హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో రాబోయే పదిరోజుల్లోనే పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు మొదలవుతాయని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. నాందేడ్ సభలో ఆదివారం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి బీఆర్ఎస్ జెండా చేరుకొంటుందని తెలిపారు. ‘ప్రతి గ్రామానికి బీఆర్ఎస్ బండి వస్తుంది. అక్కడ కమిటీలు వేస్తాం. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఛత్రపతి మహరాజ్ జన్మించిన స్థలం శివ్‌నేరీ సాక్షిగా మహారాష్ట్ర రైతుల తలరాతను మారుస్తానని శపథం చేస్తున్నా. రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా కిసాన్ కమిటీలు వేస్తాం. మహారాష్ట్రలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించండి. నేను పశ్చిమ మహారాష్ట్రతోపాటు విదర్భ, ఇతర ప్రాంతాల్లోనూ పర్యటిస్తా. నాందేడ్ సహా మహారాష్ట్ర అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రజలకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే జిల్లా పరిషత్తు ఎన్నికల్లో రైతులు తమ సత్తా చూపితే కచ్చితంగా మహారాష్ట్ర ప్రభుత్వం దిగివస్తుంది.
దేశంలోని అన్ని నదుల్లో కలిపి ప్రవహిస్తున్న 70 వేల టీఎంసీల నీటిలో 20 వేల టీఎంసీల నీటిని మాత్రమే వినియోగిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘50 వేల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తున్నదని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలే చెప్తున్నాయి. దేశంలోనే అత్యధిక నదులు మహారాష్ట్రలో ప్రవహిస్తున్నాయి. గోదావరి, కృష్ణా, ప్రవర, పూర్ణ, పెన్‌గంగ, వెన్‌గంగ, వార్దా, పంచగంగ, ఘటప్రభ, మంజీర, భీమా, ప్రాణహిత, ఇంద్రావతి.. చిన్నచిన్న నదులు అనేకం ఉన్నాయి. అయినా రాష్ట్రంలో నీటి కష్టాలు ఎందుకుండాలి? నేను చెప్పేది సత్యమో కాదో ఆలోచించండి’ అని కేసీఆర్ సూచించారు.
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో 15 మంది ప్రధానులు, ఎందరో సీఎంలు పాలించిన తర్వాత కూడా అనేక ప్రాంతాల్లో తాగడానికి, సాగు నీళ్లు ఎందుకు దొరకటంలేదు? నిరంతర విద్యుత్తు ఎందుకు సరఫరా చేయరు? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. వాళ్లకు ఇవ్వడం ఇష్టం లేదా? లేక వాళ్లకు చేతకాలేదా? అనే విషయంపై చర్చించాలని కోరారు. ‘మహారాష్ట్రలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకొంటున్నారు. వారిని తలుచుకొంటే దుఃఖంవస్తున్నది. రైతుకు అన్నిదారులు మూసుకుపోయిన తర్వాత, ఏం చేయలేని స్థితిలో ఆత్మహత్య చేసుకొంటారు. తన కుటుంబీకులను, బంధువులను అందరినీ వదిలిపెట్టి వెళ్లిపోవడానికి ఎంత వేదన పడి ఉంటారో, వాళ్ల ఆత్మలు ఎంత ఘోషిస్తున్నాయో. దేశానికి అన్నం పెట్టాల్సిన అన్నదాత.. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడో ఆలోచించాలి. వారిని ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. అందుకే దేశంలోనే మొట్టమొదటిసారి నేను రైతుల నినాదాన్ని ఎత్తుకొన్నా. ‘అబ్ కీ బార్ .. కిసాన్ సర్కార్’ నినాదంతో కేంద్రంలో రైతు ప్రభుత్వం ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. దేశంలోని రైతులు, రైతు కార్మికులు, వారి కుటుంబాలు కలిపితే జనాభాలో 50 శాతానికిపైగా ఉంటాం. కేంద్రంలో రైతు సర్కారు రావాలంటే ఇంతకంటే పెద్దసంఖ్య అవసరం లేదు. నేను చెప్తున్న విషయాలను రైతులు అర్థం చేసుకొంటే.. ధర్మం పేరుతో, కుల, మతాలు, రంగురంగుల జెండాల పేర్లతో విభజన చెందకుండా అన్నదాతలంతా ఏకతాటిపైకి వస్తేనే రైతు ప్రభుత్వ స్థాపన సాధ్యమవుతుంది’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్టు తాను చెప్పిన అంశంపై విస్తృతంగా చర్చ జరగాలని కోరారు.