హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి గోదామును నిఘా నీడ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ప్రయత్నిస్తున్నది. ప్రతి గోదాములో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకొంటున్నది. రాష్ట్రంలో ఎఫ్‌సీఐ, కేంద్ర గిడ్డంగుల సంస్థ గోదాములు కాకుండా మొత్తం 1,407 గోదాములు ఉన్నాయి. వీటిలో 260 గోదాములను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిర్వహిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పటికే 50 సొంత గోదాముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఒక్కో గోదాముకు 6 నుంచి 10 సీసీ కెమెరాలను అమర్చింది. మొత్తం రూ.64 లక్షల ఖర్చుతో 368 కెమెరాలను సమకూర్చింది. సీసీ కెమెరాలతో గోదాములను పరిశీలించేందుకు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. తద్వారా ఆయా గోదాముల్లోని పనితీరును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నది. ముఖ్యంగా వే బ్రిడ్జి, ల్యాబ్ రూంలలో సీసీ కెమెరాలను కచ్చితంగా ఏర్పాటు చేసింది. మిగిలినవాటిలో గోదాముల వారీగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సంస్థ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. గోదాముల్లో నిల్వచేసే బియ్యం, మక్కలు, ఇతర పంట ఉత్పత్తులను రక్షించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది.
గోదాముల నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. గోదాముల నిర్మాణ విధానం, నిర్వహణ అద్భుతంగా ఉన్నదని కితాబిచ్చింది. దేశంలో మరే రాష్ర్టానికి ఇవ్వని విధంగా రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన గోదాముల ఖర్చులో కొంత మొత్తాన్ని సబ్సిడీ కింద విడుదల చేసింది. ఈ విధంగా 8 గోదాములకు రూ.6 కోట్ల సబ్సిడీ అందజేసింది. మరో పది గోదాములకు సబ్సిడీ ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత గోదాముల సామర్థ్యం పెంపుపై కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సాగు విస్తీర్ణం, పంట ఉత్పత్తులు పెరుగుతుండటంతో నిల్వకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టింది. 2014-15లో 39 లక్షల టన్నులుగా ఉన్న గోదాముల నిల్వ సామర్థ్యాన్ని 74 లక్షల టన్నులకు పెంచింది. 35 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కొత్తగా కల్పించింది. దీనికితోడు మరో 40 లక్షల టన్నుల సామర్థ్యం పెంపునకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో డీపీఆర్‌ను సిద్ధం చేసింది.
గోదాముల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ప్రతి గోదాములో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం ఎస్‌డబ్ల్యూసీ పరిధిలోని 50 గోదాముల్లో ఏర్పాటు చేశాం. మిగిలిన వాటిలో దశలవారీగా ఏర్పాటు చేస్తాం. గోదాముల నిర్వహణను పెంచి బియ్యం, ఇతర పంట ఉత్పత్తుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చేందుకే ఈ చర్యలు. సీసీ కెమెరాల ఏర్పాటుతో చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
– జితేందర్‌రెడ్డి, ఎండీ, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్