కొల్లాపూర్ : తెలంగాణ పల్లెల్లో కేసీఆర్ హయాంలో వ్యవసాయన్ని పండగ చేశారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో పెద్దకొత్తపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ రేణుక ఆధ్వర్యంలో నిర్వహించిన ఎద్దుల పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణ యుగం లాంటిది అన్నారు. బీడు పొలాలలో మూడు పంటలు పండిస్తున్నాము అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులపై పెట్టిన ప్రత్యేక శ్రద్ధనే కారణమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి రైతుకు రైతుబంధు రుణమాఫీ చేయడం జరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పండగ పూట పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
పూర్తిస్థాయిలో రైతులందరికీ రైతుబంధు అందించడంలో, రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పెద్దకొత్తపల్లి మండలంలోనే యూరియా కష్టాలు ఏవిధంగా ఉన్నాయో ఇక్కడి రైతులందరికీ తెలుసునని, రైతు వ్యతిరేక ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని దండగ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే సమాధానం చెబుతారని, భవిష్యత్తు రైతుల చేతులలో ఉందని చెప్పారు. రైతు సంబురాలను నిర్వహిస్తున్న నిర్వాహకులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాత్రి పండుగ ప్రతి ఇంట ధాన్యపు రాశులతో సిరిసంపదలు కలుగజేయాలని ఆకాంక్షించారు.