KCR | హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్ చెల్లదని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఎంక్వైరీ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డికి ఈ అంశాలపై విచారణ జరిపే అర్హత లేదని తేల్చిచెప్పారు. విచారణ కమిషన్ బాధ్యతల నుంచి వెంటనే స్వచ్ఛందంగా వైదొలగాలని (రెక్యూజ్ కావాలని) జస్టిస్ నర్సింహారెడ్డికి కేసీఆర్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు కేసీఆర్ శనివారం జస్టిస్ నర్సింహారెడ్డికి ఒక లేఖ రాశారు. తెలంగాణలో గత పదేండ్ల కాలంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై విచారణ జరిపేందుకు గత మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఏకసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్- 1952 కింద ఏర్పాటైన ఈ కమిషన్ ఇప్పటికే విచారణను ప్రారంభించి, తెలంగాణ విద్యుత్తు సంస్థలకు చెందిన దాదాపు 25 మంది అధికారులను, మాజీ అధికారులను విచారించింది. దీంతో పాటు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఈ నెల 15వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ 12 పేజీల సుదీర్ఘ లేఖను కమిషన్‌కు పంపించారు. కమిషన్ టర్మ్స్ అంఢ్ రిఫరెన్సెస్‌లో ప్రభుత్వం పేర్కొన్న అంశాలకు, జస్టిస్ నర్సింహారెడ్డి విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ ఆ లేఖలో సూటిగా, దీటుగా బదులిచ్చారు. ‘న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు ప్రభుత్వానికి సూచించకుండా, విచారణ కమిషన్ బాధ్యతలు స్వీకరించడం విచారకరం. చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించడమే కాకుండా, అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే సమావేశం నిర్వహించి, పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. చివరికి న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీల అధికార పరిధి గురించి చట్టంలో ఏముందో కూడా గమనించకుండా మీరు మాట్లాడారు’ అని కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు.
చట్టం ప్రకారమే మా నిర్ణయాలు
తమ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి తెలంగాణ విద్యుత్తు రంగం ఎంతటి తీవ్ర సంక్షోభంలో ఉందో, రైతులు, పారిశ్రామికవేత్తలు, గృహ వినియోగదారులు, వివిధ వర్గాల ప్రజలు కరెంటు లేక, కోతలతో, కొరతలతో ఎంత అవస్థపడ్డారో కేసీఆర్ ఆ లేఖలో గుర్తుచేసారు. ఈ సంక్షోభం నుంచి తెలంగాణ ప్రజలను బయటపడేసేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకున్నదనీ, ఎలక్ట్రిసిటీ యాక్ట్ -2003లోని నిబంధనలను సంపూర్ణంగా అనుసరిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలకు అన్ని రకాల అనుమతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆమోదాలు ఉన్నాయని వివరించారు. అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ తెలంగాణ ఈఆర్సీ ఆమోదించిన సంగతిని గుర్తుచేశారు. సివిల్ కోర్టుతో సమానమైన ఈఆర్సీ క్వాసీ జ్యుడీషియల్ బాడీ (న్యాయ ప్రాధికార సంస్థ) అనీ, అది ఇచ్చిన తీర్పులపై ఎగ్జిక్యూటివ్ విభాగమైన ప్రభుత్వం ఎలా విచారణకు ఆదేశించగలదని ప్రశ్నించారు. ఈఆర్సీ తీర్పులపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ (ఆప్టెల్)కు అప్పీలు చేసుకోగలుగుతారని, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవాల్సి ఉంటుందని, అందువల్ల విచారణ కమిషన్ వేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని, విద్యుత్తు చట్టం -2003 దీన్ని స్పష్టంగా పేర్కొన్నదని, అందువల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చట్ట ప్రకారం చెల్లదని లేఖలో పేర్కొన్నారు. కమిషన్ ఏర్పాటే చట్ట విరుద్ధమైనప్పుడు, జస్టిస్ నర్సింహారెడ్డి విచారణ జరపడమనేదే చెల్లదని, అందువల్ల దాని ముందు హాజరయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టంచేశారు. అదీగాక ఒక విచారణ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా, ఎంక్వైరీ ఇంకా పూర్తి కాకుండానే జస్టిస్ నర్సింహారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి.. ఇప్పటికే తప్పు జరిగిపోయింది, ఆర్థికంగా ఎంత నష్టం వాటిల్లిందో మాత్రమే లెక్క వేయాల్సి ఉందన్నట్టుగా మాట్లాడటంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలనే ముందస్తు వైఖరితోనే జస్టిస్ నర్సింహారెడ్డి ఉన్నట్టు ఈ నెల 11న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాటలు స్పష్టంచేశాయని, అందువల్ల కమిషన్ ముందు హాజరవడం నిష్ప్రయోజనమని తాను భావిస్తున్నట్టు తేల్చిచెప్పారు.
ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదు
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో నెలకొన్న కరెంటు కొరత, తీవ్ర విద్యుత్తు సంక్షోభం నేపథ్యంలో అప్పటి డిమాండ్ దృష్ట్యా వీలైనంత వేగంగా విద్యుత్తు కొనుగోలు చేయాల్సి వచ్చిందని కేసీఆర్ తన లేఖలో తెలిపారు. తెలంగాణకు సమీప రాష్ర్టాల్లో ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే మిగులు విద్యుత్తు ఉన్నదనీ, అందువల్లే అక్కడి నుంచి కరెంటు కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్తు సంస్థలు కొనుగోలు ఒప్పందం చేసుకున్నాయని వివరించారు. ఆనాడు తెలంగాణ దక్షిణ గ్రిడ్‌లో మాత్రమే ఉండటం, నేషనల్ గ్రిడ్‌తో అనుసంధానం కాకపోవడంతో, ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు సరఫరా చేసుకోవడం కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్ద 2000 మెగావాట్లకు డెడికేటెడ్ కారిడార్ బుక్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. పీజీసీఐఎల్ నిబంధనల ప్రకారం లాంగ్ టర్మ్ యాక్సెస్ ఒప్పందం చేసుకోవాలంటే, ఏదో ఒక పీపీఏ తప్పనిసరని, ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న పీపీఏ ఆధారంగా పీజీఐసీఎల్తో ఒప్పందం జరిగిందని వివరించారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం, పీజీసీఐఎల్ కారిడార్ ద్వారా కరెంటు సరఫరా వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదని స్పష్టంచేశారు.
ప్రభుత్వ విచక్షణ మేరకే యాదాద్రి, భద్రాది ప్లాంట్లు
దామరచర్లలో స్థాపించిన యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంటు, మణుగూరులో స్థాపించిన భద్రాద్రి ధర్మల్ పవర్ ప్లాంటుపై ఇప్పటి ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలు ఏమాత్రం సహేతుకం కావని కేసీఆర్ పేర్కొన్నారు. ‘ఒక విద్యుత్తు కేంద్రాన్ని ఎక్కడ స్థాపించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన విషయం. తెలంగాణ దక్షిణ ప్రాంతంలో ఉన్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఒక్క భారీ విద్యుత్తు కేంద్రం కూడా లేదు. ప్లాంటు నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ ఎంతో పెరుగుతుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య మౌలిక సదుపాయాల కల్పనలో ప్రాంతీయ సమతుల్యతను సాధించడం అనేది ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అప్పటి ప్రభుత్వం నల్లగొండ జిల్లాలోని దామరచర్లను యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి ఎంపిక చేసింది’ అని వివరించారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో అయితే రెండేండ్లలోనే ప్లాంటు నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని బీహెచ్ఈఎల్ మాట ఇవ్వడం వల్లే అంగీకరించినట్టు పేర్కొన్నారు. 2017 సంవత్సరం దాకా సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడవచ్చని అప్పటి 12వ పంచవర్ష ప్రణాళిక పేర్కొన్నదని, కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని తన లేఖలో ఉదహరించారు.
ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థల మధ్యే ఒప్పందాలు
ప్రభుత్వరంగ సంస్థలను ప్రోత్సహించడం కోసమే యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్కు అప్పగించామని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలకు నామినేషన్‌పై పనులు అప్పగించవచ్చని చట్టం పేర్కొన్నదని, తెలంగాణనే కాకుండా దేశంలోని అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు బీహెచ్ఈఎల్కు నామినేషన్‌పై విద్యుత్తు ప్రాజెక్టులు అప్పగించాయని తెలుపుతూ వారి జాబితాను కేసీఆర్ బయటపెట్టారు. ‘ఎంవోయూ కుదిరింది ఛత్తీస్‌గఢ్ సర్కారుతో. తెలంగాణ విద్యుత్తు సంస్థలు పీపీఏ చేసుకున్నది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ కరెంటు సంస్థలతో. డెడికేటెడ్ లైన్ కోసం ఒప్పందం చేసుకున్నది కేంద్ర ప్రభుత్వ సంస్థ పీజీసీఐఎల్‌తో. థర్మల్ ప్లాంట్ల నిర్మాణం కోసం ఒప్పందం చేసుకున్నది బీహెచ్ఈఎల్తో. ఇందులో ఎక్కడా ప్రైవేటు సంస్థల ప్రమేయం లేదు. తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు మరో ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలతో ఒప్పందం చేసుకున్నప్పుడు అవినీతి, దుబారా వంటి ఆరోపణలకు ఆస్కారమే ఉండదు’ అని కేసీఆర్ తేల్చిచెప్పారు.
నిరంతరాయ విద్యుత్తునిచ్చిన ఏకైక రాష్ట్రం
పదేండ్ల కింద తెలంగాణ అంధకారంలో ఉండగా, అప్పటి తమ ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పనిచేసి వెలుగులు నింపిందనీ కేసీఆర్ తన లేఖలో సోదాహరణంగా వివరించారు. ‘రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7,778 మెగావాట్లుగా ఉన్న రాష్ట్ర స్థాపిత విద్యుత్తు, తర్వాత సుమారు 20,000 మెగావాట్ల పైచిలుకుకు చేరింది. అటు సరఫరా, పంపిణీ వ్యవస్థలు పటిష్ఠపడి సక్రమ విద్యుత్తు సరఫరా చేసే స్థాయికి ఎదిగింది. తద్వారా భారతదేశంలోనే నాణ్యమైన, నిరంతరాయ (24X7) కరెంటును అన్ని రంగాలకూ సరఫరా చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ వినుతికెక్కింది. 2014లో రాష్ట్రం ఆవిర్భవించిన నాడు తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 1,196 యూనిట్లు ఉండగా, పదేండ్ల కాలంలోనే అది 2,349 యూనిట్లకు పెరిగింది’ అని కేసీఆర్ అంకెలతో సహా కళ్లకు గట్టారు. తెలంగాణలో ఉన్న అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఆ సందర్భంలో రాష్ట్ర ప్రజలు పడుతున్న అవస్థలను పరిగణనలోకి తీసుకుని అప్పటి ప్రభుత్వం చేపట్టిన చర్యలను, సాధించిన ఫలితాలను అభినందించాల్సింది పోయి జస్టిస్ నర్సింహారెడ్డి విమర్శలు చేయడం తనకెంతో బాధ కలిగించిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2015లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండగా విద్యుత్తు అంశాలపై కొన్ని ఆరోపణలు చేసారని, వాటిని ఈఆర్సీ తోసిపుచ్చిందని, దాంతో అప్పుడు ఆయన అప్పీలుకు కూడా వెళ్లలేదని, పదేండ్ల తర్వాత, తాను సీఎం అయ్యాక ఇప్పుడు చట్టవిరుద్ధంగా, రాజకీయ కక్ష సాధింపుతో విచారణకు ఆదేశించారని కేసీఆర్ తప్పుబట్టారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైనప్పటికీ జస్జిస్ నర్సింహారెడ్డి తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నదని, విచారణ పూర్తికాకముందే తీర్పు ప్రకటించినట్టుగా మాట్లాడారని, అందువల్ల కమిషన్ బాధ్యతల నుంచి ఆయన స్వచ్ఛందంగా వైదొలగాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.