Harish Rao | మహబూబ్‌నగర్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కేసీఆర్ కల్పవృక్షమైతే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలుపుమొక్క అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ‘ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా ఇది? రేవంత్ నోటికి వచ్చేవి ఒట్లు లేకుంటే తిట్లు’ అని ఎద్దేవాచేశారు. ‘కాంగ్రెస్ సీనియర్లను తొక్కుకుంట సీఎం అయినవు.. దేవుళ్ల మీదే ఒట్లు పెట్టి ప్రజలను మోసం చేసినవు’ అని ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి క్షేత్రంలోని వేంకటేశ్వర స్వామిని బుధవారం హరీశ్‌రావు దర్శించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘మొన్నీమధ్య రేవంత్‌రెడ్డి కురుమూర్తి వద్దకు వస్తే.. ఆ దేవుడి మీద ఒట్టేసి తప్పుడు చేసిండు కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకోడానికి వచ్చిండేమో? అనుకున్న. తప్పయింది.. క్షమించుమని కురుమూర్తి స్వామిని వేడుకుండడేమో అనుకున్న.. ఒట్టేసి మాట త ప్పి ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలేదు’ అని దుయ్యబట్టారు. ‘రేవంత్‌రెడ్డికి మాటలెక్కువ చేతలు తక్కువ.. పరిపాలన చేతగానోడు.. ఓడిపోయేటోడు ఫ్రస్టేషన్లో తిట్ల పురాణం అందుకుంటడు’ అని నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌నే కోరుకుంటున్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 100 సీట్లు ఖాయమని చెప్పారు.
‘రేవంత్‌రెడ్డి నిన్న 45 నిమిషాల ప్రసంగం చేస్తే 50 సార్లు కేసీఆర్‌నే యాది చేసుకున్నడు.. ఆయనకు నిద్రలో కూడా కేసీఆరే యాదికొస్తడు. తన పని అయిపోయిందని రేవంత్‌కు అర్థమైంది. ప్రజలంతా కేసీఆర్‌నే తలుస్తున్నర ని అర్థమైంది. ఆ భయంతోనే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నడు’ అని హరీశ్ ఎద్దేవాచేశారు. ‘పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టం.. అందుకే కురుమూర్తి స్వామిని వేడుకున్నం. నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు.. ఆ పాపాత్ముడిని క్షమించు అని కురుమూర్తి వెంకన్నకు మొక్కుకున్నం’ అని తెలిపారు. ‘తెలంగాణ ఏమీ కోల్పోలేదని రేవంత్ అన్నడు.. ప్రజలు రైతుబంధు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, చేపలు, గొర్రెలను కోల్పోయిండ్రు. ఆరు గ్యా రెంటీలు అమలు కాలే కానీ, రేవంత్‌రెడ్డి వచ్చినంక బీ ట్యాక్స్ వచ్చింది. హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ ఇంకా యూ ట్యా క్స్లు వచ్చినయ్. రేవంత్ వచ్చాక బీఆర్‌యూ ట్యాక్స్‌లు వచ్చినయ్’ అని ఎద్దేవాచేశారు.
మద్యం అమ్మకాలకు టార్గెట్ పెట్టి ఎక్సైజ్ అధికారులకు మెమో ఇచ్చిన ఘనత రేవంత్‌రెడ్డిది. ధాన్యం, పత్తి కొనకుంటే అధికారులకు మెమోలు లేవు కానీ, మద్యం అమ్మకపోతే మాత్రం మెమోలిచ్చిండు. మద్యం మీద పదివేల కోట్ల అదనపు ఆదాయం రావాలని వారిపై ఒత్తిడి తెస్తుండు. మంత్రి జూపల్లి, సీఎం రేవంత్‌ను అడుగుతున్న.. మద్యం అమ్మకాల కోసం అధికారులకు మెమోలిచ్చింది నిజం కాదా?
-హరీశ్‌రావు
సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతుంటే ఆయన భాష విని ప్రజలు ఇంట్లో టీవీలు ఆఫ్ చేసుకుంటున్నరు అని హరీశ్ దెప్పిపొడిచారు. కేసీఆర్‌ను రైతుల సీఎంగా.. రేవంత్‌ను బూతుల సీఎంగా అనుకుంటున్నారని చెప్పారు. వరంగల్ మీటింగ్‌కు మహిళలను తీసుకొచ్చి వారికేదో ఇచ్చిన హామీని నెరవేరుస్తాడనుకుంటే ఒక్కటీ నెరవేర్చలేదని ఎద్దేవాచేశారు. మహాలక్ష్మి పథకంలో తొలి హామీ మహిళలకు రూ. 2,500 ఇస్తాడని ఆశపడి ఆడబిడ్డలు భంగపాటుకు గురయ్యారని చెప్పారు. మహిళా సం ఘాలకు రుణాలిస్తామని చెప్పిండు కానీ అవి కూడా ఇవ్వకుండా దాటవేస్తున్నారని విమర్శించారు. ‘ఈ ప్రభుత్వానికి వడ్లు కొనడం కూడా చేత కావడం లేదు.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని.. సివిల్ సప్లయి కమిషనర్ 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని అంటున్నరు.. ఇప్పటి వరకు 20 లక్షల మెట్రిక్ టన్నులే కొన్నరు.. చాలా మంది రైతులు దళారులకు అగ్గువకే అమ్ముకున్నరు’ అని వాపోయారు.
‘మొన్నీ మధ్య కొందరు ఎక్సైజ్ అధికారు లు నాకు ఓ పెండ్లిలో కలిసిండ్రు.. సార్ మాకు మెమోలు వచ్చినయ్ అని చెప్పిండ్రు. మందు అమ్ముతలేరని 30 మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు.. 15 మంది సూపరింటెండెంట్లకు మెమో లు ఇచ్చిండ్రట.. పోయినేడాది కంటే ఈసారి మందు తక్కువ అమ్మినందుకు ఇచ్చిండ్రట. వడ్లు కొనకుంటే మాత్రం అధికారులను అడుగుతలేడు.. వడ్లు కొనని అధికారులకు మెమోలిస్తలేడు.. తాగుబోతుల తెలంగాణగా చేస్తా వా? రేవంత్‌రెడ్డీ’ అని హరీశ్ నిలదీశారు.
రైతులకు మేలు జరుగుతుందంటే తన ఎమ్మెల్యే పదవిని వదులుకోవడానికి సిద్ధమని హరీశ్ స్పష్టంచేశారు. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డికి నక్కకు నాకలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉన్నదని ఎద్దేవాచేశారు. ‘ఈ రాష్ర్టానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షే.. కేసీఆర్ ఆదేశిస్తే మూడుసార్లు రాజీనామా చేసిన.. పంద్రాగస్టు లోపు పూర్తి రుణమాఫీ చేసుంటే రైతుల కోసం రాజీనామా చేసేవాడ్ని’ అని గుర్తుచేశారు. ‘ప్రతిపక్షంపై పగ.. ప్రజలకు దగా.. ఇదీ రేవంత్ తీరు.. కాం గ్రెస్ వచ్చాక ఎవరూ ఏమీ కోల్పోలేదని రేవం త్ అంటున్నాడు.. కేసీఆర్ సీఎంగా.. నిరంజన్‌రెడ్డి వ్యవసాయ మంత్రిగా విడుదల చేసిన చివరి రైతుబంధు తప్ప కాంగ్రెస్ వచ్చినంక ఇప్పటివరకు ఇవ్వలేదు’ అని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్‌రెడ్డికి కేసీఆర్ భయం పట్టుకున్నది. అందుకే నిన్న వరంగల్ సభలో 45 నిమిషాల్లో 50 సార్లు కేసీఆర్ జపం చేసిండు. ఇక్కడ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు కానీ, మహారాష్ట్రకు వెళ్లి తెలంగాణలో ఆడబిడ్డలకు రూ.3 వేలు ఇచ్చినమని చెప్పిన ఘనుడు రేవంత్. సీఎం మాట్లాడే భాషతో ఇండ్లల్లో టీవీలు బంద్ చేసుకునే పరిస్థితి వచ్చింది.
-హరీశ్‌రావు
కురుమూర్తి వెంకన్న దర్శనానికి వెళ్తుండగా హరీశ్ వనపర్తి జిల్లా మదనాపురం మండలం లక్ష్మీపురం సమీపంలో ధాన్యం కొనుగోలు కేం ద్రం వద్ద ఆగి రైతులతో మాట్లాడారు. రైతులు శాంతమ్మ, లక్ష్మయ్య మాట్లాడుతూ ‘కేసీఆర్ ఉన్నప్పుడే మా రైతుల బతుకులు బాగుండె.. 24 గంటల విద్యుత్తు, టైముకు పెట్టుబడి సాయం అందింది. కొనుగోళ్లు మంచిగ జరిగేవి. పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ వస్తదని ఆశపడితే ఇప్పుడు ఉత్తదే అయ్యింది. నెలరోజులు చూసి బయట రూ.2100 చొప్పు న అమ్ముకున్నం’ అని చెప్పారు.
మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సోదరుడు శ్రీకాంత్‌గౌడ్ బెయిల్‌పై విడుదలయ్యారు. జిల్లా జైలులో ఉ న్న ఆయనకు 27 రోజుల తర్వాత బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. శ్రీకాంత్‌గౌడ్ పాలకొండలోని ఫాంహౌస్‌లో ఉండగా మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ పాలమూరులో కూలగొట్టిన అంధులు, వికలాంగుల ఇండ్లను నిర్మించి ఇవ్వాలని అడిగినందుకే శ్రీకాంత్‌పై తప్పుడు కేసు నమోదు చేశారని ధ్వజమెత్తారు. ఆయనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.
‘రేవంత్ వచ్చాక కొత్త పథకాలు వచ్చినయ్. బ్రూ ట్యాక్స్ వచ్చింది.. ఆయా శాఖల్లో బిల్లులు రావాలంటే 8 శాతం నుంచి 15 శాతం టాక్స్ వచ్చింది. హైదరాబాద్‌లో ఎవరైనా బిల్డింగ్ కట్టాలంటే స్క్వేర్ ఫీట్‌కు రూ.వంద ట్యాక్స్ కట్టాల్సిందే’ అని హరీశ్ దుయ్యబట్టారు. అన్ని రంగాల్లో విఫలమైన రేవంత్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమాల్లో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ రజని సాయిచంద్, మాజీ చైర్మన్లు ఇంతియాజ్ ఇసాక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ నేత అభిలాష్‌రావు పాల్గొన్నారు.