హైదరాబాద్, జూన్ 30 (నమస్తేతెలంగాణ): సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమని సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్మికుల మరణం కలిచివేసింది: కేటీఆర్
పాశమైలారంలో రియాక్టర్ పేలి 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతగానో కలిచివేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని వస్తున్న వార్తలు వింటుంటే ఆందోళన పెరిగిపోతున్నదన్నారు. మృతులకు నివాళుర్పించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. క్షతగాత్రులకు నాణ్యమైన చికిత్స అందించాలని, బాధితులకు మెరుగైన పరిహారం అందించాలని కోరారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు, ఎమ్మెల్సీ కవిత ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.