హైదరాబాద్, జనవరి30 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ ఆస్తిత్వానికి నిలువెత్తు సంతకం కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసి సమైక్య పాలకుల కుట్రలను చిత్తుచేసి గమ్యాన్ని చేర్చిన మహాయోధుడు’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. అలాంటి గొప్పనాయకుడిపై సీఎం రేవంత్రెడ్డి అత్యంత హేయంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘కేసీఆర్ ఎర్రవెల్లిలో ఉన్నారని తెలిసి కూడా.. ఆయన వయసును, అనారోగ్యాన్ని పరిగనణనలోకి తీసుకోకుండా, కేవలం రికార్డుల సాకుతో విచారణకు హైదరాబాద్ రావాలని పట్టుపట్టడం అహంకారానికి, కురుచ బుద్దికి పరాకాష్ట’ అని మండిపడ్డారు. రికార్డుల బరువును మోయలేమని సాకులు చెప్పడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.
ఆరు దశాబ్దాలు అరిగోస పడ్డ తెలంగాణ నేలపై అభివృద్ధి సంక్షేమాల పంట పండించిన అపర కృషీవలుడు కేసీఆర్ అని ప్రశంసించారు. పడావు పడ్డ తెలంగాణ గడ్డపై ప్రగతి గంగను పారించిన కేసీఆర్ కీర్తి.. చరిత్ర పుటలపై సమున్నతంగా నిలిచి ఉంటదని తెలిపారు. తెలంగాణ గుండెచప్పుడును, ఆత్మాభిమాన జెండాను.. ఈ కక్షపూరిత నోటీసులతో కట్టడి చేయాలనుకోవడం నీ భ్రమ అని పేర్కొన్నారు. ఇలాంటి కుటిల రాజకీయ తీరుకు త్వరలోనే చరమగీతం తప్పదని హెచ్చరించారు. వ్యవస్థలను నీ రాజకీయ దాహానికి పావులుగా మార్చుకొని పబ్బం గడుపుకుంటున్నావని గుర్తుంచుకో? అని సూచించారు. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యమమని, ఒక ఉప్పెన అని స్పష్టంచేశారుఉ. కేసీఆర్ను వేధించాలని వేస్తున్న ప్రతి అడుగు తెలంగాణ ఆత్మగౌరవంపై చేసిన దాడిగానే చరిత్ర గుర్తిస్తుందని చెప్పారు.