BRS | హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పదేండ్ల పండుగ సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించనున్న వేడుకలను బీఆర్ఎస్ శనివారం ప్రారంభించింది. అమరులను స్మరిస్తూ.. ఉద్యమ ఘట్టాలను గుర్తుచేసుకుంటూ తొలిరోజు కార్యక్రమమంతా ఉద్వేగంగా సాగింది. గన్‌పార్క్‌లోని అమరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు అమరులకు ప్రణమిల్లారు. అక్కడి నుంచి ప్రారంభమైన కొవ్వొత్తుల ర్యాలీ సెక్రటేరియట్ దగ్గరున్న అమరజ్యోతి వరకు సాగింది. కేటీఆర్, హరీశ్ వంటి నేతలు జ్యోతులతో ముందు నడువగా, జనసందోహం వారిని అనుసరించింది. దారిపొడవునా ‘జై తెలంగాణ’ నినాదాలు మార్మోగాయి. మరోవైపు శనివారం గన్‌పార్క్‌లో కేసీఆర్ కార్యక్రమం ఉన్నదని తెలిసినా ముందురోజే కంచెలు నాటిన కాంగ్రెస్ సర్కార్.. కొవ్వొత్తుల ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్ మళ్లించకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ.. ఆగమైన రత్నవీణ తెలంగాణ.. ఆగని అగ్నివాన! తెలంగాణ.. అలుపెరగని పోరాట కోన!
అస్తిత్వం, ఆత్మగౌరవం కోసమే శతాబ్దాలుగా ఈ నేల నిలబడింది. తెగింపునకు, తిరుగుబాటుకు, త్యాగానికి ఈ గడ్డ ప్రతీక. ఆకలిని భరించినా.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోని పోరాటతత్వం తెలంగాణది. కానీ అమాయకత్వమే దాని బలహీనత. అందుకే రాచరికయుగాల మొదలు రాజకీయ మారీచుల వరకు అందరూ తెలంగాణను దగా చేసిండ్రు. ధ్వంసం చేసిండ్రు. తమ ప్రయోజనాల కోసం ఇక్కడి ప్రజలను దోచుకున్నరు. కత్తిగట్టిన ప్రాంతేతరులకు సద్దిగట్టిందీ స్థానికుడే. ఈ దగాపర్వంలో వంచితగా మిగిలిందే తప్ప.. తెలంగాణ ఏనాడూ నిస్తేజంలో పడిపోలేదు. తిరుగుబాటును ఆపలేదు. కుదిరితే కార్చిచ్చుగానో, లేనివేళల్లో కాగడాలాగనో, అదీ వీలుగాని నిర్బంధ వేళల్లో చిన్న నిప్పురవ్వగానో జ్వలిస్తూనే ఉన్నది. ఆధిపత్యంపై పోరాటం చేస్తూనే ఉన్నది. అస్తిత్వ పతాకం ఎగరవేస్తూనే ఉన్నది. తెలంగాణ ఓ సిల్సిలా.
పాములు, నిచ్చెనలతో నిండిన రాజకీయ పరమపద సోపానపటంలో పడిపోయిన ప్రతీసారి శక్తినంతా కూడగట్టుకొని పోరాడింది తెలంగాణ. గమ్యాన్ని ముద్దాడే క్రమంలో అందివచ్చిన నిచ్చెనమెట్లెన్నో! కాటేసిన కాలనాగులెన్నో! పోరాట పథం ప్రతి మలుపులో ఓ ప్రశ్న ఎదురయ్యేది. సమాధానం చెప్పి ఒప్పించగానే భేతాళుడు తిరిగి చెట్టెక్కేసేవాడు. మరో ప్రహేళిక.. మరో ప్రయత్నం.. మళ్లీ పోరాటం! క్యాలెండర్లు మారిపోయాయి. డెడ్లైన్లు దాటిపోయాయి. ఎన్నేసి ఎన్నికల్లో జనం సుస్పష్టంగా తీర్పునిచ్చినా.. ఏలికల నాలుక మాటిమాటికీ మడతపడేది. రాజకీయం పాచిక విసిరి.. మళ్లీ ఓ మెలిక పెట్టేది. నయా నయవంచనకు సిద్ధమయ్యేది. వృద్ధ వ్యాఘ్రం ఇస్తానన్న బంగారు కంకణం ప్రత్యేక రాష్ట్రం. దాని ఆశజూపి బలగొన్న ప్రాణాలు తెలంగాణవి. ఆ ముసలిపులి కాంగ్రెస్!!
తెలంగాణ మళ్లీ ఇప్పుడు తనను తాను తడుముకుంటున్నది. పరాధీనతను వీడని మనుషుల చేష్టలను చూసి తల్లడిల్లుతున్నది. ఒళ్లంతా పచ్చినెత్తురు. నిలువెల్లా గాయాల గేయాలు. దశాబ్దాలుగా దగా చేసినవాళ్లే.. ప్రతి రస్తాలో దోఖా చేసినవాళ్లే.. ఇప్పుడు కొత్త కహానీలు వినిపిస్తున్నరు. నాటకం నడిపిస్తున్నరు. ‘మేం ఇచ్చినం’ అంటున్నరు. ‘మేమే ఇయ్యుమని చెప్పినం’ అంటున్నరు. ‘అసలు మేమే లేకపోతే వస్తుండెనా?’ అని కూడా అంటున్నరు. ఏదో తిజోరీలోంచి తీసి జోలెలో బిచ్చమేసినట్టు తమకు తామే త్యాగరాజులమని చిరతలు వాయిస్తున్నారు. జీవితంలో ఎన్నడూ ‘జై తెలంగాణ’ అననోళ్లు.. ఇప్పుడు తమంతటి ఉద్యమకారులు లేనేలేరని చంకలు గుద్దుకుంటున్నరు. తెలంగాణ గురించి అఆలు కూడా తెల్వనివాడు.. ఇవ్వాళ తెలంగాణ ఎలా ఉం డాల్నో నిర్ణయిస్తడట! తెలంగాణ కోసం నెత్తురు ధారపోసినట్టు.. సర్వస్వం త్యాగం చేసినట్టు కలరింగులు ఇస్తూ కొందరు కొత్త కొత్త సిద్ధాంతకర్తలు స ర్కారీ గద్దెల మీద రాగాలాపన చేస్తున్నారు. కిరాయివాణి వినిపిస్తున్నరు. దశాబ్దకాలంగా తెలంగాణ ఏం సాధించిందో, ఎంతటి శిఖరాలకు చేరుకున్నదో కండ్లముందు వెలుగులీనుతూ కనిపిస్తున్నా.. చూడలేని అంధ మేధోమూకలు ఇప్పుడేదో అద్భుతాలు జరిగినట్టు తెగ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పేగులు తెగేదాక కొట్లాడినోళ్లకు.. పేగులు మెడలో వేసుకుని తిరుగుతామన్నోళ్లకు మధ్య తేడాను తెలంగాణ సమాజం ప్రస్తుతం చూస్తున్నది.
తెలంగాణ.. ఎవరో ఇస్తే పుచ్చుకున్న బిచ్చం కాదు. పోరాడి సాధించిన హక్కు! నూనూగుమీసాల యువకుల బలిదానాలతో సిద్ధించిన వరం! ఎత్తుకు పైఎత్తులతో శత్రువును చిత్తు చేసిన తెలంగాణ రాజకీయ చాణక్యం! ఎత్తిన జెండా దించకుండా దారిలో రాళ్లను, ముళ్లను లెక్కచేయకుండా.. కుట్రల కత్తుల వంతెనపై మడమ తిప్పని పోరా టం! ఒక పౌరయుద్ధంతో సాక్షాత్కారమైన సామూహిక స్వప్నం! దేశ చరిత్రలో నిలిచిపోయే ఒక మహత్తర పోరాట చరిత్ర.
సమరాంగణమున సైంధవులెందరో..
పెద్ద మనుషుల ఒప్పందం పెద్ద దగా. దాని మాటున అమాయకపు తెలంగాణను ఆంధ్రా అల్లరి పిల్లవాడికి బలవంతంగా కట్టబెట్టిన కుతంత్రం తొందరలోనే ప్రజలకు తెలిసివచ్చింది. తెలంగాణకు ఉపముఖ్యమంత్రి పదవి ఆరోవేలు లాంటిదంటూ కాంగ్రెస్ కథ వినిపించినప్పుడే.. ఆ పార్టీ ‘చెయ్యి’చ్చిందని తెలంగాణకు అవగతమైంది. తెలంగాణ నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులైనా వారిని మూడేండ్లు కూడా ఉండనివ్వనప్పుడే.. కాంగ్రెస్ ధోకాబాజీ ప్రజలకు అర్థమైంది. ముల్కీని మూలకు నెట్టి కొలువులను కొల్లగొట్టినప్పుడు దాని కుట్ర తేటతెల్లమైంది. ఇక్కడ నిధులను దారిమళ్లించినప్పుడే దాని దోపిడీతత్వం బోధపడింది. గలగలా గోదారి, బిరాబిరా కృష్ణమ్మలను ఈ నేలను కాదని మలుపుకొన్నప్పుడే మన నీళ్లూ మింగేశారన్న నిజం తెలిసివచ్చింది. తెలంగాణ పోరాడింది దోపిడీదారుల పైనే కాదు, వాళ్లకు సహకరించిన సైంధవులపైన కూడా! ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినప్పుడు.. నట్టనడిమిట్ల నమ్మించి గొంతుకోసిన కట్టప్పలపైన కూడా!
‘
ఇడ్లీ-సాంబార్ గోబ్యాక్’ అని నినదించిన హైదరాబాద్ సిటీకాలేజీ సాక్షిగా.. తూటాలకు ఆరుగురు బలైంది ఎవరి కుట్రలకు? దానికి కారకులెవరు? ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యమని’ పంచనచేరినోళ్ల మోచేతి నీళ్లు తాగిందెవరు? బొంకి బోర్లేసిందెవరు? దొంగలకు సద్దిగట్టిన స్థానికులెవరు? ‘మీది కుండ మీదనే ఉండగానే కింది కుండను మాయం చేసినట్టు’ కొలువులను కొల్లగొడుతుంటే కండ్లుమూసుకున్నదెవరు? 1969కి కారకులెవరు? 369 మందిని పొట్టనపెట్టుకున్నదెవరు? 14గింట 11 మంది ఎంపీలను పార్లమెంట్‌కు పంపితే మసిపూసి మారేడుకాయ చేసిందెవరు? ప్రజాస్వామిక ఆకాంక్షను నియంతలై తొక్కిందెవ రు..? పెద్దమనుషుల ఒప్పందాన్ని అటకెక్కించిందెవరు? ఆరుసూత్రాలను ఆగం జేసిందెవరు? ‘జై తెలంగాణ’కు పోటీగా ‘జై ఆంధ్రా’ను లేవదీసిన కుతంత్రపు సృష్టికర్తలెవరు?
కటిక నిజాలు.. చీకటి కోణాలు
తెలంగాణ. ఇవ్వాళ ‘కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యి’. ఎన్నయినా మాట్లాడొచ్చు. ఎన్ని నిందలైనా వేయొచ్చు. కానీ, నిజం కండ్ల ముందున్నది. 1952 పోలీస్ కాల్పులనుంచి 1969లో వందల మంది ఊచకోత వరకు ఉద్యమం సాగినా తెలంగాణ ఎందుకు రాలేదు? ఉద్యమాన్ని మధ్యలోనే వదిలేసి.. ఆకాంక్షలను అణగదొక్కిన కుట్రదారులెందరు? నమ్ముకున్న ప్రజల గొంతుకోసి ఢిల్లీ పాదుషాల ముందు పాదాక్రాంతమైన కాలాంతకులెందరు? కరడుగట్టిన సమైక్యవాదినీ మనవాడిగా, మహానుభావుడిగా చిత్రీకరించిన మీడియా ఎవరిది? సంఘర్షణలోనూ, సందిగ్ధావస్థలోనూ, స్తబ్ధతలోనూ చేతులు అడ్డుపెట్టి, దోసిలిమూసి తెలంగాణ వాదమనే జ్యోతిని కాపాడిందెవరు? 2001 మలిదశ ఉద్యమంతోనే రాష్ట్రసాధన ఎలా సాధ్యమైంది? ఎన్ని త్యాగాలు, ఎన్ని సవాళ్లకు ఎదురు నిలిస్తే స్వప్నం సాకారమైంది? ఎన్ని అడ్డంకులు దాటితే మార్గం సుగమమైంది? ఎంత రాజకీయ చాణక్యం, చైతన్యం కలగలిపి నడిస్తే గమ్యం చేరువైంది? రాజకీయ అనివార్యతతోనే రాష్ట్రం సిద్ధిస్తుందని విశ్వాసం పాదుకొల్పిందెవరు? గత వైఫల్యాలనే పునాది చేసుకొని ఒక్కో దశలో ఒక్కో వ్యూహంతో ఉద్యమ స్ఫూర్తిని గ్రామగ్రామాన రగిల్చి ఉద్యమాన్ని లక్ష్యానికి చేర్చిన చతురత ఎవరిది? సబ్బండ వర్ణాలను సమన్వయం చేసి, జాతీయస్థాయిలో మద్దతును కూడగట్టిన వ్యూహమెట్టిది? తెలంగాణ ఇవ్వకుండా ఉండలేని అనివార్యతను సృష్టించిందెవరు? గల్లీ నుంచి ఢిల్లీ దాక.. ఆర్ఎస్యూ నుంచి ఆర్ఎస్ఎస్ దాక.. తెలంగాణ కాజ్ కోసం కదిలించిందెవరు? ముందుకు నడిపించిన చోదకశక్తి ఏది? ఎన్నిసార్లు రాజీనామాలు! ఎన్ని ఎన్నికలు! ఎన్ని సభలు! ఎట్లాంటి ఉద్యమం! ఎంతటి ఉద్వేగం!
పదఘట్టనల కింద పడి నలిగిన తెలంగాణ
తెలంగాణ వొడవని ముచ్చట. తీరని దుఃఖం. దశాబ్దాలపాటు జరిగిన విధ్వంసానికి నీళ్లకు బదులు నెత్తురు కారని కన్ను ఉన్నదా తెలంగాణ గడ్డమీద? భంగపడని బతుకు ఉన్నదా ఈ నేలన? చెరువును చెరబట్టినవాళ్లు…ఊరును ఛిద్రం చేసినవాళ్లు…పాటను ముక్కలు చేసినవాళ్లు.. నోరును నొక్కేసినవాళ్లు.. పిడికిళ్లను పలుగదీసినవాళ్లు.. ఎంత అణచివేత! ఎంతటి అరాచకీయం!తలాపున నదులు పారుతున్నా కరువు కమ్మేస్తే కడుపులో కాళ్లుముడుసుకున్న పల్లెలు! మెతుకు వెతుకులాటలో ఊరూరూ వలసబాట! బొంబాయి.. దుబాయి.. బొగ్గుబాయి! తరాలుగా తెలంగాణ తండ్లాట ఇదే కదా! తండ్రులే కొడుకులకు తలకొరివి పెట్టే గడ్డగా తెలంగాణ ఎందుకు పిలువబడింది? ఎంత వ్యథ! ఎంతటి గుండెకోత!
అంతటి నిస్సహాయతలో, నీరవనిశ్శబ్దంలో, నిర్బంధంలో తెలంగాణ రాజకీయ పార్టీని కలగన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి రూపంలో ఆత్మగౌరవ ఆకాంక్షను ఆకాశమంత ఎత్తుకు తీస్కపోయే జెండా ఒకటి ఎగిరింది. కేసీఆర్ రూపంలో తెలంగాణ సమాజానికి నమ్మిక కుదిరింది. బక్కపలచని యుద్ధభేరి మోగింది. కేసీఆర్ అనే మూడక్షరాలు.. దగాబడ్డ తెలంగాణకు గుండె ధైర్యాన్నిచ్చింది. అప్పటిదాక ఆయనెవరో ఉమ్మడి మెదక్ జిల్లా మినహా తెలంగాణ ప్రజలకు పెద్దగా తెలియదు. ఆర్థికంగా పరిపుష్టి ఉన్న నాయకుడు కూడా కాదు. సినీ గ్లామర్ లేదు. మీడియా మద్దతు లేదు. అన్నింటికి మించి ప్రత్యర్థులుగా ఇద్దరు బలమైన నాయకులు (చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి). ఇలాంటి ప్రతికూలతల మధ్య ‘జై తెలంగాణ’ నినాదం ఎత్తుకున్నారు. డిప్యూటీ స్పీకర్ (మంత్రి హోదా), ఎమ్మెల్యే పదవి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఇలా ఏకకాలంలో మూడు పదవులకు రాజీనామా చేయటం ద్వారా ‘పదవుల కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కాదు కేసీఆర్’ అని ప్రజల్లో బలమైన విశ్వాసాన్ని కల్పించారు. తెలంగాణ చర్చకు తిరిగి ప్రాణంపోశారు. పదవుల కోసమో..మరో దానికోసమో ఉద్యమం నుంచి పక్కకు జరిగితే‘నన్ను రాళ్లతో కొట్టిచంపండి’ అని పిలుపునిచ్చారు. సమకాలీన భారత దేశ చరిత్రలో అలా చెప్పగలిగిన, అలాగే నడిచిచూపిన నాయకులు ఇంకెవరైనా ఉన్నారా?
చారిత్రక విభాత సంధ్యల తెలంగాణ పయనమెట్టిది?
అర్పించిన ప్రాణాలెన్ని? కనిపించని కోణాలెన్ని?
సుదీర్ఘ ఉద్యమంలో మెరుపులెన్ని? మరకలెన్ని?
గోదాలోకి దిగి పోరాడిందెవరు?
చెట్టుచాటున నక్కి బాణాలేసిందెవరు?
అట్టుడుగున పడి కాన్పించని కథానాయకులెవరు?
పసికూన రాష్ట్రం పసిడి తెలంగాణగా మారిందెట్ల?
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల వేళ..
తెలంగాణ ప్రస్థానంపై ప్రత్యేక కథనాలు
‘నమస్తే తెలంగాణ’లో.. త్వరలో..