హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో.. స్వరాష్ట్ర పదేండ్ల ప్రగతిలో గాంధీజీ స్ఫూర్తి ఇమిడి ఉన్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) అన్నారు. గాంధీజీ వర్ధంతి(Gandhiji Death Anniversary) సందర్భంగా కేసీఆర్ నివాళి అర్పించారు. వారు దేశానికందించిన సేవలను, చేసిన త్యాగాలను కేసీఆర్ స్మరించు కున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సహనంతో శాంతియుత పంథా ద్వారా మాత్రమే గమ్యాన్ని చేరుకోగలం. ప్రపంచానికే గాంధీజీ కార్యాచరణ అనుసరణీయమన్నారు. పరాయి పాలన నుంచి భారత దేశానికి స్వాతంత్య్రం సాధించడం కోసం గాంధీజీ అనుసరించిన శాంతియుత పోరాట పంథా, ప్రపంచ ప్రజాస్వామిక ఉద్యమాలకు, స్వయంపాలనకు మార్గదర్శకంగా నిలిచిందని కొనియాడారు.
పీడిత వర్గాలు శాంతియుత మార్గంలో ఐక్యతను సాధించి పోరాడినప్పుడే తమ గమ్యాన్ని చేరుకోగలరనే సందేశాన్ని గాంధీజీ ప్రజాస్వామిక ఉద్యమ కార్యాచరణ మనకందిస్తుందని తెలిపారు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో గాంధీజీ స్ఫూర్తి ఇమిడివున్నదని కేసీఆర్ తెలిపారు. సబ్బండ వర్గాలు, సకలజనులు అభివృద్ధి చెంది, గ్రామ స్వరాజ్యం ఫరిఢవిల్లేలా పదేండ్ల బీఆర్ఎస్ పాలన సాధించిన ప్రగతి వెనుక గాంధీజీ ఆదర్శాలున్నాయన్నారు. సహనంతో కూడిన దార్శనికతను ప్రదర్శించడం ద్వారానే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరింత ప్రగతి సాధ్యమవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. తద్వారా మాత్రమే మనం గాంధీజీకి ఘన నివాళి అర్పించిన వారమవుతామని స్పష్టం చేశారు.