కేసీఆర్ ప్రభుత్వంలో ఆసరా పింఛన్ సొమ్ము నెలనెలా అందుకుంటూ లబ్ధిదారులు ఆనందంతో గడిపేవారు. వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, కల్లుగీత కార్మికులు, బోదకాలు, డయాలసిస్ బాధితులకు రూ.2016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున టంచన్‌గా అందజేసి ఆ ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రెండు నెలలైనా ఆసరా పింఛన్లు అందక లబ్ధిదారులు కుమిలిపోతున్నారు. పెంచుతానన్న పింఛన్ సొమ్ముపైనా వారిలో ఆశలు సన్నగిల్లాయి.
Aasara Pensions | రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండునెలలు కావస్తున్నా ఆసరా పింఛన్ల పంపిణీపై నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. పింఛన్ సొమ్ముపైనే ఆధారపడిన దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికుల బతుకులు దయనీయంగా మారాయి. కొత్త సర్కారు రాగానే పింఛన్ సొమ్మును నెలకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తామని ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తమ ఖాతాల్లో పెంచిన సొమ్ముతోనే డబ్బులు పడుతాయనుకున్న లబ్ధిదారుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. మెజార్జీ జిల్లాల్లో ఇంతవరకు పాత పింఛన్ సొమ్ముకే దిక్కులేకుండా పోయింది. కొత్త పింఛన్ సొమ్ముపైనా సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసరా పైసలు పడ్డాయే, లేదోనని లబ్ధిదారులంతా బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోతున్నారు. ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతున్నారు. అధికారుల వద్దకు వెళ్లి ఆరా తీస్తే ఇంకా రాలేదన్న సమాధానంతో ఆవేదనకు లోనవుతున్నారు. కొన్ని జిల్లాల్లో అదీ గత ఆసరా పింఛన్ సొమ్మును పంపిణీ చేసిన ప్రభుత్వం మెజార్జీ జిల్లాల్లో పంపిణీ చేయలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం దివ్యాంగులకు రూ.4016, ఇతర లబ్ధిదారులకు రూ.2016 చొప్పున నెలనెలా ఇచ్చి అసహాయులకు ఆసరాగా నిలిచింది. పింఛన్లు ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వంలోనే నయమంటూ పలువురు లబ్ధిదారులు చెప్పుకుంటుండటం గమనార్హం.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,20,862 మంది ఆసరా పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ.26.54 కోట్లు పంపిణీ చేయాల్సి ఉన్నది. అందులో వృద్ధులు 33,503 మంది, దివ్యాంగులు 10,073, వితంతు 24,492, చేనేత 3,691, కల్లు గీత 2,346, ఒంటరి మహిళలు 1,833, బీడీ కార్మికులు 43,381, బోదకాలు బాధితులు 1,004, డయాలసిస్ బాధితులు 67, బీడీ టేకేదారులు 472 మంది చొప్పున లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ నిరుడు డిసెంబర్లో నవంబర్ నెల పింఛన్ సొమ్మును వారి ఖాతాల్లో వేశారు. రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఆసరా పింఛన్ సొమ్ము అతీగతీ లేదు. ఎప్పుడు వస్తాయో కూడా తెలియదని అధికారులు చెప్తుండటం గమనార్హం. ఈ జిల్లాలో అత్యధికంగా బీడీ కార్మికులు, చేనేత కుటుంబాలే ఉన్నాయి. వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని గుర్తించి కేసీఆర్ ప్రభుత్వం బీడీ, నేతన్నలు, ఒంటరి మహిళలకు పింఛన్లు మంజూరు చేసింది. వాటితోనే బతుకీడుస్తున్న తమ పరిస్థితి ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆసరా అందించాలని కోరుతున్నారు.
మాది నేత కుటుంబం. అమ్మ బీడీలు చుడుతుంది. నాన్న మరమగ్గాల కార్మికుడు. చిన్నప్పుడు పోలియో వచ్చి కాళ్లు చచ్చుబడిపోయినయ్. వీపులో పెద్ద కంతి ఉంది. కేటీఆర్ సారు గిఫ్ట్ ఏ స్మయిల్ కింద నాకు త్రీవీలర్ స్కూటర్ ఇచ్చిండు. దానిపైన అగ్రహారంలోని డిగ్రీ కాలేజీకి పోతున్న. వచ్చే పింఛన్ రూ.4016తో చదువుకుంటున్న. రెండు నెలల నుంచి పింఛనొత్తలేదు. స్కూటర్లో పెట్రోలు పోయించుకోలేక దినం విడిచి దినం కాలేజీకి పోతున్న. చదువు ఎక్కడ బంద్ అయితదోనని భయపడుతున్న. కేసీఆర్ సర్కారున్నా మాకు పింఛన్ వస్తుండె.
– వెల్ది గణేశ్, దివ్యాంగుడు, సిరిసిల్ల
కోనరావుపేట, ఫిబ్రవరి 8: దివ్యాంగులందరికీ సకాలంలో పింఛన్ సొమ్మును అందజేయాలని దివ్యాంగుల అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకుడు మామిడాల నరేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పింఛన్ సొమ్ము అందని కారణంగా సిరిసిల్లలోని కాలేజీ గ్రౌండ్లో పలువురు దివ్యాగులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ దివ్యాంగులకు శారీరక, ఆర్థిక సంబంధమైన సమస్యలు ఉన్నాయని, సకాలంలో పింఛన్ అందితేనే ఆర్థికంగా ఉయోగపడుతుందని చెప్పారు. కొంతమందికి పింఛన్ వస్తేనే కుటుంబం గడుస్తుందని, ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించాలని కోరారు. సమావేశంలో మంగళారపు రాజేందర్, హరిప్రసాద్, మన్మోహన్, ప్రశాంత్, రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.
పింఛన్ అందక ఓ పూట ఉపాసమే మాది చేనేత కుటుంబం. నా భర్త రామయ్య ఐదేండ్ల కిందనే చనిపోయిండు. ముగ్గురూ బిడ్డలే. అందరి పెండ్లిండ్లు చేసిన. ఒక్కదాన్నే ఉంటున్న. శాతగాని టైంల మా పెద్దకొడుకు కేసీఆర్ నెలకు రూ.2016 పింఛన్ ఇచ్చి ఆదుకున్నడు. గాపైసలతోనే పొట్టకు ఎల్లదీసిన. రెండు నెలల సంది పింఛను వత్తలేదు. పైసల్లేక ఈనెల బియ్యం తెచ్చుకోలె. ఒక పూట తింటూ మరోపూట ఉపాసమే ఉండుడయుతంది. పింఛన్ అత్తదో రాదోనని అందరంటున్రు. బతుకుదెరువు ఎట్లని రందితో సగమైతన్న.
– జక్కని మల్లవ్వ, వృద్ధురాలు, సిరిసిల్ల