హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో ప్రజాకంటక పాలన సాగిస్తున్న మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ను గద్దె దించడమే తన ఎజెండా అని ప్రకటించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతున్నారు. భావసారూప్యం కలిగిన పార్టీలను ఏకం చేసే క్రమంలో ఆదివారం ముంబై పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రేను ఆయన కలుసుకోనున్నారు. అనంతరం ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్‌పవార్‌తోనూ చర్చలు జరుపనున్నారు.
ఢిల్లీ కోటను బద్దలు కొడ్తామంటూ రణనినాదం చేసిన కేసీఆర్‌కు ఇప్పటికే పలు పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. కేసీఆర్‌తో కలిసి నడుస్తామని ఆయా పార్టీల నేతలు స్వయంగా వచ్చి చెప్పారు. ఇదే క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు పలికారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ముం బై వచ్చి తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరారు. దీం తో సీఎం కేసీఆర్ ఆదివారం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 11గంటలకు బయల్దేరి, రాత్రి కి తిరిగి రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఉద్ధవ్‌తో భేటీ కానున్నారు.
ఠాక్రేతో కలిసి భోజనం చేసిన అనంతరం ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను సాయం త్రం నాలుగు గంటలకు కలుసుకోనున్నారు. కేసీఆర్ వెంట పలువురు పార్టీ నాయకులు కూడా వెళ్లనున్నా రు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేసీఆర్ ముంబై పర్యటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నది. జాతీయ మీడి యా సైతం కేసీఆర్ పర్యటనను ఆసక్తిగా గమనిస్తున్నది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాల హక్కుల్లో మితిమీరుతున్న కేంద్రం జోక్యం, కేంద్రంపై పోరాటం లో భావసారూప్యం ఉన్న పక్షాల ఐక్యతపై ముఖ్యమం త్రి కేసీఆర్.. ఠాక్రే, పవార్‌తో చర్చించనున్నారు.
కలిసొచ్చే పార్టీలతో ఐక్యపోరాటం
రాష్ర్టాల హక్కులను హరిస్తూ వివక్ష చూపుతున్న కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భీకర పోరాటానికి సిద్ధమని ప్రకటించిన కేసీఆర్ తనతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొనిపోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలుత సీపీఎం అగ్రనేతలు సీతా రాం ఏచూరి, ప్రకాశ్ కరత్, కేరళ సీఎం పినరాయి విజయన్ వచ్చి మద్దతు తెలిపారు. తరువాత ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వీ యాదవ్ వచ్చి కేసీఆర్‌ను కలిశారు. ఆ సమయంలోనే ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యా దవ్ ఫోన్‌చేసి కేసీఆర్‌కు మద్దతు ప్రకటించారు.
ఇటీవల కేసీఆర్ తమిళనాడు పర్యటనకు వెళ్లి ఆ రాష్ట్ర ము ఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో భేటీ అ య్యారు. జేడీఎస్ నేత దేవెగౌడ, సీపీఐ అగ్రనేత డీ రాజా, పలు రైతు సంఘాల నేతలు కేసీఆర్‌కు మద్దతు తెలిపారు. గత వారం జనగామ, భువనగిరి బహిరంగ సభల్లో మాట్లాడిన కేసీఆర్ ఢిల్లీ కోటను బద్దలు కొడ్తామని, మోదీని దేశం నుంచి తరిమేసి రాష్ర్టాలకు అన్నీ ఇచ్చేటోళ్లను తెచ్చుకొంటామని అన్నారు. ఈ పోరాట స్ఫూర్తిని గమనించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సీఎం కేసీఆర్‌కు ఫోన్‌చేసి మేము సైతం మీ వెంటే అని చెప్పా రు. రాష్ర్టాల హక్కుల కోసం సీఎంకేసీఆర్ అద్భుత పోరాటం చేస్తున్నారని ఉద్ధవ్ కొనియాడారు. బీజేపీపై పోరాటంలో దేశ ప్రజలను కూడగట్టేందుకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ముంబై వెళ్తున్నారు.