KCR | బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఎర్రవెల్లిలో నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలను పార్టీ అధినేతకు బీఆర్ఎస్ నేతలు వివరించారు. గ్రామాల్లో కుంటుపడిందని, మెయింటెనెన్స్ లేక ట్రాక్టర్లు మూలనపడ్డాయని నేతలు చెప్పారు. సఫాయి కార్మికులకు జీతాలు ఇవ్వలేక పారిశుధ్యం పడకేసిందని తెలిపారు. అధికారంలోకి కోసం అలవిగాని హామీలు ఇచ్చి బూటకపు గ్యారంటీలతో వంచించిన కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని నేతలు చెప్పారు. బీఆర్ఎస్ తెచ్చిన పథకాలు అమలు చేయడం లేదని మండిపడుతున్నారని.. అలాగే రాష్ట్రంలోని పరిస్థితులపై కేసీఆర్‌కు నేతలు వివరించారు. అనంతరం కేసీఆర్ ఎంతో సహనంతో, ఓర్పుతో తీసుకున్న నిర్ణయాలు, కార్యాచరణను నేతలకు వివరించారు. తెలంగాణ బాగోగులపై బీఆర్ఎస్కు ఉన్న ఆవేదన మరో పార్టీకి లేదని కేసీఆర్ తెలిపారు.
ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన ఉద్యమ స్ఫూర్తి బీఆర్ఎస్ సొంతమని, దశాబ్దాలుగా పోరాటం చేసిన నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన తెలంగాణ సమాజానికి స్వరాష్ట్ర చైతన్యాన్ని, స్ఫూర్తిని నింపామన్నారు. రాష్ట్ర సాధనకు శాంతియుత పఃతాలో పోరాటాలు నడిపిన ఘన చరిత్ర బీఆర్ఎస్ది అని చెప్పారు. తొమ్మిదిన్నరేండ్లు జనరంజకంగా పాలించి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. వ్యవసాయంతో పాటు సబ్బండ వర్గాలకు చేసిన సేవ మహోన్నతమైందని.. ప్రజలే కేంద్రకంగా, అభ్యున్నతే ధ్యేయంగా పని చేయడం బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమన్నారు. తాము ఏం కోల్పోయామో ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ప్రజలకు అర్థమైందని.. తెలంగాణ అంటే ఇతరులకు పొలిటికల్ గేమ్.. బీఆర్ఎస్కు మాత్రం ఒక టాస్క్ అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, బీఆర్ఎస్ హయాంలో మండు వేసవిలోనూ చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకాయని.. కాంగ్రెస్ పాలనలో జీవాలకు నీళ్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. నీళ్లందక ఎండిన వరి పంటలను పశువుల మేతకు వదిలేస్తున్న దయనీయ స్థితిపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ అసమర్థత మూలంగానే రైతులకు ఈ దుస్థితి దాపురించిందని కేసీఆర్ వాపోయారు. పల్లె, పట్టణ ప్రగతితో దేశ రాష్ట్ర, గ్రామీణ ఆర్థిక ప్రగతికి పట్టుగొమ్మలుగా పరిఢవిల్లిన పల్లెలు.. నేడు కనీస ఆదరణ లేక కునారిల్లుతుండడంపై ఆవేదన చెందారు. ఇవాళ రాష్ట్రం ఎక్కడబోతే మాకేంది.. ప్రజలు ఏమైతే మాకేంది అన్న తీరున స్వార్థ రాజకీయ, అధికారమే పరమావధిగా కాంగ్రెస్ నాయకులు పని చేస్తున్నారన్నారు. ఇదే తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారిందని, కొత్త రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపినప్పుడు అన్నిరంగాల్లో అంధకార పరిస్థితులు.. ముఖ్యంగా విద్యుత్ రంగం పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేదని.. కరెంటు తక్కువైతే ఇతర రాష్ట్రాల గిడ్ తీసుకునే పరిస్థితి ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో పట్టుదలతో తొమ్మిదినెలల్లో నేషనల్ గ్రిడ్ నిర్మించుకొని.. రాష్ట్రాన్ని కరెంటు కష్టాల నుంచి గట్టెక్కించుకున్నామన్నారు. 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుబాటులోకి తెచుకున్నామని గుర్తు చేశారు. ఇదంతా తెలంగాణ ప్రజలపట్ల ఉద్యమ పార్టీకి ఉన్న ప్రేమాభిమానంతోనే సాధ్యమన్నారు.
7మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని 20వేల మెగావాట్లకు పెంచుకున్నామని, దీనికి తోడు బీఆర్ఎస్ ప్రభుత్వ కృషితో అందుబాటులోకి 2400 మెగావాట్ల విద్యుత్ వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విద్యుత్‌ను ఎందుకు అందించలేకపోతుందో అర్థంకావడం లేదన్నారు. ఇది కేవలం అసమర్థతేనని తెలుస్తుందని.. తీసుకున్న ప్రతి నిర్ణయంతో ప్రజలతో చీత్కారాలకు గురవడమే కాకుండా ప్రజలకు మంచి చేయాలన్న సోయి ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమన్నారు. రైతులపట్ల ప్రేమ, వ్యవసాయంపై అవగాహన ఉంటే పాలనా ప్రాధాన్యతలు అర్థమవుతాయన్నారు. యంత్రాంగంపై పట్టు సాధించి ప్రజా సంక్షేమంపై రాజీలేని పాలన అందించొచ్చన్నారు. సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ ఆంజనేయ గౌడ్, హనుమంతు నాయుడు, గట్టు యాదవ్ పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, బానోత్ మదన్ లాల్, బానోత్ హరిప్రియ నాయక్, రేగ కాంతారావు, మెచ్చా నాగేశ్వర్ రావు, వనం వెంకటేశ్వర రావు, లింగాల కమల్ రాజ్ హాజరయ్యారు. ఉమ్మడి నల్గొండ నుంచి ఎమ్మెల్యే జీ జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్ర కుమార్, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, బొల్లం మల్లయ్య యాదవ్, బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ సీనియర్ నేత విజయసింహా రెడ్డితో పాటు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆశన్నగారి, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, పార్టీ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల వంశీధర్ రావు హాజరయ్యారు.