని శాఖల అధికారులు ఒకేచోట ఉండేలా సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నూతన భవనాలు ఉన్న హైదరాబాద్, నల్లగొండ, సంగారెడ్డి, కరీంనగర్ మినహా 29 జిల్లా కేంద్రాల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 15 జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణం పూర్తయింది. వీటిలో 9 చోట్ల కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 10 వరకు మరో నాలుగు కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మరో 10 జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. వివిధ కారణాల వల్ల మరో నాలుగు జిల్లాల నిర్మాణ పనులు ప్రారంభించలేదు. వీటి నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.