హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): నయవంచక కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిలైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. రాజ్యం నడప చేతగాక ఆర్థికంగా దివాలా తీయించి ఆగమాగం చేస్తున్నారని విమర్శించారు. ఎల్కతుర్తి రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. రాజ్యం నడప చేతగాక ఎల్లెంకెల పడి, రాష్ర్టాన్ని ఆర్థికంగా దివా లా తీయించి, పిచ్చి పనులన్నీ చేసి అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. సంక్షేమంలో,మంచినీళ్లు అందించడంలో, పొలాలకు సాగు నీళ్లు అందించడంలో, కరెంట్ సరఫరాలో, రైతుబంధు ఇవ్వడంలో, విత్తనాలు, ఎరువుల సరఫరాలో, ధాన్యం కొనుగోళ్లలో, పల్లెలు, పట్టణాల అభివృద్ధిలో, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ అయిందని దుయ్యబట్టారు. ఎటు పడితే అటు ఒర్రుడు, దేవుళ్లపై ఒట్లు పెట్టుడు. అబద్ధపు వాగాద్దనం చేసుడు.
20-30 శాతం కమీషన్లు తీసుకునుడు. సంచులు నింపుడు, సంచులు మోసుడులో పాసైందని విమర్శించారు. తన మాటలు నిజమే అయితే చేతులు లేపాలని ప్రజలను కోరారు. కేసీఆర్ మాటలకు సభలోని జనాల నుంచి భారీ స్పందన వచ్చింది. సభలో ఉన్న ప్రజలంతా ఒక్కసారిగా చేతులు పైకెత్తి ఈ ప్రభుత్వం అన్నిట్లో ఫెయిలైందని ముక్తకంఠంతో చెప్పారు. ఆ తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ ‘20శాతం, 30శాతం కమీషన్లని నేను అంటలేను. స్వయంగా 200 మంది కాంట్రాక్టర్లు ఆర్థిక మంత్రి చాంబర్‌కు వెళ్లి అక్కడ లొల్లి పెట్టి ‘మమ్మల్ని 20శాతం, 30శాతం కమీషన్లు అడుగుతున్నరు. ఇదేం అన్యాయం’ అని సెక్రటరియేట్లో చెప్పిన మాట చెబుతున్నా. మాజీ సర్పంచులు మా బిల్లులు ఇవ్వండంటే వాళ్ల బిల్లులు ఇవ్వకుండా గోస పుచ్చుకుంటున్నరు’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నదని కేసీఆర్ మండిపడ్డారు. 11 ఏండ్ల బీజేపీ పాలనలో రాష్ర్టానికి 11 రూపాయలైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. శూన్య హస్తాలు తప్ప ఏమీ ఇ య్యలే. దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడి తే ఒక్కటైనా తెలంగాణకు ఇచ్చిన్రా? ఒక్క ప్రాజెక్టుకన్నా జాతీయ హోదా ఇచ్చిన్రా? కాంగ్రెసోడు ఇట్లుంటే.. బీజేపోడు అట్ల. ఏమీ లేదు. ఉల్టా మనయే ఖమ్మంలో ఏడు మండలాలు గుంజుకున్నరు. సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నరు. నరేంద్రమోదీ ఏం మాట్లాడుతడు. తెలంగాణ వచ్చిందిరా అని మనం సంతోషపడితే, తల్లిని చంపి బిడ్డని బతికిచ్చిన్రు అంట డు. ఇలా ఒక్కసారి కాదు. కాబట్టి అదిగూడ (బీజేపీ) మనకి పనికొచ్చేదికాదు.