హైదరాబాద్, నమస్తే తెలంగాణ : ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు మారాలంటే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఖతర్ ఎన్నారైలు ఆకాంక్షిస్తున్నారు. కేసీఆరే జాతీయ రాజకీయాల గేమ్ చేంజర్ అని భావిస్తున్నారు. మోదీ వ్యతిరేక శక్తులను కూడగట్టి, వారికి కేసీఆర్ నాయకత్వం వహించాలని కోరుతున్నారు. వారి అభిప్రాయాలు ఇవీ..
బీజేపీ ముక్త్ భారత్ కేసీఆర్‌తోనే సాధ్యం
బీజేపీ ప్రభుత్వంపై దేశంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఆ పార్టీని కాంగ్రెస్ ఎదుర్కొనలేకపోతున్నది. బీజేపీ ముక్త్ భారత్ కేసీఆర్‌తోనే సాధ్యం. రాజ్యాంగాన్ని మోదీ సర్కార్ ఖూనీ చేస్తున్నది. దేశంలో ప్రాంతీయ పార్టీలను లేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నది. ఇప్పటికే 10 రాష్ర్టాల్లో ప్రజాప్రభుత్వాలను కూల్చేసింది. బీజేపీ ఆగడాలను నిలువరించకపోతే దేశ ప్రతిష్ఠ మరింత దిగజారే ప్రమాదం ఉన్నది. బీజేపీ విధానాలను, మోదీ దుర్మార్గ పాలనను గట్టిగా ప్రతిఘటిస్తున్న నాయకుడిగా కేసీఆర్‌ను దేశమంతా గుర్తించింది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా రాణిస్తారు. తన వ్యూహచతురతతో దేశ ముఖచిత్రాన్ని మారుస్తారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆరే గేమ్ చేంజర్ అవుతారు. అలుపెరుగని ఉద్యమంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి చరిత్ర సృష్టించిన కేసీఆర్.. దేశ దిశనూ మార్చగలరని గట్టిగా విశ్వసిస్తున్నా.
– నసీర్ మొహమ్మద్, లాజిస్టిక్స్ మేనేజర్
దేశానికి కేసీఆర్ దిశానిర్దేశం అవసరం
దేశానికి దిశానిర్దేశం చేయగల సత్తా ఉన్న కొద్దిమంది నేతల్లో కేసీఆర్ ముందు వరసలో ఉంటారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆయనకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పగలరు. అన్ని వర్గాలను కేసీఆర్ అక్కున చేర్చుకొని, వారి అభివృద్ధికి పాటుపడుతున్నారు. దేశ సేవలో అసువులు బాసిన ఇతర రాష్ర్టాల జవాన్లు, రైతుల కుటుంబాలను సైతం సీఎం కేసీఆర్ ఆదుకోవడం ఆయన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.
– సిరాజ్ అన్సారీ, మానవ వనరుల సంస్థ మేనేజర్
సామరస్యతకు కేసీఆర్ ప్రతీక
హిందూ-ముస్లిం ఐక్యత, సామరస్యతకు సీఎం కేసీఆర్ ప్రతీకగా నిలిచారు. అన్ని వర్గాల సంప్రదాయాలను, ఆచారాలను గౌరవిస్తున్న సీఎం కేసీఆర్.. సబ్బండ వర్ణాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతున్నారు. దేశ రాజకీయాలను కేసీఆర్ ప్రభావితం చేయగలరని బలంగా నమ్ముతున్నా. టీఆర్ఎస్కు మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ పార్టీకి ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర లాంటి కీలక ఉత్తరాది రాష్ర్టాల్లో పోటీ చేసిన అనుభవం కూడా ఉన్నది. తెలంగాణలో మాదిరిగా సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోనూ మజ్లిస్‌తో కలిసి నడిస్తే బీజేపీని గద్దె దింపడం సులభమే.
– ఆజీమ్ ఖాన్, బ్యాంకింగ్ నిపుణుడు
సీఎం కేసీఆర్ పాలనలో గాంధీ కలలు సాకారం
జాతిపిత మహాత్మాగాంధీ కలలను నిజం చేస్తున్నది సీఎం కేసీఆరే. గ్రామాలను గాడిలో పెట్టిన ఘనత ఆయనదే. సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రతి గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు. ఈ సమయంలో దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ అడుగుపెడితే గ్రామాలకు మహర్దశ పడుతుంది. తద్వారా దేశం రోల్ మాడల్‌గా మారుతుంది. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం శుభపరిణామం. కచ్చితంగా కేంద్రంలో సుస్థిర పాలన కేసీఆర్‌తోనే సాధ్యం.
– రిక్కల ఇందిరాసత్తిరెడ్డి, సర్పంచ్, ఎల్లగిరి, చౌటుప్పల్ మండలం
దేశాభివృద్ధిపై విజన్ ఉన్న నేత కేసీఆర్
దేశం, సమాజ అభివృద్ధిపై విజన్ ఉన్న నేత సీఎం కేసీఆర్. కేసీఆర్ లాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి రావాలి. దేశంలోని సమస్యలను పరిష్కరించే శక్తి, సామర్థ్యాలు కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉన్నది. మోదీ సర్కార్ రైతుల నడ్డి విరుస్తున్నది. రైతుల గురించి ఆలోచించి ఎన్నో పథకాలు తెచ్చిన నాయకుడు కేసీఆర్‌కు తెలంగాణతో పాటు దేశ రైతాంగం అండగా నిలబడుతున్నది.
– నేనావత్ అనురాధ, జడ్పీటీసీ ఆమనగల్లు