హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పూరించిన శంఖారావం దేశమంతా మారుమోగుతున్నది. దేశాన్ని నవ్యపథంలో నడిపించే నాయకుడు సీఎం కేసీఆర్ ఒక్కరేనని ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున యూనివర్సిటీలో ఏపీ యూత్, స్టూడెంట్స్ జేఏసీ ప్రకటించింది. బుధవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏపీ యూత్ అండ్ స్టూడెంట్స్ జేఏసీ మీడియా సమావేశం నిర్వహించి సీఎం కేసీఆర్‌కు మద్దతు పలికింది. ఈ సందర్భంగా ఏపీ యువత, విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు గర్వపడేలా తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని కొనియాడారు.
దేశ చరిత్రలో ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్’ అనే నినాదాన్ని ఎత్తుకొన్న మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ అని అన్నారు. జాతీయ పార్టీ స్థాపించి, ఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, గులాబీ జెండా ఎగురవేసి తెలుగుప్రజల గుండెలు ఉప్పొంగేలా చేశారని కీర్తించారు. దేశ ప్రజల కష్టాలను తీర్చేందుకు కేసీఆర్ తీసుకొన్న సాహసోపేత నిర్ణయంలో విద్యార్థిలోకం భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఇద్దరు గోల్మాల్ లీడర్లతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని, నియంత మోదీ విధానాలతో దేశ ప్రతిష్ట అభాసుపాలవుతున్నదని నిప్పులు చెరిగారు.
విజనరీ కేసీఆర్
సీఎం కేసీఆర్‌కు ఉన్న తపనలో ఏపీ నేతల్లో రవ్వంత ఉన్నా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో బాగుపడేదని జగదీశ్ అన్నారు. జాతీయస్థాయిలో కేసీఆర్ లాంటి నేత ఉంటే ఏపీ మాత్రమే కాదు దేశం మొత్తం బాగుపడుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం పట్ల కేసీఆర్‌కు ఉన్న విజన్ గొప్పదని కొనియాడారు. ‘ఏపీ విభజన తర్వాత రెండు కొత్త రాష్ర్టాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఉద్యమనేత కేసీఆర్ తెలంగాణ సీఎంగా సకల జనుల సౌభాగ్యం కోసం పనిచేస్తున్నారు. తెలంగాణలో అన్ని వర్గాలు అభ్యుదయ పథంలో పురోగమిస్తున్నాయి. ఉమ్మడి పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నది. అనతికాలంలోనే దేశానికే దిక్సూచిలా తెలంగాణను మలచిన దార్శనికుడు కేసీఆర్’ అని కొనియాడారు.
తెలంగాణ రైతు దేశానికే ఆదర్శం
సాగునీటి ప్రాజెక్టులను స్వల్పకాలంలో వేగవంతంగా పూర్తిచేసి లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన గొప్పనాయకుడు సీఎం కేసీఆర్ అని రాయపాటి జగదీశ్ శ్లాఘించారు. రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు లాంటి చారిత్రక రైతాంగ సంక్షేమ పథకాలను అమలు చేయటం ద్వారా తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలిపారని ప్రశంసించారు. తెలంగాణలో ఉన్న పథకాలను ఏపీలో తీసుకురావాలన్న కనీస ఆలోచన అయినా ఇక్కడి నాయకులకు ఉన్నదా? అని ప్రశ్నించారు.
గురుకులాల్లో తెలంగాణ టాప్
తెలంగాణలో వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేసి లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల బంగారు భవితకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాటలు వేశారని జగదీశ్ ప్రశంసించారు. టీఎస్ ఐపాస్ తెచ్చి వేలకొద్ది పరిశ్రమలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించటంతో తెలంగాణకు పెట్టుబడుల వరద ప్రవాహం కొనసాగుతున్నదని తెలిపారు.
ఏపీలో ఇద్దరు గోల్మాల్ నేతలు
ఆంధ్రప్రదేశ్ ఇద్దరు గోల్మాల్ నేతల చేతుల్లో చికి తీవ్రంగా నష్టపోయిందని జగదీశ్ రాయపాటి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచస్థాయి రాజధాని అని ఒకరు, మూడు రాజధానులు అని మరొకరు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎనిమిదిన్నరేండ్లు గడిచినా కనీసం ఒక పరిపాలన కేంద్రాన్ని నిర్ధారించలేని అసమర్థ నాయకత్వం చేతుల్లో ఏపీ అల్లాడుతున్నదని మండిపడ్డారు. ‘ఒక ప్రాజెక్టు కట్టిందీ లేదు, ఒక పరిశ్రమను కొత్తగా తెచ్చింది లేదు. చివరికి పోరాడి సాధించుకొన్న విశాఖ ఉకు పరిశ్రమను కార్పొరేట్ గద్దలకు కట్టబెడతామని నిండు పార్లమెంట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటిస్తున్నా కనీసం నోరు మెదపలేని దద్దమ్మలుగా టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీలోని ఆంధ్ర నాయకులు మారారు’ అని నిప్పులు చెరిగారు.
త్వరలో సీఎం కేసీఆర్‌ను కలుస్తాం
నియంతగా మారి, ప్రైవేటీకరణతో అనేక విధాలుగా దేశాన్ని అదానీ, అంబానీ లాంటి వ్యాపారులకు దోచిపెడుతున్న ప్రధాని నరేంద్రమోదీని ఎదిరించే దమ్మున్న నాయకుడు కేసీఆర్ మాత్రమేనని జగదీశ్ అన్నారు. కేసీఆర్ మార్గంలో కదిలి దేశంలో గుణాత్మక మార్పును సాకారం చేద్దామని పేర్కొన్నారు. త్వరలో ఏపీ రాష్ట్ర యువత, విద్యార్థి ప్రతినిధులం హైదరాబాద్‌కు వెళ్లి కేసీఆర్ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను వివరిస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో విద్యార్థి జేఏసీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు నంబూరు రాజేశ్, యూనివర్సిటీ నాయకులు తాళ్లూరు గణేశ్, కృష్ణనాయక్, ముస్లిం మైనార్టీ యువజన నాయకుడు షేక్ హుస్సేన్, బీసీ విద్యార్థి నాయకుడు అశోక్ కుమార్, దళిత జాగృతి నాయకుడు పుల్ల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
దేశానికి కేసీఆర్ చారిత్రక అవసరం
ఉద్యమ నాయకుడిగా, పాలనాదక్షుడిగా, సకల జనులను నడిపిస్తున్న కేసీఆర్ వ్యక్తిత్వం, పోరాటతత్వం, పట్టుదల ముందు ఏపీలోని అబద్ధాల నాయకులంతా మరుగుజ్జులేనని రాయపాటి జగదీశ్ ఎద్దేవా చేశారు. ‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీకి మాత్రమే కాకుండా దేశానికి నాయకత్వం వహించాల్సిన చారిత్రక అవసరం ఉన్నది. ఉన్నతమైన, ప్రగతిశీల ఆలోచనలతో బడుగు బలహీన, దళిత, మైనార్టీసహా సకలజనులు ఏకమై బీఆర్ఎస్ గులాబీ జెండాతో ఏపీని బాగు చేసుకొందాం’ అని పిలుపునిచ్చారు.