హైదరాబాద్: కేసీఆర్ పాలన (KCR) గురించి నోరు పారేసుకునే వారికి జాతీయ నేర గణాంక విభాగం నివేదిక చెప్పపెట్టు సమాధానమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14వ స్థానానికి పరిమితమైందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు రికార్డు ఉస్థాయిలో 95.84 శాతం తగ్గాయని చెప్పారు. రైతును రాజును చేయాలన్న కేసీఆర్ సంకల్పానికి, చేసిన నిర్విరామ కృషికి వచ్చిన ఫలితమని చెప్పారు. కేసీఆర్కు రైతుకు ఉన్నది పేగు బంధం, ఆత్మ బంధం అయితే.. కాంగ్రెస్కు ఉన్నది కేవలం ఓటు బంధం మాత్రమేనని విమర్శించారు.
‘2014లో 1347 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా, 2023 నాటికి 56కి తగ్గుదల. 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14 వ స్థానికి పరిమితం. 2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా అందులో తెలంగాణ వాటా కేవలం 0.51 శాతం. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు రికార్డు స్థాయిలో 95.84 శాతం తగ్గుదల. ఇవి మాటలు కాదు, కేసీఆర్ తిరగరాసిన రికార్డులు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్న వాస్తవాలు. రైతును రాజు చేయాలన్న కేసీఆర్ సంకల్పానికి, వారు చేసిన నిర్విరామ కృషికి వచ్చిన ఫలితం ఇదంతా!
స్వరాష్ట్రంలో ఒక్కో పథకంతో వ్యవసాయరంగానికి జీవం పోశారు. సాగును బాగు చేశారు. రుణమాఫీతో రైతన్నకు ధీమా దొరికింది. రైతు బంధు బంధువు అయ్యింది. రైతు బీమా కొండంత భరోసా ఇచ్చింది. 24 గంటల ఉచిత విద్యుత్తు వెలుగులు నింపింది. పంట కొనుగోళ్లతో ప్రోత్సాహం అందింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి గోస తీరింది. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ జరిగింది. భూగర్భ జలాలు ఉబికి బీడు భూములను పంట పొలాలుగా మార్చింది. ఉమ్మడి పాలనలో నిత్య దుర్భిక్షం, సాగు విధ్వంసం, వలసల దురవస్థ, ఆత్మహత్యల దౌర్భాగ్యం..తెలంగాణ. స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులతో సుజలమై, ధాన్యపురాశులతో సుఫలమై, సాగుభూమి సస్యశ్యామలమై.. కేసీఆర్ పాలనలో విరాజిల్లింది తెలంగాణ. తెలంగాణను అన్నంగిన్నెగా దేశానికే ఆదర్శంగా నిలిపింది కేసీఆర్. ఆత్మహత్యల తెలంగాణను, అన్నపూర్ణగా మార్చింది కేసీఆర్. కేసీఆర్ పాలన గురించి నోరు పారేసుకునే వారికి ఇది చెంపపెట్టు సమాధానం. కేసీఆర్ కు రైతుకు ఉన్నది పేగు బంధం, ఆత్మ బంధం అయితే.. కాంగ్రెస్ కు ఉన్నది కేవలం ఓటు బంధం.’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.