KCR : శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు, జగన్మాత సీతాదేవిని వివాహమాడే పర్వదినముగా శ్రీరామ నవమిని జరుపుకుంటారని కేసీఆర్ తెలిపారు. వివాహం అనే పవిత్ర బంధంతో ఒక్కటయ్యే ఆలుమగల అన్యోన్యానినికి ప్రతీకగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం నిలుస్తుందనీ గులాబీ అధినేత అన్నారు.
భారతీయ సాంస్కృతిక సామాజిక కుటుంబ జీవన గమనంలో సంప్రదాయాలు, విలువలకు, ధర్మానికి ప్రాధాన్యమిస్తూ సాగిన సీతారాముల భార్యాభర్తల బంధానికి హిందూ మత సాంప్రదాయంలో పవిత్రమైన స్థానం ఉన్నదని కేసీఆర్ అన్నారు. పలు కష్టాలు, త్యాగాలతో కాలపరీక్షలకు ఎదురొడ్డి నిలిచిన సీతారాముల ప్రేమ బంధం అజరామరం, ఆదర్శనీయం అని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా, ప్రజలంతా సుఖ శాంతులతో జీవించేలా శ్రీ సీతారాముల చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలకు అందాలని కేసీఆర్ ప్రార్ధించారు.