(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రబల ఆర్థికశక్తిగా ఎదిగింది. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మక కార్యక్రమాలు, పథకాలు ఆర్థిక రంగంలో తెలంగాణ రాష్ర్టాన్ని కొత్త శిఖరాలకు చేర్చాయి. రాష్ట్ర ప్రగతికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నివేదికలు, సంస్థలు పలుమార్లు కేసీఆర్ ప్రభుత్వ పాలనను కొనియాడాయి. తాజాగా ఫైనాన్షియల్ కమ్యూనికేషన్ సంస్థ ట్రైసిస్ కమ్యూనికేషన్స్ సీపీవో, డైరెక్టర్, రచయిత ముదార్ పథేరియా.. కేసీఆర్ పదేండ్ల పాలనపై ప్రశంసలు కురిపించారు. కేసీఆర్‌ను తెలంగాణ రాష్ట్ర సంపద సృష్టికర్తగా అభివర్ణించారు.
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ అచంచలమైన కృషి చేశారని ముదార్ పథేరియా కొనియాడారు. కేసీఆర్ తీసుకొన్న పలు నిర్ణయాలు ఆర్థికాభివృద్ధిలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపాయని పేర్కొన్నారు. ముఖ్యంగా కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధిరేటు అమాంతం పెరిగిందని చెప్పారు. తెలంగాణ జీఎస్డీపీకి ఏటా రూ.లక్ష కోట్లను కేసీఆర్ అదనంగా జోడించారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ జీఎస్డీపీ రూ.5.05 లక్షల కోట్లుగా ఉంటే, పదేండ్ల కేసీఆర్ పాలనలో జీఎస్డీపీ రూ.14.64 లక్షల కోట్లకు ఎగబాకిందని పేర్కొన్నారు. మొత్తంగా తన పాలనలో 159 శాతం వృద్ధిరేటుతో.. జీఎస్డీపీకి రూ.9.59 లక్షల కోట్లను కేసీఆర్ అదనంగా చేర్చారని పథేరియా వివరించారు.
2014లో కేరళ, తెలంగాణ జీఎస్డీపీ దాదాపుగా సమానంగా ఉండేవని పథేరియా గుర్తుచేశారు. 2024-25 నాటికి తెలంగాణ జీఎస్డీపీ 194 బిలియన్ డాలర్లకు చేరితే, కేరళ జీఎస్డీపీ మాత్రం 147 బిలియన్ డాలర్లుగానే ఉన్నదని పేర్కొన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో వేసిన ఆర్థిక పునాదుల కారణంగానే ఇది సాధ్యమైందని కొనియాడారు. కేసీఆర్ మాదిరిగానే తమిళనాడులో స్టాలిన్, యూపీలో యోగి ఆదిత్యానాథ్, మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్, ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలో మహారాష్ట్ర కూడా గణనీయమైన ఆర్థికాభివృద్ధిని సాధించాయని ప్రశంసించారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో రాకెట్ వేగంతో దూసుకుపోయిన తెలంగాణ జీఎస్డీపీ.. రేవంత్ రెండున్నరేండ్ల పాలనలో నేలచూపులు చూస్తున్నది. బీఆర్ఎస్ పాలనలో సగటున ఏడాదికి 18.99 శాతం వృద్ధిరేటును నమోదు చేసిన జీఎస్డీపీ.. రేవంత్ రెండున్నరేండ్ల పాలనలో వృద్ధిరేటు సగటున 8.68 శాతానికి దిగజారిపోయింది. 2014-15లో ప్రస్తుత ధరల వద్ద రూ.5.05 లక్షల కోట్లుగా నమోదైన జీఎస్డీపీ.. 2023-24 నాటికి రికార్డు స్థాయిలో రూ.14.64 లక్షల కోట్లకు చేరింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 30 నెలల కాలంలో (2026 మే నాటికి) రాష్ట్ర ఆర్థికవృద్ధి వేగం గణనీయంగా మందగించింది. బడ్జెట్లు, సామాజిక ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తెలంగాణ జీఎస్డీపీ కేవలం రూ.17.82 లక్షల కోట్లకు మాత్రమే పరిమితమైంది. గతంలో డబుల్ డిజిట్ (18.99 శాతం) వృద్ధిరేటుతో దూసుకుపోయిన జీఎస్డీపీ.. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో ఏడాదికి సగటున 8.4 శాతానికి దిగజారిపోయింది.
బీఆర్ఎస్ పాలనలో : 18.99%
కాంగ్రెస్ పాలనలో : 8.68%
2014-15 : రూ. 5.05 లక్షల కోట్లు
2023-24 : రూ. 14.64 లక్షల కోట్లు
2025-26 : రూ. 17.82 లక్షల కోట్లు