Jeevan Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కండకావరంతో వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారని తెలిపారు. ఇదేనా ప్రజా పాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో పోలీసులు ఎప్పుడూ రోడ్డెక్కలేదని గుర్తుచేశారు. గురుకులాల్లో 11 నెలల్లోనే 48 మంది విద్యార్థులు చనిపోయారని తెలిపారు. స్వపక్షం నుంచి విపక్షం వరకు అందర్నీ రేవంత్ రెడ్డి వేధిస్తున్నారని ఆరోపించారు. హింసించే 23వ రాజు పలకేశిగా రేవంత్ రెడ్డి మారారని విమర్శించారు.
ఇది ప్రజా పాలన కాదు.. రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పాలన అని హరీశ్‌రావు విమర్శించారు. అధికారుల మీద ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు. శ్రీలంక తీరుగా రేవంత్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని జోస్యం చెప్పారు. ప్రజలతో, కేసీఆర్‌తో పెట్టుకున్నోళ్లు ఎవరూ నిలబడలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలంగాణలో టీడీపీకి తాళం వేసి వెళ్లిపోయారని తెలిపారు. రేపు చిట్టినాయుడి పరిస్థితి కూడా అదేనని అన్నారు. వెళ్లిన దగ్గరల్లా దేవుళ్లపై రేవంత్ రెడ్డి ఒట్టేశాడని పేర్కొన్నారు. రైతుల్ని రాజుల్ని చేసిన కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
దేశంలోనే ఒకే ఒక్క బూతుల సీఎం రేవంత్ రెడ్డి అని జీవన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ తీరుతో లగచర్ల నుంచి దిలావర్పూర్ వరకు రైతుల తిరుగుబాటు జరుగుతుందని చెప్పారు. కాల్చడం, కూల్చడం, పేల్చడం రేవంత్ రెడ్డి ప్రత్యేకత అని విమర్శించారు. రేవంత్ ముసలోళ్ల పింఛన్లు కూడా మూడు నెలలు మింగిండని అన్నారు. కేసీఆర్ అంటే నమ్మకం, రేవంత్ రెడ్డి అంటే అమ్మకమని ప్రజలు అంటున్నారని తెలిపారు. గ్రామం ఏదైనా కాంగ్రెస్ సర్కార్‌పై సంగ్రామమే అని వ్యాఖ్యానించారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై రేవంత్ రెడ్డి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో పాడిపంటలతో విలసిల్లితే.. రేవంత్ పాలనలో అగ్నిమంటలు ఎగసిపడుతున్నాయని అన్నారు.
కేసీఆర్ కుటుంబం ఫైటర్ కుటుంబమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ సోదరులు రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా పంచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరికి వారు దండుకుంటున్నారని తెలిపారు. మూసీ మురికి నీళ్లను కూడా వదిలని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు.