హైదరాబాద్: కేసీఆర్ దీక్ష ఫలితంగానే డిసెంబర్ 9 ప్రకటన వచ్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ (Harish Rao) అన్నారు. కేసీఆర్ (KCR) దీక్షనే లేకపోతే డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదా అని ప్రశ్నించారు. దీక్ష చేయకపోతే ఢిల్లీ దిగి వచ్చేదా అని నిలదీశారు. కేసీఆర్ దీక్ష, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ (Telangana) రాష్ట్రం అన్నారు. కేసీఆర్ అంటే పోరాటం.. కేసీఆర్ అంటే త్యాగం అని, రేవంత్ (Revanth Reddy) అంటే వెన్నుపోటు.. రేవంత్ అంటే ద్రోహం అని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటూ రాస్తే రేవంత్‌కు ఉన్న స్థానం ద్రోహం, వెన్నుపోటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని చెప్పారు. తెలంగాణ భవన్లో విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్ రావు.. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 9 అనేది చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. నవంబర్ 29న దీక్షా దివస్ జరుపుకున్నాం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన లేదు. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఈ 3 రోజులు చాలా కీలకమైనవి.
నిమ్స్‌లో కేసీఆర్ 11 రోజులు ఆమరణ దీక్ష దేశారు. కేసీఆర్ దీక్ష ఫలితం డిసెంబర్ 9న ప్రకటన వచ్చింది. కేసీఆర్ దీక్షనే లేకపోతే డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదా?. దీక్ష చేయకపోతే ఢిల్లీ దిగి వచ్చేదా?. కేసీఆర్ దీక్ష, అమరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రం. దీక్ష లేకపోతే తెలంగాణ ప్రకటనే రాదు. ప్రకటన వచ్చిందంటే కేసీఆర్ పోరాటం, దీక్ష ఫలితం. కేసీఆర్ అంటే పోరాటం.. కేసీఆర్ అంటే త్యాగం. రేవంత్ అంటే వెన్నుపోటు.. రేవంత్ అంటే ద్రోహం. రాజీనామాలు చేయాలంటే జీరాక్స్‌లు ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. జై తెలంగాణ అంటే తుపాకీతో కాలుస్తా అని రైఫిల్ పట్టుకున్న వ్యక్తి రేవంత్. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటూ రాస్తే రేవంత్‌కు ఉన్న స్థానం ద్రోహం, వెన్నుపోటు.
ఈ రోజు తెలంగాణ తల్లిని మారుస్తున్నారు. రేవంత్ సృష్టించిన తల్లిని పెడుతున్నారు. తెలంగాణ ఉద్యమం, భావోద్వేగాల మధ్య పుట్టిన తల్లి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లిని ఊరూరా ప్రజలే పెట్టుకున్నారు. తెలంగాన ఉద్యమంలో పుట్టిన తల్లిని మార్చే హక్కు రేవంత్‌కు లేదు. రేవంత్ తెలంగాణ ప్రజల తలరాతలు మారుస్తా అన్నాడు. ప్రజల తలరాతలు మార్చలేదు కానీ, తెలంగాణ తల్లిని మాత్రం మార్చాడు. ఎరువులు, విత్తనాల కొరత సృష్టించాడు. ధరలు పెంచాడు. రైతుబంధు ఎగ్గొట్టాడు. రైతుబీమాకు డబ్బులు కట్టలేదు. మహిళలను ఆగం చేశాడు. రాష్ట్రాన్ని ఆగం చేశాడు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు.
రవీంద్రభారతి అవార్డుల కంటే రామోజీ ఫిలింసిటీ అవార్డు గొప్పదని అంటున్నాడు. రవీంద్రభారతిలో దాశరథి, కాళోజీ, గద్దరన్న అవార్డులు ఇస్తారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి. హైదరాబాద్‌కు ట్రంప్ రోడ్డు అని పేరు పెడుతాడంటా. తెలుగు పిల్లలను జైళ్లలో వేసినందు ట్రంప్ పేరు పెడతావా?. మన దేశాన్ని ఇబ్బంది పెట్టి వ్యాపార సంస్థలు మూతపడి, పిల్లల ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ట్రంప్ పేరు పెడుతావా?. హైదరాబాద్ పిల్లలు ఉద్యోగాలు రాక అమెరికాలో నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ట్రంప్ ఫీజులు పెంచారు. రేవంత్ రెడ్డి నాడు సోనియా గాంధీని బలి దేవత అన్నాడు. 500 మంది పిల్లల చావుకు కారణం సోనియా అన్నాడు. అప్పుడు బలిదేవత.. ఇప్పుడు దేవత అంటున్నాడు. సోనియమ్మ ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకున్నందుకు డిసెంబర్ 23న తెలంగాణ విద్రోహ దినం జరుపుకోవాలి’ అని హరీశ్ రావు విమర్శించారు.