ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం గురువారం ఓ అపురూప దృశ్యానికి వేదికైంది. అత్మీయ అనుబంధాల కలబోతకు కేరాఫ్ అయ్యింది. గాలి కూడా క్షణకాలం స్తంభించిపోయేంత గాఢమైన స్నేహానుభూతికి చిరునామా అయ్యింది. స్నేహానికి కేసీఆర్ ఇచ్చే విలువకు కొలమానం అయ్యింది. రెండున్నర దశాబ్దాలపాటు తనతో కలిసి నడిచిన శీనన్న (మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి) జ్ఞాపకాల దొంతరలో కేసీఆర్ తడిసిముద్దయ్యారు.
పుట్టి పెరిగిన గడ్డను వీడి పిల్లలతో శేష జీవితాన్ని గడిపేందుకు శ్రీనివాస్‌రెడ్డి అమెరికా వెళ్తున్న వేళ కేసీఆర్ ఆయనకు జీవితాంతం మర్చిపోలేని బహుమానం ఇచ్చారు. కుటుంబ సమేతంగా ఇంటికి పిలిపించుకుని ఆతిథ్యమిచ్చి, ఘనంగా సత్కరించారు. ‘విత్ లవ్.. ఫ్రం కేసీఆర్’ అని రాసున్న లాకెట్‌ను తొడిగి ఖండాలు దాటినా వెంటే ఉంటానని మాటిచ్చారు.
తెలంగాణ అంటే ఆత్మీయత. తిన్నా తినకపోయినా, కలిసి తిరిగినా, దోస్తానా చేసినా.. మనుషుల నడుమ ప్రేమానురాగాలు, ఆప్యాయతలు అల్లుకుపోతాయి. మానవ సంబంధాలకు అడ్డా… తెలంగాణగడ్డ. మనిషితోనే కాకుండా మనసుతోనూ పెనవేసుకున్న బంధాలు ఇక్కడ కోకొల్లలు. కష్టమైనా.. సుఖమైనా మనసులో మాటను దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు బయటపెట్టేడం ఇక్కడి అలవాటు. మన చేతికింద పనిచేసే వ్యక్తిని ఇంట్ల మనిషి లెక్కనే ప్రేమిస్తది తెలంగాణ. వరుసలు కలిపి అల్లుకుపోయే ఆత్మీయ బంధాలు అడుగడుగునా కనిపిస్తాయి. తరతరాలుగా తారతమ్యాలకు అతీతంగా వసుధైక కుటుంబంగా కలిపి ఉంచే మానవ సంబంధాలు ప్రపంచంలో తెలంగాణకే ప్రత్యేకం. అటువంటి మానవీయ సంబంధానికి కేరాఫ్ కేసీఆర్.
తెలంగాణను సాధించిన మహా ఉద్యమ సారథి ఆయన. వందేండ్ల ఆకాంక్షలను నిజం చేసి పదేండ్లపాటు తెలంగాణను ప్రగతి పథంలో నిలిపి దేశానికే గర్వకారణంగా నిలిచిన ముఖ్యమంత్రి. ఆయన వ్యక్తిత్వం మహోన్నతం. ఆయనో మహా మనీషి. ‘మన ఇంట్ల మనిషి కేసీఆర్’గా ప్రతి తెలంగాణ బిడ్డ భావిస్తుంది. విశాల వ్యక్తిత్వం కేసీఆర్ సొంతం. సామాన్యుల గుండెల్లో నిలిచిన అతిసామాన్యుడు.. అలుముకున్న బంధాల కలబోత కేసీఆర్.
KCR | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించిన మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డిని కేసీఆర్ గురువారం ఘనంగా సతారించారు. 85 ఏండ్ల శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ వద్దే ఉండాలని ఉన్నా పిల్లల మాట కాదనలేక వారితో కలిసి అమెరికా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తనతో కలిసి పనిచేసిన ఆత్మీయుడిని కేసీఆర్ ఎర్రవల్లిలోని తన నివాసానికి పిలుచుకొని కుటుంబ సమేతంగా ఆత్మీయంగా సత్కరించారు. కేసీఆర్ ఆత్మీయ రూపానికి, అవ్యాజ్యమైన ప్రేమకు తార్కాణమిది. తమ 25 ఏండ్ల ప్రయాణంలో చోటుచేసుకున్న పరిణామాల కలబోత ఇది. తన సన్నిహితుడు తనను వీడిపోతున్న సున్నితమైన సందర్భంలో అతి సున్నితమైన కేసీఆర్ మనసు చలించిపోయింది. ‘శీనన్నా’ అని పిలుచుకునే తన ఆత్మీయ మిత్రుడు దూరమైతున్నడని తెలిసి కేసీఆర్ ఒకింత రందిపడ్డారు. తాను పుట్టి పెరిగిన నేలను, కేసీఆర్ ఉద్యమంతో కలిసి నడిచి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని, తన దేశాన్ని, తన బంధువులను, మిత్రులను, అభిమానులను మరీ ముఖ్యంగా తన ఆత్మబంధువు కేసీఆర్‌ను విడిచి వెళ్లాల్సి వస్తుండటంతో శ్రీనివాస్‌రెడ్డి మనసు బరువెక్కింది.
వేలమంది పార్టీ నాయకుల్లో ఒకరైన శ్రీనివాస్‌రెడ్డి పట్ల కేసీఆర్‌కు ఎందుకింత అనురాగం? అనుబంధం? ఆప్యాయత? తన పార్టీ కార్యాలయ ఇన్చార్జి పట్ల అంతగా గౌరవ మర్యాదలివ్వడానికి కారణం ఏమిటి? ఇప్పుడివే ప్రశ్నలు అందరిలోనూ. కేసీఆర్ ప్రేమాప్యాయతలకు బోల్డన్ని ఉదాహరణలున్నాయి. పార్టీ కార్యకర్తలు, నాయకుల కోణంలో ఈ బంధం ప్రత్యేకమైనది. అపురూపమైనది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డితో తనకున్న బంధాన్ని కేసీఆర్ నెమరు వేసుకున్నారు. అది ఆయన మాటల్లోనే..
‘చూస్తే అట్లవుపడుతడుగానీ, శీనన్న (ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి) గొప్పోడు. చిన్నతనం నుంచే తెలంగాణ వాది. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు. 2001లో నేను ప్రారంభించిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, పూర్తి అంకితభావంతో తెలంగాణ కోసం తన్లాడిన వ్యక్తి. విద్యార్థి దశలో వెటర్నరీ కాలేజీలో చదువుతున్నప్పుడు కాలేజీ ప్రెసిడెంట్‌గా 69 నాటి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నడు. తెలంగాణ కోసం జైలుకు పోయిన శ్రీనివాస్‌రెడ్డి, నాటి ఉద్యమం సఫలం కాకపోయినా మొకవోని ధైర్యంతో వారి పోరాట పటిమ చెకు చెదరనివ్వలేదు. ఆ ఉద్యమంలో విజయం సాధించలేదనే నిరాశకు లోను కాకుండా, భంగపాటుకు గురికాకుండా, భయపడకుండా తెలంగాణ కోసం పట్టుదలతో పనిచేసిండు. ఉద్యమ ఆకాంక్షను సంపుకోకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన వాదనలను వినిపిస్తూ, ఆలోచనలను, కార్యాచరణను కొనసాగించిండు శ్రీనివాసరెడ్డి. తన మిత్రులు సహచరులతో నిత్యం తెలంగాణ కోసం చర్చలు చేస్తూ తెలంగాణ వ్యతిరేకులతో వాదనలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకతను తెలియచేస్తూ భావజాల వ్యాప్తి కోసం దశాబ్దాల కాలం తనవంతు కృషి చేసిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాల్సిందేననే కృత నిశ్చయంతో తన ప్రయాణాన్ని సాగించిండు.
2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన ప్రారంభ దశలో నన్ను కలిసిన నాటినుంచి పార్టీకోసం అంకితభావంతో పనిచేసి గులాబీ జెండాను ఎగరేసిన పార్టీ వీరాభిమాని శ్రీనివాసరెడ్డి. నాటి నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ కార్యదర్శిగా, అద్భుతమైన రీతిలో బాధ్యతలను నిర్వర్తించారు. దాదాపు 25 ఏండ్ల పాటు అంకితభావంతో పట్టుదలతో పనిచేశారు. తెలంగాణ భవన్ నిర్మాణం జరిగినన్ని రోజులు నాతో పాటే ఉంటూ అత్యంత బాధ్యతతో వ్యవహరించెటోడు. తెలంగాణ నలుమూలల నుంచి జిల్లాల నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చే కార్యకర్తలను, పార్టీ నాయకులను ఓపికతో పలుకరిస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుని, ఆప్యాయత కనబరిచిన గొప్పగుణం శ్రీనివాస్‌రెడ్డిది. వారికి పార్టీ శ్రేణుల్లో ప్రత్యేక గౌరవమున్నది. ముఖ్యంగా పార్టీ ఎదుర్కొన్న క్లిష్ట సమయాల్లో ఒక పెద్దమనిషిగా శ్రీనివాసరెడ్డి కనబరిచిన చొరవ నన్నెంతో ఆకట్టుకునేది. కష్ట సమయాల్లో తెల్లారకముందే ఇంటికి వచ్చి నాతో పాటు కూసునేటోడు. ‘గాదానికి ఆలోచనెందుకన్నా..గదేమయిద్దే యేంగాదు’ అని నాకు ధైర్యాన్నిచ్చేటోడు. అవసరమైతే ఇంటికి పోకుండా, నాలుగైదు రోజులపాటు నాతోనే ఉండేటోడు. నాతోనే కూసునేటోడు. తెలంగాణ సాధన అనివార్యం. ‘నీతోకాకుంటే తెలంగాణ రాదు’ అని స్పష్టంగా చెప్పి నాకు భరోసాగా మాట్లాడేటోడు. నాతో పాటు ఇతర నాయకులకూ ధైర్యం చెప్పేటోడు. అదీ శ్రీనివాసరెడ్డి గొప్పతనం. ఆయనకు ఇప్పుడు 85 ఏండ్ల వయసు వచ్చినా ఇంకా పార్టీకోసం, తెలంగాణ కోసం పనిచేస్తూనే ఉండడం గొప్ప విషయం.
హోదాతో నిమిత్తం లేకుండా తనతో పాటు 25 ఏండ్లు అవిశ్రాంతంగా కలిసి పనిచేసిన శ్రీనివాసరెడ్డిని ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘనంగా సతరించారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు, గురువారం మధ్యాహ్నం ఎర్రవెల్లి నివాసానికి శ్రీనివాస్‌రెడ్డి దంపతులను వారి కుమారుడు, కూతురు చేరుకున్నారు. వారికి మధ్యాహ్న భోజనంతో కేసీఆర్ ఘనంగా ఆతిథ్యమిచ్చారు. మనసువిప్పి చాలాసేపు ముచ్చటించారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు కలిసి సాగిన వారి ప్రయాణాన్ని ఇరువురూ నెమరువేసుకున్నారు. ఎదుర్కొన్న కష్ట సుఖాలను ఒడిదొడుకులను గుర్తుచేసుకున్నారు. లంచ్ తర్వాత శ్రీవాస్‌రెడ్డి దంపతులను కేసీఆర్-శోభమ్మ దంపతులు సంప్రదాయ పద్ధతిలో శాలువా కప్పి ఘనంగా సతరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మెడకు కేసీఆర్ లాకెట్ తొడిగారు. ఊహించని రీతిలో జరుగుతున్న సతారాన్ని చూసి ‘అన్నా.. ఎందుకే గివన్నీ’ అని శ్రీనివాసరెడ్డి అంటుంటే వారించిన కేసీఆర్ ‘అన్నా ఇది నీకు ప్రేమతో చేయించిన లాకెట్.. అండ్ల ‘విత్ లవ్ ఫ్రమ్ కేసీఆర్’ అని రాసివుంటది సూసో’ అని అనగానే నవ్వులు విరిశాయి. సతార కార్యక్రమం అనంతరం కేసీఆర్ దంపతులు కారు దాకా వచ్చి శ్రీనివాసరెడ్డి దంపతులకు ఆత్మీయంగా వీడోలు పలికారు.
ఇది కేవలం తనకు జరిగిన సతారం మాత్రమే కాదని, తనలాంటి ఎందరో తెలంగాణ వాదులకు జరిగిన సతారమని ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ జాతిని మేలొల్పిన ఉద్యమ రథ సారథి, తెలంగాణ ప్రగతి ప్రధాత కేసీఆర్ అని కొనియాడారు. వారి వద్ద 25 ఎండ్లపాటు పనిచేయడం తనకు దకిన అదృష్టం, గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం రాకపోయేదని, తెలంగాణ కోసం జీవితాన్ని అర్పించిన త్యాగశీలి కేసీఆర్ అని కొనియాడారు. ఆత్మీయతకు ఆప్యాయతకు నిలువుటద్దం కేసీఆర్ అని, కేసీఆర్ లాగా ప్రజల పట్ల అంతగా నెనరున్న జననేత మరెకడా కానరాడని ప్రశంసించారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ స్థానం శాశ్వతంగా ఉంటుందని శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘నన్ను కుటుంబ సమేతంగా ఆదరించి, బట్టలుపెట్టి ‘ప్రేమతో మీ కేసీఆర్’ (విత్ లవ్ ఫ్రమ్ కేసీఆర్) అని నాకు లాకెట్ వేయడం జీవితంలో మరచిపోలేని సన్నివేశం. ఈ గుర్తింపు నాలాంటి సామాన్య తెలంగాణ వాదులందిరికీ దకిన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన తనకు అమెరికా వెళ్లి పోవడం తప్పనిసరిగా మారిందనీ, పార్టీ కార్యకర్తలను, నాయకులను, కేసీఆర్‌ను, తెలంగాణ గడ్డను వదిలి వెళుతున్నందుకు చాలా బాధగా ఉందనీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వాదులందరి పక్షాన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
శ్రీనివాస్‌రెడ్డి కృషి, పట్టుదల, అంకితభావాన్ని దగ్గరి నుంచి చూసిన నేను వారి సేవలకు గుర్తింపుగా రాష్ట్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకున్న. నాటి నుంచి నేటి వరకు ‘శీనన్నా’ అని ఆప్యాయంగా పిలుచుకునే నా అత్యంత ఆత్మీయ మనిషి శ్రీనివాస్‌రెడ్డి. ఆయకు ఇద్దరు పిల్లలు. ఒక బిడ్డ. ఒక కొడుకు. వాళ్లు ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడిపోయిండ్రు. తల్లిదండ్రులకు వయసు పెరిగిపోతున్న కారణంగా వారి బాగోగులు చూసుకోవాలని వారిని అమెరికాకు శాశ్వతంగా తీసుకుని పోతున్నరు. ఒక వయసు దాటిన తర్వాత పిల్లల ఆలోచనలను అర్థం చేసుకోవాల్సి ఉంటది కదా. అందుకని శ్రీనివాస్‌రెడ్డి దంపతులు తెలంగాణగడ్డను విడవడం ఇష్టం లేకున్నా అమెరికాకు పోవడానికి అంగీకరించిండ్రు. వాళ్లను తీసుకపోవడానికి పిల్లలిద్దరూ వచ్చిన సందర్భంలో నాకీ విషయమంతా చెప్పిండ్రు. విషయం తెలిసి నాకూ బాధగా అనిపించింది. తప్పదు కదా. కుటుంబ సభ్యుడి లాంటి శ్రీనివాసరెడ్డి నాకెంతో ఇష్టమైన సహచరుడు తెలంగాణ వీడిపోతుంటే ఘనంగా వీడోలు పలకాలని ‘అలయ్ బలయ్’ తీసుకోవాలని అనిపించింది. వారిని ఇంటికి పిలుచుకుని వారితో భోజనం చేసి నా వంతుగా అభిమానంతో సతరించుకున్న. ‘తెలంగాణ భవన్లో పార్టీ తరుఫున నేతలు, కార్యకర్తలు కూడా శ్రీనివాసరెడ్డిని ఘనంగా సతరించుకుంటం’ అంటున్నరు. పార్టీకోసం ఎంతగానో కృషి చేసిన వారిని పార్టీ కూడా ఘనంగా సతరించుకోవాలనుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది.
ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి కొడుకు, కూతురు దశాబ్దాల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో బాధ్యత కలిగిన బిడ్డలుగా తల్లిదండ్రులను అమెరికాకు తీసుకెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వారికి కూడా గ్రీన్‌కార్డు మంజూరు చేయించుకున్నారు. అనివార్య పరిస్థితుల్లో అమెరికా పౌరుడిగా మారిన శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ గడ్డను వీడి అమెరికాకు పయనం కాబోతున్నారు.