KCR | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగంచేసే దిశగా.. ఆంధ్రా ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఎట్టిపరిస్థితుల్లో నిలువరించాల్సిందేనని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. అందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో పోరాటాల కోసం కార్యోన్ముఖులను చేయాలని సూచించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి ఆంధ్రా ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలుచేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను నమ్మిన పాపానికి, తెలంగాణ రైతాంగానికి శాశ్వత అన్యాయం చేసేందుకు ఒడిగడుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వ దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఎర్రవల్లిలోని నివాసంలో మంగళవారం పార్టీ నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రైతు సంక్షేమంలో విఫలమైన రాష్ట్రప్రభుత్వంపై పోరాటాలు మరింత ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రజా సమస్యల మీద పోరాడేందుకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేస్తున్నట్టుగా మిగతా అన్ని అనుబంధ సంఘాలను పటిష్ఠం చేయాలని సూచించారు. రైతాంగ సంక్షేమం కోసం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ఉద్యమించాలని దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పండబెట్టి వానకాలం నాట్లు అయిపోతున్నా ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
తక్షణమే కన్నేపల్లి పంప్‌హౌస్ దగ్గర గోదావరి జలాలను ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. పంపులను ఆన్ చేసి రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపాలని అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు వరినాట్లు వేసుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరమని, దీని మీద రైతులతో కలిసి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో అభివృద్ధి పడకేసిందని, పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని వాపోయారు. ప్రజలు రేవంత్‌రెడ్డి పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ప్రజలపక్షాన బీఆర్ఎస్ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్ అబద్ధాలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిచోటా అబద్ధాలే చెప్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర సీఎం తహతహలాడుతుండడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పరస్పరం విమర్శలతో కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నాయని విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. ఇప్పటికే ప్రజా సమస్యల మీద పోరాడేందుకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేస్తున్న దిశగా… మిగతా అన్ని అనుబంధ వ్యవస్థలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. వాళ్లందరినీ ఏకం చేసి క్షేత్రస్థాయి పోరాటాలు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రజలకు ఏనాడైనా అండగా నిలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని కేసీఆర్ స్పష్టంచేశారు. సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర సీఎం తహతహలాడుతుండటాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నది. తెలంగాణ రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి.. ఆంధ్రా ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలుచేయడం దుర్మార్గం. కాంగ్రెస్, బీజేపీ పరస్పరం విమర్శలతో కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నాయి. ప్రజా సమస్యలను పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలి. అందరినీ ఏకం చేసి క్షేత్రస్థాయి పోరాటాలు చేపడదాం. తెలంగాణ ప్రజలకు ఏనాడైనా అండగా నిలిచేది బీఆర్ఎస్ పార్టీనే.
– కేసీఆర్