KTR : తెలంగాణలో 2014 నుంచి పదేళ్ల కాలంలో రైతుల బలవన్మరణాలు తగ్గాయన్న జాతీయ నేర గణాంక విభాగం నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా స్పందన తెలియజేశారు. కేసీఆర్ రైతుబంధు పాలన రైతులకు స్వర్ణయుగమనే విషయం మరోమారు రుజువైందని ఆయన పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టులవల్ల 2014 నుంచి 2023 మధ్య తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని తెలిపారు.
2014లో తెలంగాణలో రైతులు, కౌలుదారులు, రైతు కూలీల ఆత్మహత్యల సంఖ్య 1,347గా ఉన్నదని, అదే 2023లో ఆ ఆత్మహత్యల సంఖ్య 56కు తగ్గిందని కేటీఆర్ చెప్పారు. అంటే 96 శాతం తగ్గుదల నమోదైందని అన్నారు. దేశంలోని రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా 2014లో 10.9 శాతం ఉంటే.. 2023 నాటికి అది 0.51 శాతం తగ్గిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిస్థితి తారుమారైందని విమర్శించారు. రెండేళ్లలోనే 700 మందికిపైగా అన్నదాతల ఆత్మహత్యలు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు.