హైదరాబాద్: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ (Madanlal) మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KTR) సంతాపం వ్యక్తంచేశారు. మదన్‌లాల్ మృతి బీఆర్ఎస్కు తీరని లోటని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు మదన్‌లాల్ మృతిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారంభించారు. వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం కలిగించాలన్నారు. మదన్‌లాల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ గుండెపోటుతో కన్నుమూశారు. గతవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. నాలుగు రోజుల క్రితం వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను స్థానిక దవాఖానకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఏఐజీకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు బంధువులు వెల్లడించారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున వైరా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. దీంతో ప్రస్తుతం ఆయన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉన్నారు.