హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ తరహా రైతు సంక్షేమ, వ్యవసాయ విధానాలు ఎంతో అవసరమని పలు రాష్ర్టాల రైతులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలతోనే వ్యవసాయరంగానికి మేలు కలుగుతుం దని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో కన్సార్టియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్(సీఐఎఫ్ఏ) ఆధ్వర్యంలో వ్యవసాయ రంగానికి ప్రత్యేక అజెండా అంశంపై నిర్వహించిన సెమినార్‌కు పలు రాష్ర్టాల రైతులు, వ్యవసాయరంగ నిపుణులు హాజరయ్యారు.
1990 నాటి ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల సేవ, పరిశ్రమల రంగాలు అభివృద్ధి చెందాయి కానీ వ్యవసాయ రంగం అభివృద్ధికి నోచుకోలేదని వారు పేర్కొన్నారు. కేంద్రంలోని అన్ని ప్ర భుత్వాలు, పార్టీలు వ్యవసాయానికి ప్రా ధాన్యం ఇవ్వకపోవడమే కారణమని విమర్శించారు. కేసీఆర్ విధానాలతో తెలంగాణలో పంటల దిగుబడి పెరిగిందని కొనియాడారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు, మార్కెటింగ్, ఎగుమతుల విధానం తెలంగాణ రైతులకు శాపంగా మారుతున్నాయ ని ఆవేదన వ్యక్తంచేశారు. సెమినార్లో మాజీ ఎంపీ కేసీ త్యాగి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, కుమార షేత్కారి సంఘటన్ ప్రతినిధి రఘునాథ దాదాపాటిల్, ప్రొఫెసర్ దేవీప్రసాద్, సీఐఎఫ్ఏ అధ్యక్షుడు చెంగల్‌రెడ్డి, తెలంగాణ సీఐఎఫ్ఏ అధ్యక్షుడు సోమశేఖర్‌రావు, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.