‘కేంద్రం తెస్తున్న ఎలక్ట్రిసిటీ బిల్లు వందశాతం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం. దానిని చాలా బలంగా వ్యతిరేకిద్దాం. ఈ బిల్లు రాష్ర్టాల హక్కులను సమాధి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఈ బిల్లు వస్తే వాళ్లు చెప్పినట్టు కరెంట్ ఇవ్వాలి. పంపిణీ అంతా ప్రైవేట్‌కు అప్పగించే వ్యవస్థ వస్తుంది. ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తరు. సబ్సిడీ ఇవ్వద్దంటరు.
ఇప్పుడు 24 గంటలు ఇస్తున్నం. అది వస్తే ఇచ్చే ప్రసక్తి ఉండదు. మీమీ రాష్ర్టాల్లో ఇస్తున్న సబ్సిడీలన్నీ ఎత్తేయాలని అంటున్నరు. ఇది మన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఈ బిల్లుపై మనం గట్టిగ కొట్లాడుదాం’ అని దేశంలోని వివిధ రాష్ర్టాల సీఎంలకు నాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేఖలు రాశారు.
హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘మెడ మీద తలకాయ తెగ్గోసినా సరే. కేసీఆర్ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నా రైతు మోటరుకు మీటరు పెట్టం. పెట్టే ప్రసక్తేలేదని బాజాప్తా కేంద్రానికి చెప్పిన’ అని కేంద్ర ప్రతిపాదిత విద్యుత్తు చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా నాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్పష్టంచేశారు. చాపకింద నీరులా రాష్ట్రంలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ప్రయత్నాలు సాగుతున్న దశలో కేసీఆర్ హయాంలో కేంద్రాన్ని ఎదుర్కొన్న తీరుపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో రైతాంగంపై నాడు కేసీఆర్ ఈగ వాలనివ్వకుండా అడ్డుకోగా, ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రం ఎట్లా చెప్తే అట్లా తలాడిస్తూ రైతులపై భారం మోపే చర్యలపై విస్మయం వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు చట్ట సవరణ బిల్లు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని నాడు కేసీఆర్ ఆ బిల్లుకు వ్యతిరేకంగా మద్దతును కూడగట్టారు. రాష్ర్టాల హక్కులను కేంద్రం కాలరాచే విధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని, అది సమాఖ్యస్ఫూర్తికి గొడ్డలిపెట్టులాంటిదని వాదించారు.
విద్యుత్తు చట్ట సవరణ బిల్లుపై నాడు కేసీఆర్ ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులతోను నేరుగా కలిసి చర్చించారు. తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ సీఎంలతో ఆయన మాట్లాడారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ఆ పర్యవసానాల ఫలితంగా కేసీఆర్ ఇచ్చిన చైతన్యంతో తెలంగాణ సహా ఆయా రాష్ర్టాలు కేంద్రానికి లేఖలు రాశాయి. నాటి ఆంధ్రప్రదేశ్ సహా మరికొన్ని రాష్ర్టాలు వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడతామని ముందుకొచ్చాయి. ఆయా రాష్ర్టాల్లో రైతులు అక్కడి ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టారు. తెలంగాణలో కేసీఆర్ మాదిరిగా పోరాటం చేయాలనే డిమాండ్ దాదాపు 16 రాష్ర్టాల్లో వ్యక్తంకావడం గమనార్హం.
ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిలో వ్యవసాయం, గృహ వినియోగదారులకు సబ్సి డీ చెల్లించాలని కేంద్రం ప్రతిపాదిత బిల్లులో పేర్కొంటే అది సాధ్యం కాదని నాడు కేసీఆర్ స్పష్టంచేశారు. డీబీటీ విధానం రైతాంగానికి, నిరుపేదల సంక్షేమానికి పూర్తి వ్యతిరేకమైనదని కేంద్రానికి తేల్చిచెప్పారు. కేంద్రం ఏ ప్రజావ్యతిరేక విధానం తీసుకున్నా సరే దాన్ని నిరభ్యంతరంగా తిరస్కరిస్తామని తెలిపారు. ఒకవేళ డీబీటీ విధానాన్ని అనుసరిస్తే అది తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం కలుగుతుందని చెప్పారు.
తమ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్తును ఆపేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుందని, తాము ఎట్టిపరిస్థితుల్లో అలా చేయలేమని ప్రధాని మోదీకి రాసిన లేఖలో స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఎలాంటి సవరణ చేయాలని చూసినా మా ప్రభుత్వం తప్పకుండా అభ్యంతరం తెలియజేస్తుంది’ అని ఆ లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నుంచి మొదలుకుంటే ఇతర కేంద్ర మంత్రులు, కేంద్ర విద్యుత్తు శాఖ ఒకవైపు ప్రభుత్వపరంగా మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం వినడం లేదని పవర్ జనరేషన్ కార్పొరేషన్ల (డిస్కంలకు)ను బెదిరింపులకు గురిచేసినా సరే విద్యుత్తు చట్టసవరణ బిల్లుకు నాడు తెలంగాణ ససేమిరా అని తేల్చిచెప్పింది.
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినా ఆనాటి సీఎం కేసీఆర్ మొండిగా ఎదుర్కొన్నారు. తెలంగాణ రైతు ప్రయోజనాలే తమకు ముఖ్యమని అనేక వేదికలపై స్పష్టంచేశారు. చివరికి అసెంబ్లీలో కేంద్ర ప్రతిపాదిత బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానమే చేయించారు. ‘కేసీఆర్ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రైతుల మోటర్లకు మీటర్లు పెట్టంగాక పెట్టం’ అని స్పష్టంగా తేల్చిచెప్పారు. రాష్ర్టాలకు ఇచ్చే ఎఫ్ఆర్బీఎం పరిమితిలో కేంద్రం 0.5 శాతం కోత విధించింది. దీని ఫలితంగా రాష్ర్టానికి ఏటా రూ.5,000 కోట్ల మేర నష్టం వాటిల్లింది. రాష్ట్ర రైతాంగం సంక్షేమం కోసం కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా, ఎన్నివేల కోట్ల నష్టం వాటిల్లినా భరించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు.