తిరుమలగిరి, ఫిబ్రవరి 11: నల్లగొండలో ఈ నెల 13న జరిగే కేసీఆర్ సభను అడ్డుకుంటామని జో కర్స్, బ్రోకర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పడం పిరికిపందల చర్య అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. నల్లగొండ కేసీఆర్ అడ్డా అని, కేసీఆర్ అంటే త్రీ ఫేజ్ కరెంట్.. ముట్టుకుంటే మసైపోతారని హెచ్చరించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్నది నీళ్ల కోసమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కృష్ణానీటిలో తెలంగాణ వాటా తేల్చకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం ప్రజలను, రైతాంగాన్ని మోసం చేయడమేనని పేర్కొన్నారు. రైతుల కోసం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పేగులు తేగేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు. తక్షణమే ప్రభుత్వం కేఆర్ఎంబీ ఒప్పందాన్ని విరమించక పోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి కావడం దురదృష్టం అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. కల్లుతాగిన కోతుల్లా కోమటిరెడ్డి బ్రదర్స్ పూటకో మాట మాట్లాడుతూ కేసీఆర్ సభను అడ్డుకుంటామనడం సిగ్గుచేటని అన్నారు.