హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి తరఫున క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. రైతులను ఆదుకొనే దిశగా పోరాటం ఉధృతం చేయాలని సూచించారు. యశోద దవాఖాన నుంచి శనివారం డిశ్చార్జి అయిన కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకున్నారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ నేతలు కేసీఆర్‌ను కలిశారు.
నివాసంలో పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేతలతో ప్రత్యేకంగా కేసీఆర్ మాట్లాడారు. పదవులు, అధికారం శాశ్వతం కాదని, రైతులు, ప్రజల పక్షాన పోరాటం నిజాయితీగా ఉండాలని చెప్పారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు బీఆర్ఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయని గు ర్తుచేసిన కేసీఆర్ ప్రాజెక్టు పూర్తి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఇందుకు కోసం ఏం చేయాలనే దానిపై చర్చించారు. కాంగ్రెస్ నేతలు చేసే తాత్కాలిక చర్యలకు, తాటాకు చప్పుళ్లకు చలించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి డిమాండ్లను లైవ్‌లో ఉంచాలని పిలుపునిచ్చారు.
స్వల్ప అస్వస్థతతో గురువారం హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద దవాఖానలో అడ్మిట్ అయిన కేసీఆర్ ఆరోగ్యం మెరుగ్గా ఉన్నదనే వైద్యుల సలహా మేరకు శనివారం డిశ్చార్జి అయ్యారు. దవాఖానలో రెండు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ సాధారణ వైద్య పరీక్షలను చేయించుకున్నారు. ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నదని, సోడియం లెవల్స్ కొద్దిగా పెరిగాయని వైద్యులు తెలిపారు. వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఆ తర్వాత మరోసారి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. అనంతరం డిశ్చార్జి చేశారు. వైద్యుల సూచనతో వచ్చే గురు, శుక్ర వారాల్లో వైద్య పరీక్షల నిమిత్తం మరోసారి యశోద దవాఖానకు కేసీఆర్ వెళ్లే అవకాశం ఉన్నది. అయితే, పూర్తి ఆరోగ్యంతో ఉన్న కేసీఆర్ దవాఖానలో వైద్య పరీక్షల నడుమ విరామ సమయంలో రాష్ట్రంలో సాగునీరు, రైతులు, వ్యవసాయం, తదితర ప్రజా సమస్యల మీద, రెండు రోజులుగా పార్టీ సీనియర్లతో చర్చిస్తూ సమాచారం తీసుకుంటూ తదనుగుణంగా సూచలిచ్చిన సంగతి తెలిసిందే.
యశోద దవాఖాన నుంచి నందినగర్‌లోని తన నివాసానికి చేరుకొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు శనివారం పరామర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నివాసంలో సందడి నెలకొన్నది. కేసీఆర్‌ను కలిసి యోగాక్షేమాలు తెలుసుకున్నారు. ఆయన కూడా ఎంతో ఓపికతో అభిమానులను పలకరించారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై కేసీఆర్ ఆరా తీశారు. ఆయనను కలిసి వారిలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మె ల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యా దవ్, గువ్వల బాలరాజు, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు.