డాక్టర్ మార్త రమేశ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
హైదరాబాద్, మార్చి 9 : ఇచ్చిన మాట తప్పని మనసున్న గొప్ప మనిషి సీఎం కేసీఆర్ అని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మార్త రమేశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన మూడో లక్ష్యమైన నియామకాల విషయంలో సీఎం కేసీఆర్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొన్నారని కొనియాడారు. రాష్ట్రం సాధించుకొన్నప్పటి నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రాధాన్యతాక్రమంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని తెలిపారు. అంతకన్నా ఎక్కువ మందికి ప్రయోజనం కలిగించే ఎన్నో పథకాలను రూపొందించి వాటిని అమలుచేసి దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కితాబిచ్చారు.
అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన నిరుద్యోగులకు ఎంతో ఆనందం కలిగించిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 90 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనే నిర్ణయం తీసుకోవడం దేశంలో ఒక తెలంగాణ ముఖ్యమంత్రికి మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. నిధులు, నీళ్లు, నియామకాల తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం నేటితో సంపూర్ణం చేసిన సీఎం కేసీఆర్కు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.