చెరువులను విధ్వంసం చేసి ఉమ్మడి పాలకులు తెలంగాణ ఆయువు తీశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిద్రం చేశారు. కానీ కేసీఆర్ మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టారు. చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. ఉమ్మడి పాలకులు దశాబ్దాల నిర్లక్ష్యం మూలంగా చాలా చెరువులకు వరదవచ్చే మార్గాలే లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయ ఆశయాన్ని నెరవేర్చేందుకు కేసీఆర్ మరో బృహత్తర ఆలోచన చేశారు. గోదావరి జలాల్లో రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ వాటా 169 టీఎంసీలు. వాటిని పూర్తిగా వినియోగించుకోవడంతో చెరువులకు జలకళను తీసుకువచ్చేందుకు ప్రణాళికలను రూపొందించారు.
అందులో భాగంగానే ప్రాజెక్టులకు చెరువులను అనుసంధానించాలని నిర్ణయించారు. వాగుల పునరుజ్జీవం పేరిట చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. వాటన్నింటినీ గోదావరి బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల కాలువలతో అనుసంధానించారు. తూములు పెట్టి గొలుసుకట్టు చెరువులను అనుసంధానించారు. క్రమం తప్పకుండా చెరువులను నింపారు. తద్వారా భూగర్భజల మట్టం గణనీయంగా పెరిగింది. భూగర్భ జలాల మట్టం పెరుగుదలతో జలాల స్వచ్ఛత కూడా పెరిగింది. ఫ్లోరైడ్, ఆర్సెనిక్ తదితర హానికర మూలకాల గాఢత తగ్గిపోతున్నదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.