హైదరాబాద్, జూన్ 27 (నమస్తేతెలంగాణ): ‘పీవీ మన తెలంగాణ ఠీవి.. భారతదేశ ఆణిముత్యం..’ అని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు. పీవీ స్ఫూర్తితో ప్రజా సంక్షేమ పాలన కొనసాగించడమే వారికి మనం అర్పించే నివాళి అని పేర్కొన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన దేశాభ్యున్నతికి చేసిన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ బిడ్డగా, పాలనాదక్షుడిగా, భారత ప్రధానిగా.. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టి, జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తి పీవీ అని ప్రశంసించారు. బహు భాషా కోవిదుడుగా, సాహితీవేత్తగా, రాజకీయ దురంధరుడుగా, దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన తీరు అజరామరమని పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొద్దికాలమే పనిచేసినా ఆయన తెచ్చిన పాలనా సంస్కరణలు ఆదర్శమని కొనియాడారు. వారి కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకొని ‘పీవీని తెలంగాణ ఠీవిగా’ ప్రపంచానికి చాటిన ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కిందని తెలిపారు. పీవీ శతజయంత్యుత్సవాలను ఘనంగా జరుపుకోవడమే కా కుండా, భవిష్యత్తు తరాలు ఆయన కృషిని గుర్తుంచుకొని స్ఫూర్తి పొందేవిధంగా నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్‌గా నామకరణం చేశామని గుర్తుచేశారు. పీవీ 16 అడుగుల కాంస్య విగ్రహాన్ని నెలకొల్పామని, పీవీ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
ఆయన వారసత్వం కొనసాగింపుగా కూతురు సురభి వాణీదేవికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చామని గుర్తుచేశారు. పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని తెలిపారు. పీవీ కృషికి గుర్తింపుగా వంగర, లక్నెపల్లిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడంతోపాటు వరంగల్, కరీంనగర్, వంగర, ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో పీవీ కాంస్య విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. పీవీ గొప్పదనాన్ని స్మరించుకోవడం అంటే తెలంగాణ బిడ్డలు తమ గొప్పదనాన్ని గుర్తుచేసుకోవడమేనని కేసీఆర్ పేర్కొన్నారు.