కరీంనగర్, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/సిద్దిపేట అర్బన్/మర్కూక్/కొండపాక(కుకునూరుపల్లి): ఉద్యమ కాలం నుంచి గులాబీ దళపతి కేసీఆర్‌కు దన్నుగా నిలిచిన కరీంనగర్ మరోసారి కదం తొక్కింది. అశేష జనవాహిని తరలివచ్చి అపూర్వ స్వాగతం పలికింది. గురువారం ఎర్రవల్లిలోని నివాసం నుంచి కేసీఆర్ బస్సుయాత్ర బయలుదేరిన దగ్గర నుంచి కరీంనగర్ రాంనగర్ చౌరస్తాకు చేరుకొనే వరకు దారి పొడవునా బ్రహ్మరథం పట్టారు.
దత్తత గ్రామమైన ఎర్రవల్లి గ్రామస్థులు కేసీఆర్‌కు గులాబీ పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. కుకునూరుపల్లితోపాటు కొండపాక మండలంలోని దుద్దెడ వరకు రాజీవ్ రహదారి పొడవునా బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ అభిమానులు, ప్రజలు జనహృదయనేతను చూ సేందుకు భారీగా తరలివచ్చారు. మహిళలు మంగళహారతులతో కేసీఆర్‌కు హారతి పట్టారు. భారీగా ప్రజలు తరలిరావడంతో రాజీవ్ రహదారి గులాబీమయంగా మారింది.
కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సుపై పూలు చల్లి జై కేసీఆర్.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. రాజీవ్ రహదారి మీదుగా వచ్చిన కేసీఆర్.. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి బైపాస్‌రోడ్డు ద్వారా రాత్రి 7.50 గంటలకు కరీంనగర్‌లోని రాంనగర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్క డ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితోపాటు పలువురు నాయకుల ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు అధినేతకు అపూర్వ స్వాగతం పలికారు. మరికొందరు పూల వర్షం కురిపించారు.
ప్రజల అభిమానాన్ని చూసిన కేసీఆర్.. బస్సులోనుంచే అభివాదం తెలిపారు. డప్పులు, సంప్రదాయ నృత్యాల మధ్య రాంనగర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ.. మంకమ్మతోట, టూటౌన్ పోలీస్‌స్టేషన్, ముకరంపుర మీదుగా తెలంగాణ చౌక్ వద్దకు చేరింది. దాదాపు 40 నిమిషాలపాటు రోడ్‌షో కొనసాగగా.. దారి పొడవునా రోడ్డు కు ఇరువైపులా జనం నిలబడి కేసీఆర్ జిం దాబాద్ అంటూ నినాదాలు చేశారు.
పలు చోట్ల మహిళలు మంగళహారతులతో స్వాగ తం పలికారు. రాత్రి 8.30 గంటలకు తెలంగాణ చౌక్ వద్దకు కేసీఆర్ చేరగానే.. అప్పటికే ఆయన కోసం వేచి చూస్తున్న జనం ఒక్కసారిగా సీం కేసీఆర్.. సీం కేసీఆర్ అంటూ చేసిన నినాదాలు మారుమోగాయి. బస్సు పైనుంచి కేసీఆర్ విజయ సంకేతం చూపుతూ అభివాదం తెలుపుతున్న సమయంలో.. రెండు మూడు నిముషాలపాటు.. సభ జై కేసీఆర్.. సీఎం కేసీఆర్ అన్న నినాదాలతో హోరెత్తింది. అనంతరం కేసీఆర్ సుమారు 25 నిముషాలపాటు ప్రసంగించారు.
వినోద్‌కుమార్ విజయం ఖరారైంది
కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ విజయం ఖరారైందని కేసీఆర్ చెప్పారు. తన దగ్గర ఉన్న సర్వే ప్రకారం ఇప్పటికే 8 శాతం ఓట్ల అధిక్యంతో ముం దు వరుసలో ఉన్నారని కేసీఆర్ చెప్పినప్పుడు.. సభలో ఒక్కసారి సంతోషం వ్యక్తమైంది. ఎన్నికల వరకు ఇదే స్ఫూర్తిని చాటి.. అధిక మెజార్టీతో వినోద్‌కుమార్‌ను గెలిపించాలని కోరినప్పుడు.. కారు గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు నలుదిక్కులా పిక్కటిల్లాయి.
సభలోని చాలా మంది తమ చేతుల్లో కారు గుర్తుతో ఉన్న ప్లకార్డులను పైకి ఎత్తి ప్రదర్శించారు. ఎవరికి అర్థం కాకుండా మాట్లాడే.. సంజయ్‌ను గెలిపిస్తారా? లేక విజ్ఞుడు, న్యాయవాది, ఆది నుంచి తెలంగాణ సాధనకు తనతో కలిసి నడిచిన వినోద్‌కుమార్‌ను గెలిపిస్తారా? అన్న ప్రశ్నకు వినోద్‌కుమార్ జిందాబాద్ అంటూ చెప్పారు. కరీంనగర్ గడ్డ మామూలుది కాదని, తెలంగాణ ఉద్యమానికి అన్ని రకాల బలాన్ని ఇచ్చి ముందుకు నడిపించిందని, మీ దీవెనల వల్లే తెలంగాణ సాధించగలిగామని కేసీఆర్ చెప్పినప్పుడు. సభలో చప్పట్లు మారుమోగాయి.