హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాశమంత పెంచారని ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. మహిళా సాధికారత, రక్షణ విషయంలో రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపారని చెప్పారు. ఆదివారం రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభు త్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు మహిళల పట్ల అపార గౌరవం ఉన్నదని, సంక్షేమ పథకాల్లో మహిళలకే పెద్దపీట వేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాకేంద్రాలు, రెవెన్యూ డివిజన్లలో మాతాశిశు కేంద్రాల పేరుతో దవాఖానలు, సంరక్షణ కేంద్రాలు ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆడబిడ్డల సమస్యలు తీర్చే వేదిక కావాలని, ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన సూచించారు.
ఆడబిడ్డల పక్షపాతి కేసీఆర్: మంత్రి సత్యవతిరాథోడ్
సీఎం కేసీఆర్ ఆడబిడ్డల పక్షపాతి అని స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య, భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమం, పౌష్టికాహారం విషయంలో ప్రత్యేక కార్యాచరణను ప్రకటిస్తుందని పేర్కొన్నారు. మహిళల హక్కులు- రక్షణ, భద్రత విషయంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. త్వరలో అన్ని జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్, మహిళా కమిషన్ సభ్యులు గద్దల పద్మ, ఈశ్వరీబాయి, షరీన్ అఫ్రోజ్, రేవతి, ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ వెబ్సైట్, లోగోను ఆవిష్కరించారు.