జాతీయ పార్టీపై కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు
తెలియజేస్తూ పలువురు ఎన్నారైల తీర్మానం
టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల
నేతృత్వంలో ఎన్నారైల జూమ్ సమావేశం
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): దేశంలో గుణాత్మక మార్పులు తీసుకొనిరావడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో జాతీయ పార్టీని స్థాపించాలన్న ఆలోచనకు ప్రపంచ దేశాల్లోని ప్రవాస భారతీయులు మద్దతు ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని ఎన్నారైలు ఆదివారం జూమ్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలకు కేసీఆర్ నాయకత్వ పటిమ, దార్శనికత, భారతదేశాన్ని ముందుకు తీసుకొనిపోవడానికి రచిస్తున్న ప్రణాళికలు, వ్యూహాలు, ఆలోచనలను ప్రవాస భారతీయులకు తెలియజేస్తామని ప్రకటించారు. తెలంగాణ సాధించిన స్ఫూర్తితోనే జాతీయ స్థాయిలోనూ సంపూర్ణ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్‌కు ప్రవాస భారతీయుల మద్దతు ఉంటుందని, ఆయన వెంట నడుస్తామని ప్రకటించారు.
ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ప్రతిపాదించిన ‘దేశ రాజకీయాలలో కేసీఆర్ నాయకత్వం అవసరం’ తీర్మానానికి వివిధ దేశాల్లోని ఎన్నారైలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల మాట్లాడుతూ రెండు జాతీయ పార్టీలు దేశాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. రాదనుకున్న తెలంగాణను ఎన్నో ఉద్యమాలు చేసి, అందరినీ ఏకం చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో అపార వనరులున్నా వాటిని వినియోగించుకోవడంలో రెండు జాతీయ పార్టీలకు నిబద్ధత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే కానీ.. ప్రజలకు అవసరమైన ఎజెండా ఏమీ అమలు చేయట్లేదని అన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న ఎన్నారైలకు తెలంగాణలో అభివృద్ధిని వివరించి మద్దతు కూడబెడతామని మహేశ్ బిగాల ప్రకటించారు.
కేసీఆర్‌తో మార్పు సాధ్యం: అనిల్ కూర్మాచలం
ఈ సందర్భంగా యూకే నుంచి ఎన్నారై నాయకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ ముందుందని, బీజేపీ పాలనలో భారత్ అన్ని విషయాల్లో కిందకి వెళ్ళిందన్నారు. యూకే ఎన్నారై నాయకుడు అశోక్ దుసారి మాట్లాడుతూ దేశంలో మార్పు రావాలని, కాంగ్రస్ , బీజేపీ చూశామని, వారు దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దక్షిణాఫ్రికానుంచి నాగరాజు గుర్రాల మాట్లాడుతూ అత్యధికం కాలంపాటు దేశాన్ని జాతీయ పార్టీలుగా చెప్పుకొనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశంలో గుణాత్మక మార్పు రాకపోగా, పరిస్థితి నానాటికీ దిగజారిందని చెప్పారు. ఈ క్రమంలో పోరాటాల ఖిల్లా అయిన తెలంగాణ నమూనాను దేశవ్యాప్తంచేసి, జాతికి మార్గం చూపాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఇందుకు జాతీయ పార్టీ ఏర్పాటు ఒకటే పరిషారమని తెలిపారు. జర్మనీకి చెందిన అరవింద్ మాట్లాడుతూ బీజేపీ నేతల మాటలు జర్మన్లో కూడా చాలా ఇబ్బందులు గురిచేశాయని చెప్పారు. సింగపూర్ నుంచి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కుల మతాలతో వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఖతర్‌కు చెందిన అఫ్రోజ్ ఖాన్ మాట్లాడుతూ రాజకీయాలు చూస్తుంటే గల్ఫ్‌లో అందరికీ ఇబ్బందిగా మారిందని తెలిపారు. జాతీయ పార్టీ స్థాపించాలనే కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. పెరు నుంచి రంగారెడ్డి బద్దం మాట్లాడుతూ ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు కానీ, వనరులను ఉపయోగించుకోవడంలో కేసీఆర్ ముందు భాగంలో ఉన్నారన్నారు.
గల్ఫ్ దేశాల మద్దతు
బీజేపీ వల్ల గల్ఫ్ దేశాల్లో చాలా ఇబ్బంది పడ్డామని, తెలంగాణ ఎలాగైతే దేశంలో నంబర్ వన్‌గా ఉన్నదో ప్రపంచవ్యాప్తంగా ఇండియాను ముందంజలో నడపాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమని కువైట్ ఎన్నారై అభిలాష అన్నారు. దేశంలో బీజేపీ రాజకీయాలు చూస్తుంటే గల్ఫ్‌లో అందరికీ కష్టంగా ఉన్నదని ఖతర్‌కు చెందిన అఫ్రోజ్ ఖాన్ అన్నారు. దేశంలో మతాల పేరుతో కులాల పేరుతో గొడవలు పెడుతున్న పార్టీలను భూస్థాపితం చేయాలని, కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టకముందే అందరం సభ్యులమయ్యామని, వారికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఒమన్ కు చెందిన మహిపాల్ అన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావటం సంతోషంగా ఉన్నదని బహ్రెయిన్‌కు చెందిన సతీశ్ తెలిపారు. దేశం గర్వించే విధంగా తెలంగాణ ఉన్నదని, ఇంటింటికీ కేసీఆర్ పథకాలు అందుతున్నాయని గుర్తుచేశారు. మన దేశంలో బలమైన మార్పు రావాలని కోరుకొంటున్నామని, అది కేసీఆర్‌తోనే సాధ్యమని చెప్పారు. భారతదేశానికి బలమైన నాయకుడు కావాలని అలాంటి నేత కేసీఆరేనని కెనడాకు చెందిన కృష్ణ అభిప్రాయపడ్డారు. గత ఎనిమిదేండ్లుగా తెలంగాణలో జరిగిన సంక్షేమం అమలవుతున్న పథకాలు గొప్పగా ఉన్నాయని చైనాకు చెందిన రవీందర్ పేర్కొన్నారు. కేసీఆర్ స్థాపించే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తమ మద్దతు ఉంటుందని యూఎస్‌కు చెందిన రజనీకాంత్ ప్రకటించారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జాతీయ పార్టీ ఏర్పాటుకు మద్దతుగా ఆదివారం నిర్వహించిన జూమ్ మీటింగ్ పాల్గొన్న ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, ఇతర ఎన్నారైలు
మహారాష్ట్ర ఎన్నారైల మద్దతు
తెలంగాణను సాధించిన స్ఫూర్తితో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో విజయం సాధించాలని కోరుకొంటున్నామని న్యూజిలాండ్ ఎన్నారై జగన్ తెలిపారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాబోతున్న జాతీయపార్టీకి న్యూజిలాండ్ తరఫున పూర్తిగా మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ అనే పదం మర్చిపోతున్న రోజుల్లో తెలంగాణని సాధించి చూపించారని డెన్మార్క్ ఎన్నారై శ్యాంబాబు ఆకుల అన్నారు. తకువ కాలంలో తెలంగాణ మిగతా రాష్ట్రాలకన్నా ముందంజలో ఉన్నదని మహారాష్ట్రకు చెందిన ఎన్నారై రాజేశ్ హిప్పారాజ్ అన్నారు. దీన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మహారాష్ట్ర తరఫున తమ మద్దతు కేసీఆర్‌కు కేం ద్రంలో ఉంటుందని ప్రకటించారు. టీఆర్ఎస్ జాతీ య రాజకీయాలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని స్విట్జర్లాండ్‌కు చెందిన శ్రీధర్ పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం ఆవశ్యకత ఉన్నదని అభిప్రాయపడ్డారు.
ప్రపంచ దేశాల మద్దతు
మహేశ్ బిగాల తీర్మానానికి మద్దతు తెలిపిన వారిలో.. యూకే నుంచి నవీన్, సృజన రెడ్డి , రమేశ్‌బాబు, హరి, సురేశ్ ,కల్యాణ్, ఖతర్ నుంచి శ్రీధర్, జాంబియా నుంచి రాహుల్ , మలేసియా నుంచి చిట్టిబాబు, సిడ్నీ నుంచి రాజేశ్, న్యూజిలాండ్ నుంచి కిరణ్, దక్షిణాఫ్రికా తరపున నరేందర్ రెడ్డి, హరీశ్ రంగా, అరవింద్ ప్రసాద్, సుఖేశ్ , వెంకట్రావు తాళ్లపల్లి, నరేశ్ యాదారి, సిడ్నీ నుంచి పరశురామ్, కువైట్ నుంచి సురేశ్, జర్మనీ నుంచి రవికాంత్, స్విట్జర్లాండ్ నుంచి కిశోర్, నార్వే నుంచి శ్రీనివాస్, బహ్రెయిన్ నుంచి సుమన్‌తోపాటు యూఎస్, ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ , డెన్మార్, ఫిన్లాండ్, స్వీడన్, ఆస్ట్రియా, పోలండ్, జర్మనీ, జాంబియా, పెరు, సింగపూర్, మలేసియా, పరాగ్వే, చైనా, ఖతర్, ఒమన్, లా ట్వియా, కొలంబియా, ఇథియోపియా, మలావి, కువైట్, సౌదీ అరేబియా, మాల్దీవులు, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్, యూఏఈ, బోట్స్వానా, ఉగాండా, టాంజానియా , కెన్యా, మాల్టా, ఫిలిప్పీన్స్, కెనడా దేశాల ప్రతినిధులు ఉన్నారు.