హైదరాబాద్: మాజీ మంత్రి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం వ్యక్తంచేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి మరణం తీవ్రంగా బాధించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి మరణం బాధాకరమని హరీశ్‌రావు అన్నారు. ఇలాంటి కష్ట కాలంలో లక్ష్మారెడ్డి గారికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. వారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని వెల్లడించారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్వేత.. చెన్నైలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివదేహాన్ని మంగళవారం ఉదయం స్వగ్రామమైన తిమ్మాజిపేట మండలం ఆవంచకు తరలించారు. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.