మహిళల మనసులో తెలంగాణ భావనను పాదుకొల్పితే ఆ భావన కుటుంబానికి, సమాజానికి వ్యాపిస్తది. అది తరతరాలు తెలంగాణ సుభిక్షంగా, శ్రేయస్కరంగా ఉండేందుకు దోహదపడుతది. గ్రామం నుంచి రాష్ట్రం వరకు మహిళాశక్తి సిద్ధమైతే ఆ శక్తే తెలంగాణను నడిపిస్తది.
– కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : రేపటి తెలంగాణ కోసం మహిళా నాయకత్వాన్ని సిద్ధం చేద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. మహిళల్లో నాయకత్వ పటిమను పెంపొందించి.. తెలంగాణ భవిష్యత్తు తరాలు సుభిక్షంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకునే గురుతర పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ సిద్ధం కావాలని చెప్పారు. ఇంటర్ విద్యార్థిని స్థాయి నుంచి సమాజంలోని అన్ని రంగాలు, అన్నివర్గాలకు చెందిన మహిళలతో వచ్చే నెలలో తెలంగాణ భవన్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎలతుర్తిలో జరిగే పార్టీ రజతోత్సవ సభ తర్వాత రాష్ట్రంలోని విద్యార్థులు, వివిధ రంగాల మహిళలను సమీకరించి వారిలో సమరశీలత, చైతన్యాన్ని పాదుకొల్పి తద్వారా తెలంగాణలో శాశ్వత మహిళాశక్తిని రూపొందించేందుకు తెలంగాణ భవన్ వేదిక కాబోతున్నదని చెప్పారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ, శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కోసం మహిళలను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. మహిళల మనసులో తెలంగాణ భావనను పాదుకొల్పితే ఆ భావన కుటుంబానికి, సమాజానికి వ్యాపిస్తుందని, అది తరతరాలు తెలంగాణను సుభిక్షంగా, శ్రేయస్కరంగా ఉంచుతుందని ఆకాంక్షించారు.
ఎల్కతుర్తి సభలో మహిళల కోసం చేయాల్సిన ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ముఖ్యనాయకులతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో మహిళా ప్రతినిధులతో కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాసర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్ కుమార్, జీవన్‌రెడ్డి, చంద్రావతి, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, టీఎస్పీఎస్ మాజీ సభ్యుడు సుమిత్రానంద తనోబా, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజినీ సాయిచంద్, పార్టీ సీనియర్ నేత కల్వకుంట్ల వంశీధర్‌రావు, జాగృతి నేతలు నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళాభ్యుదయానికి పార్టీ పరంగా చేపట్టబోయే కార్యాచరణపై ఎమ్మెల్సీ కవిత సారధ్యంలోని మహిళా బృందానికి పార్టీ అధినేత కేసీఆర్ పలు సూచనలు చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై తీసుకోవాల్సిన చర్యలను ఉద్బోధించారు. తెలంగాణ భవిష్యత్తు రాజకీయ అవసరాలకు మహిళా శక్తిని సన్నద్ధం చేయాలని చెప్పారు.
సమాజానికి మహిళే కేంద్రం
సమాజానికి మహిళే మూలకేంద్రమని కేసీఆర్ స్పష్టంచేశారు. ఇంటిని నడిపే మహిళకు సమాజాన్ని నడిపే శక్తి ఉంటుందని చెప్పారు. అటువంటి మహిళలు సమాజసేవలో, రాజకీయాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అంకాపూర్, ముక్రా(కే) వంటి గ్రామాలు మహిళల చేతిలో అద్భుతంగా తీర్చిదిద్దిన ఉదంతాలు కండ్లముందున్నాయని, పార్టీ నాయకత్వం అందించిన పదవులతో మహిళలు రాజకీయాల్లో రాణించి ఆదర్శంగా నిలిచిన సందర్భాలను ఉదహరించారు.
మహిళల్లో తెలంగాణ భావన పాదుకొల్పాలి
ఎవరికి ఇష్టమున్నా, లేకున్నా భవిష్యత్తు రాజకీయాల్లో మహిళా శక్తి పెరగటం అనివార్య పరిణామమని కేసీఆర్ తేల్చిచెప్పారు. ‘ఒకప్పుడు మహిళల్లో అక్షరాస్యత శాతం తక్కువ ఉండేది. కానీ, పరిస్థితులు మారిపోయినయి. మహిళలు విద్యతో పాటు అన్ని రంగాల్లో వారి శక్తిని చాటుకుంటున్నరు. వారిలో స్వావలంబన పెరిగింది. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే వాతావరణం ఏర్పడుతున్నది. ఇలాంటి తరుణంలో మరింత చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తరు’ అని తెలిపారు. ‘భవిష్యత్తు రాజకీయ అవసరాలకు మహిళా శక్తిని సన్నద్ధం చేయటమే కాదు.. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ మహిళల చేతిలోనే సురక్షితంగా ఉంటుంది’ అని స్పష్టం చేశారు.
వచ్చే నెలలో విస్తృతస్థాయి సమావేశం
ఇంటర్ స్థాయి నుంచి విద్యార్థినులు, ప్రస్తుత, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళా సాహితీవేత్తలు, క్రీడాకారులు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను భాగస్వాములను చేసేందుకు వచ్చేనెల (మే)లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఎమ్మెల్సీ కవిత సారధ్యంలోని మహిళా ప్రతినిధి బృందం కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఐదారు బృందాలుగా కోర్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కోర్ గ్రూప్ అన్ని జిల్లాల పర్యటన చేయాలని చెప్పారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా వివిధ రంగాలు, వర్గాల్లో ఉన్న మహిళల సమగ్ర డాటా సేకరించాలని తెలిపారు. బహిరంగ సభ తర్వాత మహిళాశక్తిని సమీకరించే కార్యాచరణపై దృష్టిసారిస్తామన్నారు. దేశంలో మరే రాజకీయ పార్టీకి లేనంత అత్యుత్తమ మహిళాశక్తి బీఆర్ఎస్కు ఉందని, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా అది మరింత ద్విగుణీకృతం కావాలని చెప్పారు.
పార్టీ పరంగా మహిళా విభాగం ఉన్నదని, ఆ విభాగం కింద మహిళా సైన్యాన్ని ఏర్పాటు చేయాలని, గ్రామగ్రామాన విస్తరించాలని తెలిపారు. పట్టణాలు, వార్డులు, గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్ మహి ళా ప్రతినిధి ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్వేదికగా ఉద్యమ సమయంలో విద్యార్థి సేనను తయారుచేశామని, తెలంగాణ సోయిని, స్పృహను నరనరాన జీర్ణించుకున్న యువకులు ఎంతోమంది నాయకులుగా ఎదిగిన విషయాన్ని గుర్తుచేశారు. మహిళలు కేం ద్రంగా పార్టీ, ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మఒడి, ఆరోగ్యలక్ష్మి వంటి అనేక కార్యక్రమాలను రూపొందించి అద్భుతంగా ముందుకు పోయామని గుర్తుచేశారు.మహిళలు రాజకీయాల్లోకి వస్తే తిరుగుండదు
ప్రపంచవ్యాప్తంగా పురుషాధిక్యత ఉన్నదని, మహిళలను చిన్నచూపు చూడటం కొనసాగుతున్నదని, బ్రిటన్ లాంటి దేశంలోనూ 1918 వరకు మహిళలకు ఓటు హక్కు లేదని కేసీఆర్ గుర్తుచేశారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, స్పీకర్, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇలా అనేక రంగాల్లో మహిళలను ఆదరించటంలో భారత దేశ సమాజమే ముందున్నదని తెలిపారు. రేపటి రోజున అది మరింత ఉధృతం కాబోతున్నదని ఉద్భోదించారు. రాజకీయంగా, సామాజికంగా మహిళల భాగస్వామ్యం పెరిగే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజం, బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నదని తేల్చిచెప్పారు. భవిష్యత్తులో కులాలు, మతాల ఆధారంగా రాజకీయాల్లో గెలుపోటములు ఉండవని, కేవలం పనిచేసేవాళ్లకే ప్రజలు పట్టం కడతారని, కులమతాల ప్రభావం తగ్గి అద్భుతంగా పనిచేసే మహిళలు రాజకీయాల్లో రాణిస్తారని తెలిపారు. మహిళలు రాజకీయాల్లోకి వస్తే వారికి తిరుగుండదని స్పష్టంచేశారు.
కొత్తనాయకత్వం ఎదగాలి
సమాజంలో మహిళా నాయకత్వం ఎదగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. మహిళా రిజర్వేషన్ వల్ల అధికారంలోకి వచ్చినా వారు ఆ అధికారాన్ని సంపూర్ణంగా వినియోగించలేకపోవటం లోపం గా కనిపిస్తున్నదని, దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. ‘ఒకచోట రిజర్వేషన్ మహిళలకు ఇస్తే.. అక్కడ మహిళలు అందుబాటులో లేకపోవటం వల్ల అక్కడున్న రాజకీయ నాయకుడి భార్యనే సహజంగా అభ్యర్థి అవుతున్నది. మహిళా రిజర్వేషన్ కల్పించటం అంటే ఇది కాదు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరో కుటుంబం నుంచి మహిళ రావాలి. అంతటి మహిళా శక్తిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది’ అని కేసీఆర్ స్పష్టంచేశారు. రాజకీయాల్లో మహిళలు ముందుకెళ్లేలా అస్త్రశస్ర్తాలు అందించటమే బీఆర్ఎస్ ధ్యేయంమని తెలిపారు. మహిళా రిజర్వేషన్ అమలైతే ఒక్క బీఆర్ఎస్ తరఫునే ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు 60 మం ది అవసరమవుతారని, అలా ప్రతి పార్టీ లో పోటీ చేసే మహిళలు ఎక్కడున్నారని? ప్రశ్నించారు. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ పక్షాలైన మాజీ సోషలిస్ట్ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించాయని, ఆ సమయంలో ‘ఉన్న సీట్లలో 1/3 ఇవ్వాలంటే ఎవరూ ఒప్పుకోరు.. అదనంగా మూడోవంతు పెంచి ఆ సీట్లను మహిళలకు ఇస్తే ఏ సమస్యా ఉండదు’ అని నాటి యూపీఏ చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సూచించిన విషయాన్ని గుర్తుచేశారు.
సమాజానికి మహిళే మూలకేంద్రం. మేనేజ్మెంట్ స్కిల్సే కాకుండా అనేక విషయాల్లో మహిళలు ముందుంటరు. రేపటి రోజున సమాజంలో రాజకీయంగా వారి పాత్ర
పెరగబోతున్నది. ఇంటిని నడిపే మహిళకు సమాజాన్ని నడిపే శక్తి ఉంటది. -కేసీఆర్
ఇంటర్ స్థాయి నుంచి విద్యార్థినులు, ప్రస్తుత, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళా సాహితీవేత్తలు, క్రీడాకారులు సహా వివిధ రంగాల ప్రముఖులను భాగస్వాములను చేసేందుకు వచ్చేనెల (మే)లో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తం. స్వయం ఉపాధి పొందుతున్న మహిళలను భాగస్వామ్యం చేసే కార్యాచరణను ఎమ్మెల్సీ కవిత సారధ్యంలోని ప్రతినిధి బృందం రూపొందించాలి.
-కేసీఆర్
మున్ముందు రాజకీయంగా, సామాజికంగా మహిళల భాగస్వామ్యం పెరిగే అవకాశాలు విస్తృతంగా ఉన్నయి. భవిష్యత్తులో కులాలు, మతాల ఆధారంగా రాజకీయాల్లో గెలుపోటములు ఉండవు. కేవలం పనిచేసేవాళ్లకే ప్రజలు పట్టం కడుతరు. కులమతాల ప్రభావం తగ్గి అద్భుతంగా పనిచేసే మహిళలు రాజకీయాల్లో రాణిస్తారు. మహిళలు రాజకీయాల్లోకి వస్తే వారికి తిరుగుండదు.
-కేసీఆర్