హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : కొత్త సంవత్సరంలో వ్యవసాయం, సాగునీటి రంగాలు గాడినపడాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో తెలంగాణ రైతులు, మహిళలు, సకలజనులు సుఖసంతోషాలతో జీవించాలని అభిలషించారు. కొత్త ఏడాదిలో మరిన్ని విజయాలు సిద్ధించాలని కోరుకున్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ బుధవారం ఒక ప్రకటనలో ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ గతేడాది ప్రజాసమస్యల పరిష్కారానికి చేసిన అవిరళ కృషిని గుర్తుచేసుకున్నారు. పార్టీ శ్రేణులు, నేతలు పోరాడి సాధించిన విజయాలను స్మరించుకున్నారు. ఇదే స్ఫూర్తితో నూతన సంవత్సరంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ రెట్టించిన పట్టుదలతో పనిచేస్తుందని స్పష్టం చేశారు. నూతన వత్సరంలో యువత, వృత్తి నిపుణులు నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకొని తెలంగాణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు.