జగిత్యాల, ఏప్రిల్ 17 : కేసీఆర్ సభతో రేవంత్‌రెడ్డికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కేసీఆర్ సభ కోరుట్ల ఇన్చార్జి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాలలో సభా స్థలాన్ని కేసీఆర్ సభ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ధర్మపురి ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్ రవీందర్రావు, సభ ఇన్చార్జిలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి శుక్రవారం పరిశీలించారు. అనంతరం ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 20న కేసీఆర్ సభలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
ఈ క్రమంలో ప్రజల దృష్టిని మళ్లించడానికే కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించడానికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సభకు ప్రజల స్పందన చూసి ఓర్వలేకనే ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున సభకు వచ్చే ప్రజల కోసం మంచినీరు, మజ్జిగ, పార్కింగ్ వంటి వసతులను సిద్ధం చేశామని చెప్పారు. రేవంత్‌రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలంటూ తెలంగాణ సమాజం కోరుకుంటున్నదని తెలిపారు. జగిత్యాల విజయవంతమై.. కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి పునాది వేస్తుందని స్పష్టం చేశారు.