హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా శ్రీసీతారాములు దీవెనలు అందించాలని ప్రార్ధించారు. హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడు, జగన్మాత సీతాదేవిని వివాహమాడే పర్వదినాన్ని శ్రీరామ నవమిగా పండుగలా నిర్వహించుకుంటామని, భారతీయ సాంస్కృతిక, సామాజిక, కుటుంబ జీవన గమనంలో సంప్రదాయాలు, విలువలు, ధర్మానికి ప్రాధాన్యమిస్తూ సాగిన శ్రీసీతారాముల జీవితం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆదర్శ దంపతులుగా సీతమ్మ, రామచంద్రులవారికి హిందూ సంప్రదాయంలో పవిత్రమైన స్థానం ఉన్నదని తెలిపారు. కష్టాలు, త్యాగాలతో కాలపరీక్షలను నెగ్గి నిలిచిన సీతారాముల ప్రేమ బంధం అజరామరం, ఆదర్శనీయమని కీర్తించారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా, ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా శ్రీసీతారాముల చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలకు అందాలని కేసీఆర్ ప్రార్థించారు.