హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : కుల, వర్ణ, లింగ వివక్ష అమానవీయ సంబంధాలు రద్దు కావాలని, సమానత్వ భావన పరిఢవిల్లాలని పోరాడిన మానవతావాది, గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. ఆ మహనీయుడి జయంతి పురస్కరించుకొని సోమవారం ఒక ప్రకటనలో నివాళులర్పించారు. దేశానికి బసవేశ్వరుడు అందించిన సామాజిక కృషిని స్మరించుకున్నారు. విలక్షణ సాహిత్యం ద్వారా సంఘ సంస్కరణలకు బాటలు వేసిన మహనీయుడని ప్రశంసించారు. సామాజిక న్యాయం, సమానత్వం, శ్రమకు తగిన గౌరవం అనే మహత్తర సూత్రాలను ప్రతిపాదించి ఎనిమిది దశాబ్దాల క్రితమే అమలుచేసిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. వారి దార్శనికత, కార్యాచరణ నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.
త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో తొలి పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బసవేశ్వరుడి స్ఫూర్తితో అమలుచేసిన ప్రగతి కార్యాచరణ దళిత, బహుజనుల జీవితాల్లో గుణాత్మక మార్పునకు దోహదం చేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. విప్లవాత్మక పథకాలతో సబ్బండ వర్గాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి వారి ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేశామని తెలిపారు. బసవేశ్వరుడి బోధనలను అనుసరించి, సమానత్వం, మానవతా విలువలను కాపాడే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కల్పిం చే లక్ష్యంతో పాలనను కొనసాగించడమే బసవేశ్వరుడికి మనం అందించే ఘన నివాళులు అని స్పష్టంచేశారు.