BRS Silver Jubilee | 27న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో నిర్వహించే సమావేశంలో పలు కీలకాంశాలు చర్చకు రానున్నాయి. సమావేశ ప్రాముఖ్యత దృష్ట్యా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల నేతలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సహా ప్రజాప్రతినిధులందరూ తప్పనిసరిగా హాజరుకావాలి
– కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరోసారి గులాబీ జెండా ను రెపరెపలాడించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. పార్టీ ఆవిర్భవించి 25వసంతాలు పూర్తిచేసుకుంటున్న తరుణంలో, రజతోత్సవ ముగింపు సంబురాలను పురస రించుకొని పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో అత్యంత కీలకమైన సమావేశం జరుగనున్నది. మారుతున్న రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ సాగనున్నది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ దృష్టిసారించనున్నారు. క్యాడర్లో మరింత జోష్ నింపడం, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల పునరుద్ధరణ, నూతన సభ్యత్వ నమోదు ప్రక్రియపై చర్చించనున్నారు. సభ్యత్వ నమోదును వేగవంతం చేసి, డిజిటల్ పద్ధతిలో పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై పార్టీ నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సమావేశం ప్రాముఖ్యత దృష్ట్యా పార్టీలోని ముఖ్య నేతలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు మంగళవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు హాజరుకావాలని ఆదేశించారు. రాబోయే స్థానిక సంస్థల(పరిషత్) ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడం, ప్రజాసమస్యలపై పోరాట కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో ఈ సమావేశం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతున్నది.